భారత్‌కు డజను పతకాలు

Boxing న్యూఢిల్లీ: అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నీలో భారత జూనియర్ మహిళా బాక్సర్లు దుమ్మురేపారు. సెర్బియా వేదికగా జరిగిన టోర్నమెంట్‌లో భారత అమ్మాయిలు 12 పతకాలు చేజిక్కించుకున్నారు. అందులో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 4 కాంస్యాలు ఉన్నాయి. తమన్నా (48 కేజీలు), అంబెశోరి దేవి (57 కేజీలు), ప్రీతి దహియ (60 కేజీలు), ప్రియాంక (66 కేజీలు) ఫైనల్ బౌట్లలో సత్తాచాటి పసిడి పతకాలు సొంతం చేసుకున్నారు. 48 కేజీల ఫైనల్లో తమన్నా 5-0తో అలెనా ట్రెమసోవ (రష్యా)పై నెగ్గి ఉత్తమ విదేశీ బాక్సర్‌గా ఎంపికైంది. అంబెశోరి దేవి 3-2తో డునా సిపెల్ (స్వీడన్), ప్రీతి 3-2తో క్రిస్టినా కర్టసేవా (ఉక్రయిన్)పై విజయాలు సాధించగా.. ప్రియాంక 5-0తో ఓల్గా పెట్రాష్కో (రష్యా)ను చిత్తు చేసింది. అంజూ దేవి (50 కేజీలు), సిమ్రన్ వర్మ (52 కేజీలు), మాన్షి దలాల్ (75 కేజీలు), తన్షిబిర్ కౌర్ సంధు (80 కేజీలు) ఫైనల్ బౌట్లలో ఓడి రజత పతకాలు దక్కించుకున్నారు. అంతకుముందు సెమీఫైనల్స్‌లో ఆశ్రేయ (63 కేజీలు), నేహ (54 కేజీలు), ఖుషి (70 కేజీలు), అల్ఫియా (ప్లస్ 80 కేజీలు) ఓటమి పాలై కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. భారత్ నుంచి 13 మంది బాక్సర్ల బృందం ఈ పోటీల్లో పాల్గొంటే.. అందులో 12 మంది పతకాలు సాధించడం విశేషం.