100 వంటలు చేస్తుంది!

బెంగళూరుకి చెందిన మెకానికల్ చెఫ్ ఘుమఘుమలాడే భారతీయ వంటకాలు చేస్తుంది. సుమారుగా 100 వంటలను అవలీలగా చేసి పెడుతుంది. ఇందులో ఉండే సూచనలను పాటిస్తూ రుచికరమైన వంటకాలను మనకు రుచి చూపిస్తుంది.

వంట వండాలంటే పెద్ద ప్రహసనమే చేయాలి. కొన్నిసార్లు ఉప్పు, కారాలు ఎక్కువైతే.. కొన్నిసార్లు ఏ రుచిపచి ఉండవు. అన్నీ కుదిరినప్పుడు మాత్రం అవురావురుమంటూ లాగించేస్తాం. అలా రోజూ లొట్టలేసుకుంటూ తినడానికి ఓ రోబో వంట చేయబోతున్నది. మనకు కావాల్సిన వంటకాలకు సంబంధించిన పదార్థాలను ఈ రోబో పైన ఉండే బాక్సుల్లో నింపాల్సి ఉంటుంది. అది వంటకాలకు కావాల్సినంత మోతాదులో తీసుకొని వంట పూర్తి చేస్తుంది. ముందుగా మనకు కావాల్సిన వంటకమేదో దీనికి అనుసంధానమై ఉన్న కంప్యూటర్ సహాయంతో దానికి అసైన్ చేయాలి. దీన్ని బెంగళూరుకి చెందిన సోహన్ సుజే కార్లోస్, అర్పిత్ శర్మ అనే ఇద్దరు తయారుచేశారు. ఇందులో సోహన్ మెషీన్ లెర్నింగ్ రీసెర్చర్, అర్పిత్ ఎయిరోస్పేస్ ఇంజినీర్. వీళ్లిద్దరూ కలిసి ఎంతో శ్రమపడి దీన్ని తయారు చేశారు.

అయితే ఇంకా గ్రైండింగ్, ప్రెషర్ కుక్కింగ్‌లాంటివి ఈ రోబోకు పెద్దగా చేయడం రాదు. ఇప్పటిదాకా ఉప్మా, చోలే మసాలా, మటర్ పన్నీర్, దాల్ తడ్‌ఖా.. ఇలాంటి వందకు పైగా వంటకాలను ఇది చేయగలదు. వంటరాని అమ్మాయిలకు, బ్రహ్మచారులకు ఇదో పెద్ద వరమే అని చెప్పొచ్చు. ఇది ఇంకా ప్రయోగదశలోనే ఉంది. అతి త్వరలోనే దీన్ని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు.