కొత్త వింత జాతులు

-2018 టాప్-10 జాబితాలోంచి కొన్ని

భూమిపై ఏటా 18,000 కొత్త జాతులను శాస్త్రవేత్తలు కనుగొంటుండగా, 20,000 వరకు పాతజాతులు నశించిపోతున్నట్టు ఒక అంచనా. పరిశోధకుల దృష్టికి రాకుండా ఉన్నవి ఇంకెన్నో. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పర్యావరణ విజ్ఞానం, అటవీశాస్త్ర కళాశాల ఆధ్వర్యంలోని జాతుల అన్వేషణా అంతర్జాతీయ సంస్థ (International Institute for Species Exploration of the State University of New Yorks College of Environmental Science and Forestry) ఏటా వెల్లడించే టాప్-10 కొత్త జాతుల జాబితాను ఈ ఏడాదికిగాను ఇటీవల ప్రకటించింది. అందులోంచి ఎంపిక చేసిన కొన్ని కొత్త వింత జాతుల వివరాలు ఇవీ.

స్ఫటిక చేప

పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని మేరియానా ట్రెంచ్‌లో 22,000- 26,000 అడుగుల లోతున స్ఫటికం వంటి చేప (Swires Snailfish - Pseudoliparis Swirei) ను కనుగొన్నారు. 4 అంగుళాల పొడవున ఓ తోకకప్పలా వుండే ఈ నత్తచేపను అంత లోతున నివసించే అగ్రస్థాయి పరభక్షి (top predator) గా భావిస్తున్నారు.

కొత్త ఏకకణ జీవి

ఇప్పుడున్న ఏ తరగతికీ చెందని సరికొత్త ఏక కణజీవి (Protist- Ancoracysta Twista) ని క్యాలిఫోర్నియాకు చెందిన సాన్ డీగో నగరంలోని బ్రెయిన్ కోరల్ ఎక్వేరియంలో కనుగొన్నారు. విలక్షణ జన్యువుతో, అసాధారణ శరీరంతో ఉన్న దీనిని ప్రాచీన యూకర్యోట్స్ (eukaryotes) శ్రేణికి చెందినట్లుగా భావిస్తున్నారు.

బూజు పువ్వు

మొక్కలు చాలావరకు సూర్యరశ్మిపై ఆధారపడుతై. కానీ, జపాన్‌కు చెందిన ఇషిగాకి (Ishigaki)ద్వీపంలో బూజు (fungus) పై ఆధారపడి వికసించే పువ్వు (Heterotrophic Flower - Sciaphila Sugimotoi) ను గుర్తించారు. ఇది తన భాగస్వామి శిలీంద్రానికి ఎలాంటి నష్టం కలిగించదని అంటున్నారు.

బలే బొద్దింక

చైనాకు చెందిన గ్వాంగ్జీ (Guangxi) ప్రొవిన్స్, డ్యూవన్ (Duan) స్వయంపాలిత దేశంలోని ఒక సున్నపు రాయి గుహలో వింత బొద్దింక (Cave Beetle - Xuedytes Bellus) ను కనుగొన్నారు. పొడవాటి మెడతో కూడిన దీని శరీర నిర్మాణం సదరు ప్రదేశంలో నివాసానికి అనుకూలంగా ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బరువైన పెద్ద చెట్టు

సుమారు 62 టన్నుల (56,000 కేజీలు) బరువుతో, 130 అడుగుల పొడవు దాకా పెరిగే పెద్ద చెట్టు (Atlantic Forest Tree - Dinizia Jueirana-Facao) ను అట్లాంటిక్ అరణ్యంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. బ్రెజిల్‌కు చెందిన రిజర్వ్ నేచురల్ వేల్‌లో ఇలాంటి వృక్షాలు కేవలం 25 మాత్రమే ఉన్నాయి.

రెండంగుళాల పొడవున, మెరిసే రంగుల్లో, వంగిన నడుముతో భీకర జంతువు (డ్రాగన్)లా కనిపించే కొత్త ఉభయచర (Amphipod - Epimeria Quasimodo) జీవిని దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రంలో కనుగొన్నారు. 26 కొత్త ఎపిమేరియా (Epimeria) జాతులలో దీనినొకటిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

చీమకన్నా చిన్నజీవి

చీమ కడుపుపై ప్రయాణించే మరింత చిన్నజీవి (Baffling Beetle - Nymphister Kronaueri) ని శాస్త్రవేత్తలు గుర్తించారు. చీమ కడుపు నుంచి తోక వరకు గల ఒక అంగుళం స్థలంలోనే ఈ జీవులు 16 బృందంగా ఆశ్రయించుకొని వుంటై. వీటి ఆకారం, రంగు చీమల ఉదరవర్ణంలో కలిసిపోతాయని అంటున్నారు.

అగ్నిపర్వత సూక్ష్మజీవి

క్యానరీ (ఆఫ్రికా) ద్వీపం ఎల్ హియర్రో (El Hierro) తీరం వద్ద సాగరగర్భంలో 2011లో టాగొరో అగ్నిపర్వతంతో వినాశనమైన జీవావరణ ప్రదేశంలో కొత్త సూక్ష్మజీవి (Volcanic Bacterium - Thiolava Veneris) అవతరించింది. దీనితో కొత్త జీవావరణాలు ఏర్పడవచ్చునని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.