అనసూయ ప్రేమకోసం...

నితిన్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం అ..ఆ. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి ఉపశీర్షిక. సమంతా, అనుపమ పరమేశ్వరన్ కథానాయికలు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే నెల 6న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. nithin బుధవారం నితిన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి ప్రచార చిత్రాల్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఏప్రిల్ మొదటివారంలో చిత్రీకరణ పూర్తవుతుంది. కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రమిది. త్రివిక్రమ్ తనదైన శైలిలో ఆద్యంతం వినోదప్రధానంగా హృదయానికి హత్తుకునే సంభాషణలతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆనంద్ విహారిగా నితిన్ పాత్ర చిత్రణ నవ్యపంథాలో వుంటుంది. అనసూయ రామలింగం అనే అమ్మాయి ప్రేమను గెలుచుకోవడానికి ఆనంద్‌విహారి ఏం చేశాడన్నది ఆసక్తికరంగా వుంటుంది. మిక్కి జే మేయర్ మెలోడీ ప్రధానంగా చక్కటి స్వరాల్ని అందించారు. ఈ వేసవిలో అందరికి చక్కటి వినోదాన్ని పంచే చిత్రమిది అన్నారు. నదియ, అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావు రమేష్, పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: పి.డి.వి.ప్రసాద్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్.
× RELATED వెంకీ అట్లూరి దర్శకత్వంలో..?