20 మంది పిల్లలకు తల్లి!

ఒకరిద్దరు పిల్లలను కని, పెంచడానికి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఓ తల్లి ఏకంగా 20 మందికి జన్మనిచ్చింది. ప్రస్తుతం 21వ బిడ్డ కోసం చూస్తున్నది.
ఐదు దశాబ్దాల క్రితం ఒక్కో మహిళ 5 నుంచి 10 మందికి పైగా సంతానం కలిగి ఉండేవారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఇప్పుడా పరిస్థితి లేదు. కానీ, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన 46 యేండ్ల నోయల్, 42 యేండ్ల సుయ్ రడ్‌ఫోర్డ్ దంపతులిద్దరూ 20 మంది పిల్లలకు జన్మనిచ్చి అతి పెద్ద కుటుంబంగా మారారు. అంతమంది పిల్లలున్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని హాయిగా చూసుకుంటున్నారు. వారి చదువు, తిండికి అయ్యే ఖర్చులన్నీ వారే సొంతంగా భరిస్తున్నారు. ఒకే కుటుంబంలో 20 మంది పిల్లలుండడం ఈ రోజుల్లో చాలా అరుదైన విషయం. అందుకే వీరి కుటుంబాన్ని స్థానికులంతా ముద్దుగా ఆర్మీ బృందం అని పిలుస్తుంటారు. బ్రిటన్ దేశంలోనే అతి పెద్ద కుటుంబంగా అక్కడి వాసులందరికీ నోయల్, సుయ్డ్‌ఫ్రోర్డ్ పరిచయమే. ఇప్పుడు ఈ అతిపెద్ద కుటుంబంలో మరో అంకె పెరుగనుంది. సుయ్న్‌ఫ్రోర్డ్ నిండు నెలలతో ఉన్నది. మరో కొద్ది రోజుల్లోనే మరొకరికి జన్మనివ్వనున్నది. దీంతో వీరి సంతానం 21కి చేరుకుంటుంది. ఇకనుంచి తాను పిల్లలను కనడం ఆపేస్తానంటున్నది సుయ్. ఈ దంపతులిద్దరూ పిల్లలను కని, పెంచడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ, అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.