మా నాన్న బతుకుతాడా?

మా నాన్నని వెంటిలేటర్ (కృత్రిమ శ్వాస యంత్రం) మీద పెట్టారు. అందరూ కష్టం బయటకు రాడు అంటున్నారు. వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్లు బతుకుతారా? ఎప్పుడు వెంటిలేటర్ మీద పెడుతారు? ఎన్ని రోజులు ఉంచవచ్చు? మా నాన్న క్షేమంగా బయటకు వస్తారా? - సి. నర్సయ్య, హన్మకొండ

వెంటిలేటర్ మీద పెట్టిన వాళ్లెవరూ బయటకు రారు అనేది తప్పుగా ప్రచారమైన విషయం. ఇప్పుడు పరిజ్ఞానం చాలా పెరిగింది. సాధారణంగా పేషెంట్ జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కండీషన్ చాలా సీరియస్‌గా ఉండి బయటకు రాకపోవచ్చు అని తెలిసి కూడా చివరి ప్రయత్నం కింద వెంటిలేటర్ పెడుతారు. అది కూడా పేషెంట్ బంధువులకి వివరించి, వారి కోరిక మీద, చివరి వరకు ప్రయత్నం చేశామనే సంతృప్తి వారికి ఉండాలని చేస్తారు. ఇలాంటి పరిస్థితులను మనం పరిగణనలోకి తీసుకొని అన్నింటికీ అట్లానే అని అనుకోకూడదు. సాధారణంగా వెంటిలేటర్ ఎప్పుడు పెడుతారంటే.. రక్తంలో ఆక్సిజన్ తక్కువ ఉన్నా, కార్బన్ డయాక్సైడ్ రక్తంలో ఎక్కువగా ఉన్నా, ఎక్కువగా ఆయాసపడుతూ అపస్మారక స్థితిలో ఉన్నా, ఊపిరి తీసుకోకపోతున్నా, ఊపిరి తీసుకోవడానికి అవసరమయ్యే కండరాలు పనిచేయకపోతున్నా, మిగతా అవయవ వ్యవస్థలు సరిగ్గా పనిచేయక వాటి ప్రభావం శ్వాసవ్యవస్థపై ఉన్నా, ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్(న్యూమోనియా) ఉన్నా, సీఓపీడీ, ఉబ్బసం తీవ్రంగా ఉన్నా, పక్షవాతంలాంటి పరిస్థితుల్లో పెడుతారు. వెంటిలేటర్(కృత్రియ శ్వాస యంత్రం)పై పెట్టాలంటే ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టం వేస్తారు.

దానిని వెంటిలేటర్‌ని ట్యూబులతో కలుపుతారు. క్రిటికల్‌గా ఉన్నా పేషెంట్ శరీరంలోకి అనేక రకాలయిన గొట్టాల లైనులు పెట్టి ఉంటాయి. ఈ ప్రక్రియలతో శరీర సహజ సిద్ధమైన రక్షణ విధానాలు అతిక్రమించడం జరుగుతుంది. వీటి వల్ల ఇంకా అవయవాలకు నష్టం జరుగకుండా, ఇన్‌ఫెక్షన్ రాకుండా నిష్ణాతులైన ఐసీయూ డాక్టర్లు, నర్సులు, రెస్టిరేటరీ థెరపిస్టులు 24 గంటలు జాగ్రత్తగా చూసుకుంటారు. ఒకసారి వెంటిలేర్‌పై పెట్టిన తర్వాత మనం ఏ జబ్బుకైతే పెట్టామో, ఆ పరిస్థితి మెరుగయ్యేంతవరకు, ఎన్నిరోజులైనా ఉంచాల్సి వస్తుంది. కొంతమందిలో వెంటిలేటర్ తీయడం కష్టం అవొచ్చు. కండరాల వీక్‌నెస్ ఉన్నవారి ప్రత్యేక పద్ధతుల ద్వారా తీస్తారు. సాంకేతిక, వైద్య పరిజ్ఞానాలు కావాల్సిన యంత్రాలు ప్రపంచదేశాలతో సమానంగా మనకున్నాయి. ఫలితాలు కూడా వారితో సమానంగా మనం సాధిస్తున్నాం. మన దేశంలో సామాన్యులు అంత ఖర్చు భరించలేకపోవడం వల్ల కొంత నష్టం జరుగుతున్నది. భవిష్యత్తులో ఈ పరిస్థితులు మెరుగుపడుతాయి. ఈ విషయంలో సందేహం ఉంటే చికిత్స చేస్తున్న డాక్టర్‌ని అడిగి పరిష్కారం తెలుసుకోవడం మంచింది.