బీడీ తాగడం నేర్చుకున్నా!

నభా అంటే.. ఆకాశమని అర్థం! తన కెరీర్ ఆకాశమంత ఎత్తు ఎదుగాలని.. ఆమె తల్లిదండ్రులు ముందే ఊహించి ఆ పేరు పెట్టినట్టున్నారు.. నన్ను దోచుకుందువటేతో తెరంగేట్రం చేసి.. అందరి మనసుల్ని కొల్లగొట్టిందీ కన్నడ భామ.. తెలుగులో మొదటి సినిమాతోనే.. విమర్శకుల మన్ననలు పొందింది.. ఆమే.. నభా నటేష్.. ఆమెతో జిందగీ చిట్‌చాట్..

సినిమా సక్సెస్ సాధించింది. అందులో మీకు ఎక్కువ పేరొచ్చింది. ఎలా అనిపిస్తున్నది?

-అందరి మనసుల్ని దోచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకవైపు నిజమేనా? నాకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చిందనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. అంటే.. సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని చెప్పొచ్చు. నిజంగా నేను బయట ఎలా ఉంటానో ఈ సినిమాలో అలాగే ఉన్నా. అందుకే అంతగా అందరికీ నచ్చానేమో!

ఈ సినిమా కథ విన్నప్పుడు ఇంత సక్సెస్ అవుతుందనుకున్నారా?

-కథ విన్న వెంటనే మంచి సినిమా అవుతుందని అనుకున్నా. పైగా సుధీర్‌బాబు గారి కష్టం కూడా చూశా. అందరం మనసు పెట్టి ఈ సినిమా తీశాం. అందుకే మంచి సక్సెస్ అందుకున్నాం.

ఇంజినీరింగ్ చదివి సినిమాల్లోకి రావాలని ఎందుకనుకున్నారు?

-నేను ఈ రోజు సడెన్‌గా సినిమాల్లోకి వస్తానన్న నిర్ణయం తీసుకోలేదు. చిన్నప్పటి నుంచి చదువుతో పాటు డ్యాన్సింగ్, పాటలు, పెయింటింగ్, ఆటలు బాగా ఆడేదాన్ని. అన్ని రంగాల్లో ఒక్కో చేయి, కాలు వేసేశా. అలా.. నాకు కళల పట్ల చిన్నప్పుడే ఆసక్తి మొదలైంది. పెరిగాక.. అది పెద్దదయింది. కాలేజ్ పూర్తయ్యాక ఉద్యోగమా? లేక కళా రంగాల్లోకి వెళ్లాలా అని నిర్ణయించుకునే సమయంలో కళల వైపే మొగ్గు చూపాను.

మోడలింగ్ వైపు కూడా అడుగులు వేశారనుకుంటా?

-నేను మంగళూరులో ఇంజినీరింగ్ చేశా. అక్కడ చదువుతున్నప్పుడే మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. చదువుకుంటూనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టాను. అది కూడా సూట్ కాదనిపించింది.

సూట్ కాదంటున్నారు.. మరి అందాల పోటీల్లోనూ పాల్గొన్నట్టున్నారు?

-పాల్గొనాల్సి వచ్చింది. నాకు మోడలింగ్ ఎందుకు నచ్చదంటే..వేరెవరో బట్టలు వేసుకొని ర్యాంప్ మీద నడువాలి. అందులో మన క్రియేటివిటీ ఏమీ ఉండదు. అందుకే పెద్దగా ఆ రంగం నాకు సూటవ్వదనిపించింది. ఇక ఫెమినా మిస్ ఇండియా బెంగళూరులో పాల్గొన్న. టాప్ -11లో ఉన్నాను. మిస్ ఇంటలెక్చువల్‌గా కిరీటం అందుకున్నా. ఆ తర్వాత థియేటర్స్‌కి వచ్చేశా.

థియేటర్స్ చేయాలని ఎందుకనుకున్నారు?

-నాకు డ్యాన్స్, పాటలు పాడడం వచ్చు. మోడలింగ్‌లో ఉన్నాను కాబట్టి మేకప్, డ్రెస్సింగ్ వీటి మీద అవగాహన ఉంది. నటిని కావాలంటే కచ్చితంగా నటన రావాలి. మిగతావన్నీ నాలో ఉన్నా నటనలో మెళకువల కోసం థియేటర్స్ చేశా. మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు.. ఏది చేసినా పక్కగా చేయాలి. దాంట్లో ఎలాంటి లోపం ఉండకూడదంటారు. అందుకే నటనలో శిక్షణలో తీసుకున్నాక నటిని అవుతానన్న ధైర్యం వచ్చింది.

శాంతినికేతన్‌లో గోరా నాటకం వేశారు. అప్పుడెలా అనిపించింది?

-రవీంద్రనాథ్ ఠాగూర్ నవల గోరా అని అందరికీ తెలుసు. అందులో లలిత క్యారెక్టర్‌లో నటించాను. పైగా కలకత్తాలో కన్నడ భాషలో చేశాం. అందరూ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. నా జీవితంలో మరచిపోలేని రోజు, ఘటన ఏదైనా ఉందంటే అదే అని చెబుతాను.

మొదటి సినిమా వజ్రాకాయ. కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ పక్కన నటించారు. ఎలా అనిపించింది?

-నిజంగా ఆయన సూపర్ స్టార్. ఆయనతో పని చేయడం.. అందులోనూ మొదటి సినిమాకే నాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా. పైగా ఆ సినిమాకు బెస్ట్ యాక్టెరెస్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు నామినేట్ అవ్వడం కూడా మరచిపోలేని అనుభూతి.

వజ్రాకాయ కోసం గుర్రపు స్వారీ నేర్చుకున్నారట?

-(నవ్వుతూ..) ఆ కష్టాలు ఎందుకు అడుగుతారులెండీ! 100 రోజుల పాటు గుర్రపు స్వారీ నేర్చుకున్నా. ఆ సినిమా కోసం బీడీ తాగడం కూడా నేర్చుకున్నానండి. ఆ క్యారెక్టర్ కోసం చాలా కష్టాలే పడ్డాను.

ఒక క్యారెక్టర్ చెప్పినప్పుడు ఎలాంటి వర్కవుట్స్ చేస్తారు?

-అన్ని సినిమాలకు వర్కవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. నన్ను దోచుకుందవటేకి నేను పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. నేను నాలా ఉండమంటే పెద్దగా కష్టమనిపించదు కదా! కానీ వజ్రాకాయ కోసం మాత్రం కొద్దిగా కష్టపడ్డాను. వర్కషాపులు అటెండ్ అయ్యాను.

అదుగో సినిమాలో కూడా మీరే హీరోయిన్ కదా?

-అవును.. ముందుగా ఆ సినిమానే విడుదల కావాలి. కానీ వీఎఫ్‌ఎక్స్ మూలంగా ఆ సినిమా ఆలస్యం అయింది. ఆ కారణంగా తెలుగులో నా మొదటి సినిమా నన్ను దోచుకుందువటే అయింది.

మీ గురించి.. మీ ఇంట్లో వాళ్ల గురించి చెబుతారా?

-నేను చిక్‌మంగళూరు దగ్గర శృంగేరీలో జన్మించా. స్కూలింగ్ అంతా అక్కడే అయిపోయింది. కాలేజ్ కోసం మంగళూరు వచ్చా. నాన్న బిజినెస్‌మెన్. అమ్మ గృహిణి. నాకొక తమ్ముడు.

పాటలు పాడుతారన్నారు.. సింగర్‌గా వస్తారా? తెలుగు కూడా చక్కగా మాట్లాడుతున్నారు.. డబ్బింగ్ ఏమైనా..?

-(నవ్వుతూ..) తెలుగులో ఇప్పుడు ఒక్కటే సినిమా విడుదలైందండి. తెలుగు కూడా ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు. నా వాయిస్ బాగుంటుందని చాలామంది చెప్పారు. కాబట్టి డబ్బింగ్ తప్పకుండా ట్రై చేస్తా. ఇక పెద్ద సింగర్‌నేం కాదు. ఒకవేళ ఎవరైనా నేను పాడితే నచ్చిందని చెబితే అప్పుడు ఆలోచిస్తా.

కన్నడలో ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించారు. తెలుగులో కూడా అలా కనిపిస్తారా?

-ఆ సినిమా హీరో నాకు మంచి ఫ్రెండ్. అందుకే తను అడిగితే ఆ సాంగ్ చేశా. అంతేకానీ.. అలా ప్రత్యేక గీతాలు చేయాలని నేనెప్పుడు అనుకోలేదు. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే చూద్దాం. -సౌమ్య నాగపురి -సీఎం ప్రవీణ్ కుమార్