దళితుల కాల్చివేత కేసులో 20 మందికి జీవిత ఖైదు

హర్యానా : దళితులను కాల్చివేసిన కేసులో 20 మందికి ఢిల్లీ హైకోర్టు జీవిత ఖైదు విధించింది. హర్యానాలోని మిర్చ్‌పూర్‌లో 2010, ఏప్రిల్ 21న అగ్ర కులస్తులు.. దళితులపై దాడి చేశారు. ఈ దాడిలో దళితుల ఇండ్లకు నిప్పంటించారు. దీంతో మానసిక స్థితి సరిగా లేని 17 ఏళ్ల అమ్మాయి, ఆమె తండ్రి మంటల్లో కాలి చనిపోయారు. ఈ కేసులో ముగ్గురికి దిగువ కోర్టు ఇప్పటికే జీవిత ఖైదు విధించగా.. ఇవాళ ఢిల్లీ కోర్టు మరో 17 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. కేసు పూర్వపరాలు.. 2010, ఏప్రిల్ 21న మిర్చ్‌పూర్ గ్రామంలోని దళిత కాలనీలో ఓ అగ్రకులానికి చెందిన వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో ఓ కుక్క అరవగా.. దాన్ని రాయితో కొట్టాడు అగ్రకులానికి చెందిన వ్యక్తి. దీంతో దళితులకు, అగ్రకులాల వారికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహంతో ఉన్న అగ్ర కులాలు.. దళిత కాలనీల్లోని నివాసాలకు నిప్పు పెట్టారు. భయంతో దళితులు పరుగులు పెట్టారు. 17 ఏళ్ల అమ్మాయికి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయింది. ఆ అమ్మాయితో పాటు ఆమె తండ్రి మంటల్లో చిక్కుకొని సజీవదహనమయ్యారు. 254 దళిత కుటుంబాలు గ్రామాన్ని వదిలి వెళ్లిపోయాయి. మిర్చ్‌పూర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. 2016 దాకా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఇప్పుడిప్పుడే అక్కడ పరిస్థితులు మెరుగుపడ్డాయి.
× RELATED సీఎం సభాస్థలిని పరిశీలించిన జీవన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి