ఇది కాలేయ సమస్యా?

నా వయసు 33 సంవత్సరాలు. నాకు జీర్ణ సంబంధిత సమస్య ఉంది. ఒక్కోసారి తిన్నది ఐదారు గంటలకు కూడా జీర్ణం కాదు. రాత్రిపూట అయితే అసలే అరగదు. అందుకోసమే రాత్రిపూట తినడం కూడా మానేశాను. ఇంతకూ నాకేమైందంటారు? ఇది లివర్ సమస్యేమో అని అంటున్నారు కొంతమంది. దయచేసి నా సమస్య, దాని పరిష్కారమేంటో తెలుపగలరు. - వెంకటరమణ, భద్రాచలం
వెంకటరమణ గారూ.. మీకు గ్యాస్ట్రిక్ సమస్య ఏదైనా ఉందా? అనే విషయం ఇక్కడ తెలియజేయలేదు. మలవిసర్జన సమస్య ఉందా? అనే విషయమూ రాయలేదు. ధూమపానం.. మద్యపానం అలవాటు ఉందా? అనే విషయాలు కూడా తెలియజేయలేదు. ఇవన్నీ పక్కనపెడితే మీరు ప్రస్తుతం చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీకు సమస్య ఉన్నట్టుగానే అనిపిస్తున్నది. అయితే అది కాలేయ సమస్య మాత్రం కాదు. అది జీర్ణకోశ సంబంధిత సమస్యగా చెప్పవచ్చు. నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది. కాబట్టి మీరు సమస్య గురించి బాధపడుతూ ఉండడం కాదు.. దాని పరిష్కారం గురించి ఆలోచించాలి. ముందుగా మీరు రాత్రిపూట భోజనం మానేయడం ఆపేయండి. రాత్రిపూట భోజనం ఆరోగ్యానికి మంచిది. తిన్నది జీర్ణం కావడం లేదని అసలు తినకుండా ఉండటం మంచి చర్య కాదు. ఇలాంటి చర్యలతో లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. మీకు ఆల్కహాల్.. పొగ తాగే అలవాట్లు ఉంటే తక్షణమే వాటిని వదిలేయండి. మీకున్నది జీర్ణకోశ సంబంధిత సమస్యేనా అని తెలుసుకోవడం కోసం ముందుగా స్పెషలిస్టును కలువండి. అన్ని పరీక్షల తర్వాత డాక్టర్ మీకు మందులు ఇస్తారు. డాక్టర్ సూచన మేరకు ఆహార అలవాట్లు పాటించడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ వేంచిన.. కారమైన.. వేడి పదార్థాలను తీసుకోవద్దు. నీరు బాగా తాగాలి. ఆహారం సమయానికి తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ తినడం ఆపేయ వద్దు. సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ పాటిస్తూనే రోజూ పొద్దున.. రాత్రిపూట వాకింగ్ చేయడం మంచిది. తిన్నది జీర్ణం కావాలంటే నడక మంచి ఔషధంలా పనిచేస్తుంది. దిగులుచెందకుండా సమస్య పరిష్కారం గురించి ఆలోచించాలి. డాక్టర్ అరుణ్‌కుమార్ తుములూరి జనరల్ ఫిజీషియన్ శ్రేష్ట శ్రీకమల హాస్పిటల్ దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్