గాలి నుండి తాజా నీరు

నిర్జల ప్రదేశాలలోనూ గాలి నుంచి తాజా నీటిని తయారుచేసే అత్యంత సమర్థవంతమైన విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి పరిచారు. ఇందుకు ఉపయోగపడే ఒక అద్భుతమైన మెత్తటి, సూక్ష్మరంధ్రాలతో కూడిన పదార్థాన్ని వారు తయారుచేశారు.

పూర్తి సౌరశక్తి సహాయంతోనే, ఇంకా ఒక్కోసారి ఇదీ లభ్యం కానప్పుడు కలప మంటతోనైనా సరే పని చేయించగల సరికొత్త జలోత్పత్తి విధానాన్ని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఇటీవల రూపొందించారు. దీనివల్ల వాతావరణంలో ఎక్కువ శాతం తేమ లేకున్నా, కేవలం 50- 20 శాతం మేర ఆర్ద్రత (తేమ) ఉన్నా గాలినుంచి తాజానీటిని ఉత్పత్తి చేసుకోవచ్చునని వారంటున్నారు. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్ (metal-organic frameworks - MOFs) గా పిలిచే ఈ విధానంలోని మెత్తటి పోరస్ మెటీరియల్ (సూక్ష్మరంధ్రాల పదార్థం) గాలిలోని నీటి అణువుల్ని గ్రహించేస్తుందని, ఈ మేరకు దీనికి నీటిని ఆకర్షించే (hydro philic) ఉపరితలాన్ని ఏర్పరచినట్లు వారు తెలిపారు. ఈ సాంకేతికత వల్ల పొడి ప్రదేశాల్లో సైతం నీటిని పుట్టించుకోవచ్చునని వారు భరోసా ఇచ్చారు.

ఈ విధానం కోసం పదార్థ మిశ్రమాలను యూనివర్సిటీ ఆఫ్ క్యాలిఫోర్నియా (బెర్కిలీ)కి చెందిన రసాయనశాస్త్ర ప్రొఫెసర్ ఒమర్ యాఘీ (Omar Yaghi) నిజానికి రెండు దశాబ్దాల కిందటే ఆవిష్కరించినా, నీటిని ఆకర్షించే ఉపరితలాన్ని తయారు చేయడం కోసం కచ్చితమైన రసాయనిక మిశ్రమాలతో దీనిని అనువర్తింపజేసుకున్నారు. పై ప్రయోగం ద్వారా ఒక కేజీ కొత్త పదార్థంతో రోజుకు 3 క్వార్ట్స్ (గ్యాలన్ల) నీటిని సేకరించవచ్చునని, ఇది ఒక వ్యక్తి తాగునీటి అవసరాల్ని తీరుస్తుందని వారు అంటున్నారు.