జూన్ 11న జీఎస్టీ చివరి భేటీ: అరుణ్‌జైట్లీ

ఢిల్లీ: జూన్ 11న తేదీన జరిగే జీఎస్టీ కౌన్సిల్ భేటీయే బహుశా చివరి సమావేశం అవుతుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి జీఎస్టీ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందన్నారు. సెప్టెంబర్ 2016న జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 15 సార్లు కౌన్సిల్ భేటీ జరిగింది. ఆదివారం జరిగే సమావేశం చివరిది, 16వది. కాగా పలు వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించనున్నట్లు ఆయన వెల్లడించారు. జూన్ 3వ తేదీన జరిగిన 15వ సమావేశంలో సభ్యులు సూచించిన సవరణలు, జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్, రేటు సవరణలను 16వ సమావేశంలో ప్రధానంగా చర్చించి అంగీకారం తెలపనున్నట్లు చెప్పారు. దీంతో పాటు వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన వినతులపై కూడా కౌన్సిల్ చర్చిస్తుందన్నారు. కాగా తమపై విధించిన జీఎస్టీ రేటుపై సమీక్షించాల్సిందిగా ఆటో పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మధ్యశ్రేణి నుంచి లార్జ్ సైజ్ హైబ్రిడ్ కార్లపై విధించే 43 శాతం పన్నును సమీక్షించాల్సిందిగా కోరుతున్నాయి. ఈ పన్ను రేటు ప్రస్తుతం 30.3 శాతంగా ఉంది. అదేవిధంగా టెలికాం సెక్టార్ సైతం తమపై 18 శాతంగా ఉన్న పన్నును సమీక్షించాల్సిందిగా కోరింది. సీవోఏఐ(సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) ఇప్పటికే రెవెన్యూ సెక్రటరీకి ఈ మేరకు ఓ లేఖ రాసింది. ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమ సైతం ఐటీ ఉత్పత్తులపై ఏకరూప పన్ను విధానం తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. జీఎస్‌టీ కౌన్సిల్ ఇప్పటికే దాదాపు అన్ని వస్తు, సేవలపై పన్నులను నిర్ణయించింది. వివిధ రకాల వస్తువులపై 5, 12, 18, 28 శాతంగా పన్నులను ఖరారు చేసింది. బంగారంపై 3శాతం శ్లాబ్‌ను అదేవిధంగా ముడి డైమండ్లపై 0.25శాతం పన్ను రేటును విధించిన విషయం తెలిసిందే.

Related Stories: