లేడీ సింగం!

సరైన ప్రోత్సాహం ఉంటే మహిళలు సైతం అన్ని రంగాల్లో దూసుకుపోతారు. నేటితరం మహిళలు మగాళ్లతో సమానంగా మేము సైతం అంటూ ముందడుగు వేస్తున్నారు. సాహసోపేతమైన రంగాల్లోనూ రాణించగలరని నిరూపిస్తున్నారు. ఢిల్లీకి చెందిన 27 యేండ్ల యువతి తొలిసారి కోబ్రా టీమ్‌లో కమాండోగా చేరి ధైర్య, సాహసాలను నిరూపించుకుంటున్నది.
గతంలో కొన్ని రంగాలకే పరిమితమైన స్త్రీలకు ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అవకాశం ఇచ్చేందుకు నియమనిబంధనల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ట్రిపుల్ జంప్‌లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా తన సత్తా చాటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్)లో ఏడాది పాటు శిక్షణ తీసుకుని 232 మహిళా బెటాలియన్‌లో చేరింది. సీఆర్‌పిఎఫ్‌లోనే అతి తక్కువ వయసు కలిగిన మహిళా అధికారిణిగా ఉషాకిరణ్ నిలిచింది. ఈ రంగంలో మరిన్ని విజయాలను అందుకోవాలనే సంకల్పంతో గెరిల్లా విద్యలు, అడవిలో శత్రువులను ధైర్య సాహసాలతో ఎదుర్కొనేందుకు అవసరమైన నైపుణ్యాలపై పట్టు సాధించింది. కొద్దిరోజుల తర్వాత తనకు జమ్మూ కశ్మీర్ సరిహద్దుల్లో పనిచేయడానికి అవకాశం ఇవ్వమని ఉన్నతాధికారులను కోరింది. అదే సమయంలో ఆమెను కమాండో బెటాలియన్ ఫర్ రిసాల్యూట్ యాక్షన్ (కోబ్రా) దళంలో ఉషాకిరణ్‌ను కమాండోగా నియమించారు. దీంతో తొలిసారిగా కోబ్రా దళంలో చేరిన మహిళగా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్ ప్రాంతమైన బస్తర్‌లో ఆమె విధులు నిర్వహిస్తున్నది. ఆమె పాఠశాల విద్యార్థులకు ప్రోత్సాహకాలిస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నది. అంతేకాకుండా విద్యార్థి దశ నుంచే దేశ రక్షణలో పాలు పంచుకునే సైనిక దళాలను గురించి వారికి తెలియజేస్తున్నది. ఆదర్శంగా నిలుస్తున్న ఆమె 2018 సంవత్సరానికిగానూ యంగ్ అచీవర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపికైంది. ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుని అందరూ ఉషాకిరణ్‌ను లేడీ సింగం అని పిలుస్తున్నారు.