పోలీసు కుటుంబీకుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

శ్రీనగర్: కశ్మీర్ పోలీసుల ఇండ్లల్లో ఉగ్రవాదులు చొరబడి .. వాళ్ల కుటుంబీకులను కిడ్నాప్ చేశారు. సుమారు ఆరు పోలీసు కుటుంబాల ఇండ్లపై ఉగ్రవాదులు దాడి చేసినట్లు సమాచారం. మొత్తం 11 మందిని కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. తాజాగా ఉగ్రవాదుల కుటుంబీకుల ఇండ్లపై పోలీసులు దాడి చేసిన నేపథ్యంలో.. దానికి ప్రతీకారంగా ఉగ్రవాదులు ఈ చర్యకు దిగారు. కిడ్నాప్‌లతో ఉగ్రవాదులు వత్తిడి వ్యూహాలను అనుసరిస్తున్నారని పోలీసులు తెలిపారు. పుల్వామా జిల్లాలో ఓ పోలీసును కిడ్నాప్ చేసి విచారించారు. ఆ తర్వాత అతన్ని చితకబాది విడుదల చేశారు. పుల్వామాతో పాటు అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లో ఈ కిడ్నాప్‌లు జరిగాయి. పోలీస్ ట్రైనింగ్ సెంటర్లలో పనిచేస్తున్న మరో ఇద్దర్ని కూడా ఉగ్రవాదులు అపహరించారు. త్రాల్ సెక్టర్‌లో ఓ పోలీసు ఆఫీసర్ కుమారున్ని కూడా ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. అయితే ఆ కుటుంబసభ్యలు తమ కొడుకును వదిలేయాలని ఉగ్రవాదులను వేడుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కశ్మీర్‌లో జరుగుతున్న పరిణామాలపై ఆ రాష్ట్ర మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రం ఆందోళనకరంగా మారిందన్నారు. పోలీసు కుటుంబాలకు చెందన వారిని సురక్షితంగా ఉగ్రవాదుల చెర నుంచి విడిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీనియర్ అధికారులు చెబుతున్నారు. దాదాపు 28 ఏళ్ల తర్వాత కశ్మీర్‌లో మొదటిసారి ఉగ్రవాదులు.. పోలీసుల కుటుంబీకులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

Related Stories: