టాయ్ బ్యాంక్!

మీకు కొత్తకొత్త బొమ్మలు ఇచ్చి, వాటితో రోజంతా ఆడుకోమంటే ఎలా ఉంటుంది? మస్త్ ఎంజాయ్ చేస్తారు కదూ! ఇలా పేద పిల్లల జీవితాల్లో నవ్వులు, ఆనందాలను పంచడానికి టాయ్ బ్యాంక్ అనే సంస్థ రకరకాల బొమ్మలను ఉచితంగా ఇస్తుంది. అంతేకాదు వాటితో ఎలా ఆడుకోవాలో కూడా చెబుతుంది. మరి.. ఆ టాయ్ బ్యాంక్ ఎక్కడుందో? ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?

ఢిల్లీకి చెందిన విద్యున్ గోయెల్ చిన్నతనంలో రకరకాల బొమ్మలతో ఆడుకునేది. పాతబడిన తరువాత బొమ్మలను తీసుకెళ్లి పేదపిల్లలకు అందజేసేవాడు విద్యున్ తండ్రి. మన బొమ్మలను ఎందుకు వాళ్లకు ఇస్తున్నావని అడిగితే పాతబొమ్మలతో నువ్వు తిరిగి ఆడుకోవు. అదే పేదపిల్లలకు ఇస్తే అపురూపంగా, కొత్తబొమ్మల్లా ఆడుకుంటారు. ఇలా ఇవ్వడం వల్ల మనం వారి జీవితంలో సంతోషం నింపిన వారమవుతాం అన్నారు. అప్పటి నుంచి తాను ఆడుకునే బొమ్మలను పేదల పిల్లలకు ఇవ్వడం అలవాటు చేసుకున్నది. అలా విద్యున్ బొమ్మలు ఇవ్వడం చూసిన బంధువులు, స్నేహితులు వారి పిల్లలు కూడా తమ బొమ్మలను పేద పిల్లలకు ఇవ్వడం మొదలుపెట్టారు.

రకరకాల బొమ్మలతో టాయ్ బ్యాంక్

ఒక్క ఢిల్లీలోనే కాకుండా దేశం మొత్తం పిల్లలకు బొమ్మలను అందించాలనే ఉద్దేశంతో టాయ్ బ్యాంక్ అనే సంస్థను నిర్మించింది విద్యున్ గోయెల్. 2012లో టాయ్ బ్యాంక్‌కు పాత బొమ్మలను సేకరించడం మొదలు పెట్టింది. వచ్చిన బొమ్మలను కొత్త వాటిలా తయారు చేసి, అందంగా మార్చి తిరిగి పేదపిల్లలకు అందజేయడం ఈ టాయ్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశం. ఎన్నో పాఠశాలల్లో పిల్లలు ఆడుకోవడానికి సరైన బొమ్ములు లేక నిరుత్సాహపడుతున్నారు. అంగన్‌వాడీ, స్కూళ్ల నిర్వాహకులతో మాట్లాడి పిల్లలకు బొమ్మలను అందజేస్తున్నాం అని విద్యుత్ చెబుతున్నది. వయసుల వారీగా ఏ రకం పిల్లలకు ఎలాంటి బొమ్మలు నచ్చుతాయో తెలుసుకొని వారికి ముందుగానే అలాంటి బొమ్మలు ఇస్తున్నారు.

పిల్లల్లో మార్పు కోసం..

ఈ బొమ్మలు కేవలం ఆటలకే పరిమితం కాకుండా.. రంగులు, అంకెలు, సైజులను సులువుగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. కొన్ని రకాల బొమ్మలతో మానసిక, శారీరక నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంతో తోడ్పడుతున్నాయని చెబుతున్నది విద్యున్. వివిధ రకాల శబ్దాలు చేసే బొమ్మలతో మానసిన వికలాంగులైన పిల్లలు హాయిగా ఆడుకుంటున్నారని, వాటితో నిత్యం ఆడుకోవడం వల్ల వారిలో మార్పును గమనిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. విద్యున్ చేపట్టిన ఈ కార్యక్రమంతో ఎంతోమంది పిల్లల ముఖాల్లో ఆనందాన్ని చూస్తున్నామని అంటున్నారు.

దేశమంతటా టాయ్‌బ్యాంక్

టాయ్‌బ్యాంక్‌ను ఢిల్లీలోనే కాకుండా దేశమంతటా విస్తరించాలనేది వీరి ఆలోచన. ఈ క్రమంలో ముంబై, భూపాల్‌లలో టాయ్‌బ్యాంక్ శాఖలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఈ సంస్థ 15 లక్షల బొమ్మలను పంపిణీ చేసింది. అంతేకాదు, ప్రత్యేకంగా బొమ్మలు లైబ్రరీలను ఏర్పాటు చేసింది. టాయ్‌బ్యాంక్ ఇప్పుడు పిల్లలు ప్రియనేస్తంగా మారింది. ఇక్కడి పిల్లలు బొమ్మలతో ఆడుకొని ఎన్నో ఏళ్లయింది. ఈ సంస్థ ద్వారా ఇప్పుడు సంతోషంగా ఆడుకుంటున్నారు అని మధ్యప్రదేశ్‌లోని మారుమూల గ్రామాల్లో పనిచేస్తున్న అంగనవాడీ వర్కర్లు చెబుతున్నారు. కాబట్టి పిల్లలూ మీరు కూడా ఆడుకొని వదిలేసిన మీ బొమ్మలను మీకు దగ్గర్లోని పేద పిల్లలకు ఇచ్చి, వారిలో ఆనందాన్ని నింపుతారని ఆశిస్తున్నాం.