గీతల బ్రహ్మ!

గీతలనే అస్ర్తాలుగా సంధించి ఆలోచనలు రేకెత్తించేవే కార్టూన్లు. కొన్ని సందర్భాల్లో అక్షరాల కంటే కూడా ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. సమాజ పోకడను ఎత్తి పొడుస్తూ, రాజకీయాల తీరును వ్యంగ్యాస్ర్తాలతో అందించడం కేవలం కార్టూన్లకే సొంతం. నమస్తే తెలంగాణలో చీఫ్ కార్టూనిస్టు అయిన చిలువేరు మృత్యుంజయ గీసిన కార్టూన్లతో బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ (ఐసీసీ) సంస్థ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ నెల (సెప్టెంబర్) 8న 69 కార్టూన్లతో ఏర్పాటు చేసిన ఈ కార్టూన్ ఎగ్జిబిషన్ 22 వరకు కొనసాగనుంది. ఆ విశేషాలు మీ కోసం..
ఆలోచనలకు అక్షర రూపమిస్తే అది కావ్యం, కవిత, వ్యాసం, సాహిత్యం అవుతుంది. అదే ఆలోచనను గీతగా మారిస్తే.. అద్భుతమైన కళాఖండం అవుతుంది. చెప్పాలనుకున్న విషయాన్ని రెండే బొమ్మలతో సూటిగా, సుత్తిలేకుండా చెప్తే అది కార్టూన్ అవుతుంది. భిన్నంగా ఆలోచిస్తూ.. తమ ప్రత్యేకతను చాటుకునే కార్టునిస్టుల లిస్టులో నమస్తే తెలంగాణ కార్టూనిస్టు చిలువేరు మృత్యుంజయ కూడా ఒకరు. సమకాలీన అంశాలను కార్టూన్ల ద్వారా అందరికీ అర్థమయ్యేలా హాస్యభరితంగా చెప్తున్న మృత్యుంజయ కార్టూన్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ అక్షరాలను వాడి, ఎక్కువ హాస్యాన్ని పండించే నేర్పరితనం కేవలం కార్టూనిస్టులకే ఉంటుంది. ఆ విషయాన్ని మృత్యుంజయ ఇప్పటికే నమస్తే తెలంగాణలో వేసిన ఎన్నో కార్టూన్ల ద్వారా నిరూపించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలు సందర్భాల్లో ఆయన వేసిన కార్టూన్లు ఆలోచింపజేశాయి, ఆకట్టుకున్నాయి. మింత్రా సహ వ్యవస్థాపకుడు రవీన్‌శాస్త్రి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి మృత్యుంజయ కార్టూన్లను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. ఐఐసీ మేనేజింగ్ ట్రస్టీ వీజీ నరేంద్ర మృత్యుంజయ కార్టూన్లకు ముగ్ధుడై అక్కడికక్కడే ఆయనను ఘనంగా సన్మానించారు. తాజాగా 200 కిలోమీటర్లు నడిచిన రైతుల కిసాన్ యాత్ర గురించి అక్షరాల సహాయం అవసరం లేకుండానే నెత్తురోడుతున్న పాదం ముద్రను పిడికిలిలా గీసి ఔరా అనిపించాడు. డిజిటల్ కిడ్ సిరీస్‌తో నమస్తే తెలంగాణ బతుకమ్మ సంచికలో ఆయన వేసే కార్టూన్లు అటు పిల్లలను ఆలరిస్తూనే, పెద్దలను ఆలోచింపజేస్తున్నాయి.
కార్టూనిస్టుగా మంచి పేరు తెచ్చుకున్న మృత్యుంజయ డిజిటల్ పెయింటింగ్, స్కెచింగ్‌లో కూడా నిష్ణాతుడు. రాజనీతి శాస్త్రంలో పీజీ చేశాడు. అసలు మృత్యుంజయ కార్టూనిస్టుగా, ఆర్టిస్టుగా మారిన సందర్భం అందరికీ ప్రేరణ కలిగించే విషయం. మృత్యుంజయ తండ్రి చిలువేరు రామలింగం చేనేత వస్త్ర నిపుణుడు. ఆయన మగ్గం మీద రకరకాల డిజైన్లు నేస్తుంటే మృత్యుంజయ చిన్నతనంలో దగ్గరుండి చూసేవాడు. అలా స్ఫూర్తి పొంది కుంచె పట్టి కార్టూనిస్టుగా మారాడు. 1990లో కెరీర్ ప్రారంభించిన మృత్యుంజయ కార్టూనిస్టుగా 28 సంవత్సరాల అనుభవం గడించాడు. 21 ఏండ్లుగా పొలిటికల్ కార్టూన్లు గీస్తున్నాడు. ఇప్పటి వరకు కేరళ, బెంగళూరు వర్క్‌షాపులలో తన కార్టూన్లు, కేరికేచర్లు ప్రదర్శించాడు. అంతేకాదు.. చైనా, బ్రెజిల్, రొమేనియా, టర్కీ, ఇటలీ లాంటి దేశాల్లో కూడా మృత్యుంజయ కార్టూన్ల ఎగ్జిబిషన్ జరిగింది. ఆయన కార్టూన్‌రంగంలో చేస్తున్న సేవలను గుర్తించి గ్రీస్ దేశం ఎక్స్‌లెన్స్ అవార్డుతో సత్కరించింది. చైనా నుంచి బెస్ట్ కార్టూనిస్టుగా అవార్డు సొంతం చేసుకున్నారు. ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగిన కార్టూన్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచారు మృత్యుంజయ. పొలిటికల్ కార్టూన్ కాంటెస్ట్‌లో తన కార్టూన్లకు మయాకామత్ మెమోరియల్ అవార్డు అందుకున్నారు.
తక్కువ అక్షరాలను వాడి, ఎక్కువ హాస్యాన్ని పండించే నేర్పరితనం కేవలం కార్టూనిస్టులకే ఉంటుంది. ఆ విషయాన్ని మృత్యుంజయ ఇప్పటికే నమస్తే తెలంగాణలో వేసిన ఎన్నో కార్టూన్ల ద్వారా నిరూపించుకున్నారు. ప్రవీణ్‌కుమార్ సుంకరి

యాజమాన్యానికి ధన్యవాదాలు

నేను వేసే కార్టూన్లను చూసి ప్రోత్సహిస్తూ, నాకు బూస్ట్ ఇచ్చిన నమస్తే తెలంగాణ యాజమాన్యానికి, ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి గారికి ధన్యవాదాలు. నా ఆలోచనలను కార్టూన్లుగా మలిచి వారికి చూపించిన సందర్భాల్లో వారిచ్చిన సలహాలు, అందించిన ప్రోత్సాహమే నేను మరిన్ని కార్టూన్లు వేసేందుకు కారణమయింది. నోట్ల రద్దు, గౌరీ లంకేష్ హత్య, టెర్రరిజం, సిరియాపై బాంబుల దాడి, ఇతర క్యారికేచర్లు, తదితర అంశాల మీద పొలిటికల్ కార్టూన్లు ఈ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నాం. నా కార్టూన్లను ఆదరిస్తున్న నమస్తే తెలంగాణ పాఠకులకు ధన్యవాదాలు.