కొసరి కొసరి.. ఉసిరి

చలి గిలిగింతలు పెడుతుంటే.. కఫ.. జీర్ణ సంబంధమైన వ్యాధులు కూడా ప్రభులుతాయి.. వాటి బాధ నుంచి విముక్తి పొందాలంటే.. ఈ కాలంలో ఉసిరిని కచ్చితంగా మీ మెనూలో చేర్చాల్సిందే! కొసరి కొసరి పల్లెంలో వడ్డించాల్సిందే! కారంగా పచ్చడి.. తియ్యగా షర్బత్.. పుల్లగా పులిహోర.. కమ్మగా పప్పు.. దాంతో పన్నీర్‌ని జతచేసి వండిన వంటకాలే ఈ వారం స్పెషల్..

ఉసిరికాయ షర్బత్

కావాల్సినవి : ఉసిరికాయలు : 200 గ్రా., చక్కెర : 3 టేబుల్‌స్పూన్స్ పుదీనా ఆకులు : చిన్న కట్ట తయారీ : ఉసిరికాయలను బాగా కడిగి గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఒక గిన్నెలో గాత్లసు నీళ్లు పోసి దాంట్లో చక్కెర వేయాలి. దీంట్లోనే ముక్కలుగా కోసుకున్న ఉసిరికాయలు వేసి బాగా ఉడుకనివ్వాలి. తర్వాత స్టౌ మీద నుంచి బాగా చల్లరనివ్వాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని వడకట్టి చల్లని నీళ్లు కలిపి పుదీనా ఆకులతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

ఉసిరికాయ ఆవకాయ

కావాల్సినవి : ఉసిరికాయలు : 4 కప్పులు, నువ్వుల నూనె : 2 కప్పులు, కారం : ఒక కప్పు, ఆవపిండి : ఒక కప్పు , మెంతులు : పావు కప్పు, జీలకర్ర : పావు కప్పు, నిమ్మకాయలు : 2, ఉప్పు : తగినంత
తయారీ : ఉసిరికాయ శుభ్రం చేసుకొని చాకులో గాట్లు పెట్టి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. వీటిని కాసేపటి వరకు చల్లారనివ్వాలి. నిమ్మరసం తీసి పక్కన పెట్టాలి. జీలకర్ర, మెంతులు దోరగా వేయించి చల్లారాక పొడి చేయాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో వేయించిన ఉసిరికాయలు, కారం, ఆవపిండి, ఉప్పు, జీలకర్ర పొడి, మెంతుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపేశాక నిమ్మరసం, నూనె పోసి మరొకసారి కలియబెట్టాలి. మూడు రోజుల పాటు నిల్వ ఉంచాక ఆ తర్వాత ఈ పచ్చడిని వేసుకోవచ్చు. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, నెయ్యితో పాటుగా వడ్డిస్తే ఆ టేస్టే వేరు.

ఉసిరికాయ పప్పు

కావాల్సినవి : ఉసిరికాయలు : 6, కందిపప్పు : ఒక కప్పు, నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, ఆవాలు : పావు టీస్పూన్, జీలకర్ర : పావు టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్, వెల్లుల్లి : 6 రెబ్బలు, కరివేపాకు : 2 రెమ్మలు, ఇంగువ : పావు టీస్పూన్, పచ్చిమిరపకాయలు : 4, ఎండుమిర్చి : 2, చింతపండు : నిమ్మకాయ సైజంత, ఉల్లిగడ్డ : 1, నూనె, ఉప్పు : తగినంత
తయారీ : కందిపప్పు శుభ్రంగా కడిగి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొద్దిగా నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి. చింతపండులో నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఉసిరికాయ గింజలు లేకుండా చిన్న ముక్కలుగా కోసి వేరే గిన్నెలో ఉడుకబెట్టాలి. ఒక పెద్ద గిన్నెలో నెయ్యి వేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు పెట్టాలి. ఇందులో సగం తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిగిలిన పోపులో ఉడికించిన కంది పప్పు, చింతపండు రసం, ఉడికించిన ఉసిరికాయ ముక్కలు, ఉప్పు వేసి మరికాసేపు ఉడికించి దించేయాలి. ఇందులో పక్కకు పెట్టిన పోపును వేసి గార్నిష్ చేసి వేడి వేడి అన్నంలో వేసి వడ్డించుకోవాలి.

ఉసిరికాయ పులిహోర

కావాల్సినవి : ఉసిరికాయ : 10, బియ్యం : 200 గ్రా., నెయ్యి : 2 టేబుల్‌స్పూన్స్, పసుపు : పావు టీస్పూన్, ఆవాలు : పావు టీస్పూన్, జీలకర్ర : పావు టీస్పూన్, ఇంగువ : పావు టీస్పూన్, పచ్చిమిరపకాయలు : 3, ఎండుమిర్చి : 2, మినపపప్పు : అర టీస్పూన్, పచ్చి శనగపప్పు : అర టీస్పూన్, జీడిపప్పు : 10, కరివేపాకు : 2 రెమ్మలు, ఉప్పు : తగినంత
తయారీ : బియ్యం కడిగి కాసేపు పక్కన పెట్టాలి. ఉసిరికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. బియ్యాన్ని మరి మెత్తగా కాకుండా అన్నం వండుకోవాలి. ఈలోపు మరో గిన్నెలో నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, మినపపప్పు, పచ్చి శనగపప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి. చివరగా ఉసిరికాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఉసిరికాయ ముక్కలు బాగా వేగాక దించేయాలి. ఇప్పుడు అన్నాన్ని కాస్త చల్లార్చి ఈ మిశ్రమాన్ని అందులో వేయాలి. పై నుంచి నిమ్మరసం పోసి కలుపాలి. టేస్టీ ఉసిరికాయ పులిహోర కమ్మగా మీ నోరూరిస్తుంది.

ఉసిరికాయ పన్నీర్

కావాల్సినవి : ఉసిరికాయలు : 6, పచ్చిమిరపకాయలు : 4, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, పసుపు : పావు టీస్పూన్ , పన్నీర్ : 200 గ్రా., కొత్తిమీర : చిన్న కట్ట, నూనె : 2 టేబుల్‌స్పూన్స్, ఉప్పు : తగినంత
తయారీ : ఉసిరికాయ శుభ్రం చేసి గింజలు తీసి చిన్న ముక్కలుగా చేసి ముద్దగా నూరుకోవాలి. పచ్చిమిరపకాయలను పేస్ట్ చేయాలి. పన్నీర్‌ని ఫింగర్ చిప్స్‌లా కట్ చేయాలి. ఒక గిన్నెలో ఉసిరికాయ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ముక్కలుగా కోసుకున్న పన్నీర్ వేసి కలిపి గంట పాటు పక్కన పెట్టాలి. నాన్‌స్టిక్ ప్యాన్‌లో నూనె వేసి వేడయ్యాక ఒక్కొక్క పన్నీర్ ముక్కల్ని వేసి దోరగా వేయించి దించేయాలి. సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. వేడి వేడి పన్నీర్ రెడీ! జి.యాదగిరి కార్పొరేట్ చెఫ్ వివాహభోజనంబు రెస్టారెంట్ జూబ్లీహిల్స్, హైదరాబాద్ పార్క్‌లైన్, సికింద్రాబాద్