ఉమ్మడి వరంగల్ జిల్లాకు 100 టీఎంసీలు : సీఎం కేసీఆర్

పాలకుర్తి : దేవాదుల ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు 100 టీఎంసీల నీటిని తీసుకురాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ జన ప్రవహాన్ని చూస్తుంటే అద్భుతమైన మెజార్టీతో దయాకర్ గెలుపు ఖాయం. దయాకర్ గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హుషారున్న మనిషి. మంచి ఎమ్మెల్యే. దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశ్యామలం అవుతది. మల్కాపూర్ లింగంపల్లి రిజర్వాయర్ తెచ్చాం. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల పూర్తి అవుతున్నాయి. దేవాదుల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకే 100 టీఎంసీల నీళ్లు రాబోతున్నాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కరెంట్ పోతది. జాగ్రత్త. కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు 24 గంటల కరెంట్ ఇవ్వలేకపోయాయి. టీఆర్ ప్రభుత్వం చేసిన సంక్షేమం గురించి గ్రామాల్లో ప్రజలు ఉపన్యాసాలుగా చెబుతున్నారు. రైతుబంధును ఐరాస గుర్తించింది. రెండు పంటలకు ఏడాదికి రూ. 8 వేలు ఇచ్చాం. వచ్చే ప్రభుత్వం పది వేలు ఇవ్వబోతున్నాం. పెన్షన్లు రూ. 2016కు పెంచబోతున్నాం. వికలాంగులకు రూ. 3016కు పెంచాం. నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి కింద రూ. 3016లు ఇవ్వబోతున్నాం. ప్రాణం పోయినా అబద్ధాలు చెప్పను. డబుల్ బెడ్ ఇండ్ల పథకం ప్రవేశపెట్టిన అంటే దాని వెనుక పెద్ద ఉద్దేశం ఉంది. ఆడవాళ్లు, భవిష్యత్ తరాలు గౌరవంగా ఉండేలా డబుల్ రూం ఇండ్లు కడుతున్నాం. ఒక్క రూపాయి తీసుకోకుండా ఇండ్లు కట్టిస్తున్నాం. సొంత జాగ ఉన్న వాళ్లకు డబుల్ బెడ్ ఇండ్లు కట్టించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం. సంపద పెంచి పేదలకు, రైతులకు పెంచుతున్నాం. మహిళా సంఘాలు బ్రహ్మాండంగా పని చేస్తున్నాయని కేసీఆర్ స్పష్టం చేశారు.

Related Stories: