కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటన షోపియాన్ జిల్లాలోని రెబ్బన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపగా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అధికార వర్గాలు మాట్లాడుతూ మృతిచెందిన ఉగ్రవాదులను నవాజ్ అహ్మద్ వాగే, యవార్ వనిలుగా గుర్తించామని, వీరిద్దరూ అల్-బదార్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని తెలిపాయి. వీరిద్దరూ గతంలో పలు ఉగ్రదాడులకు పాల్పడ్డారని పేర్కొన్నాయి. ఎన్‌కౌంటర్ ప్రాంతంలో ఉగ్రవాద సాహిత్యం, తుపాకులను స్వాధీనం చేసుకున్నామని వివరించాయి. మరోవైపు యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్న కశ్మీర్ మహిళ షాజియాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధానంగా జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థలో చేరాలంటూ ఫేస్‌బుక్ ద్వారా ఆమె యువకులను ప్రోత్సహిస్తున్నదని పోలీసులు చెప్పారు. ఆమె ఫేస్‌బుక్ ఖాతాను పరిశీలించిన అనంతరం బందీపుర జిల్లాలో అరెస్టు చేశామని తెలిపారు. అనంత్‌నాగ్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులకు షాజియా ఉగ్రవాద సాహిత్యాన్ని అందజేసిందని పేర్కొన్నారు. పోలీసులు, భద్రతా బలగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఆమె ఉగ్రవాదులకు చేరవేసినట్లు తెలుస్తున్నదని చెప్పారు.

Related Stories: