బాలికపై అత్యాచారం కేసులో దోషికి ఉరిశిక్ష

అస్సాం: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన 19 ఏళ్ల యువకుడిని నాగాంన్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రీటాకర్ దోషిగా తేల్చారు. పోస్కో చట్టం కింద చిన్నారిపై అత్యాచారం, హత్య చేసిన దోషికి ఉరిశిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు మైనర్ దోషులకు మూడేండ్ల పాటు జువైనల్ హోంలో ఉంచాలని శిక్ష విధించారు. నాగాంన్ అడిషనల్ ఎస్పీ రిపుల్ దాస్ కేసు విచారణ జరిగిన తీరును మీడియాకు వివరించారు. నాగాంన్ జిల్లా ధనియాబేటీ లగూన్ గావ్‌లో 2018 మార్చ్ 23న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఐదవ తరగతి చదువుతున్న 11 ఏళ్ల చిన్నారిపై జాకీర్ హుస్సేన్(19) అత్యాచారం చేసి సజీవ దహనం చేశారు. తీవ్రంగా గాయపడిన బాలికను స్థానికులు గుహవటి మెడికల్ కాలేజీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతి, అత్యాచార ఘటనపై కేసు నమోదు చేసుకున్న భతద్రవ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏప్రిల్ 28న ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ అత్యాచారం, హత్య ఘటనపై అస్సాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహించారు. దీనిపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శర్భానంద మహిళల, చిన్నారుల రక్షణ కోసం పటిష్ఠమై చట్టం తెస్తామని అసెంబ్లీలో హామి ఇచ్చారు. రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళలకు 30శాతం రిజర్వేషన్ కల్పించి ఎంపిక చేస్తామని వెల్లడించారు. మహిళలు, బాలికల కోసం హెల్ప్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించి దానికి సఖీ అనే పేరుపెట్టారు.

Related Stories: