చిన్న జేబులే లుక్కు!

అబ్బాయిలు జీన్స్ ప్యాంట్ల జేబుల కంటే అమ్మాయిలు వేసుకున్న జీన్స్ ప్యాంట్ల జేబులు చాలా చిన్నగా ఉంటాయి. దీనికి కారణం ఎప్పుడైనా ఆలోచించారా?

వస్త్ర ప్రపంచంలో జీన్స్ దుస్తులు ఎవర్‌గ్రీన్. ఫ్యాషన్ ప్రియులకు జీన్స్ అంటే నమ్మకం, భరోసా. అలాంటి జీన్స్ ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా మారుతూ.. యువతని ఆకట్టుకుంటున్నది. వాస్తవానికి జీన్స్ అన్ని వయసుల వారికి ఇట్టే ఒదిగిపోతుంది. అయితే, ఈ మధ్యకాలంలో అమ్మాయిల ధరించే జీన్స్ ప్యాంట్లకు జేబులు చాలా చిన్నవిగా ఉంటున్నాయి. అబ్బాయిలైతే ఓ జేబులో సెల్‌ఫోన్, మరో జేబులులో పర్సు, ఏవైనా చిన్న వస్తువులు వేసుకొని దర్జాగా వెళ్తుంటారు. అదే అమ్మాయిల జేబులో కనీసం ఫోన్ కూడా పూర్తిగా పట్టదు. అదికూడా సగానికి పైగానే కనిపిస్తుంది. ఇదే ఇప్పుడు కొత్త తరహా ఫ్యాషన్ అంటున్నారు జీన్స్ డిజైనర్లు.

అమ్మాయిల ప్యాంట్ జేబులు పెద్ద సైజులో పెడితే.. ఆకారమే మారిపోతుందని అంటున్నారు. మొబైల్ సగానికి పైగా కనిపించడం ఈ ట్రెండ్‌లో భాగమనే చెప్తున్నారు. కొంతమంది మహిళలు సంప్రదాయ దుస్తులకు కూడా ప్రత్యేకంగా జేబులు పెట్టించుకోవడానికి ఇష్టపడుతున్నారని డిజైనర్స్ చెబుతున్నారు. ఇంకొంతమంది జేబులు అవసరం లేకుండా చిన్న జిప్‌లు తమ దుస్తులకు పెట్టించుకుంటున్నారట. మరికొంతమందైతే.. ప్యాంట్‌కి జేబులే ఉంచుకోవడం లేదు. ఎంతైనా జీన్స్ ప్యాంట్ వెనుక జేబులో ఫోన్ పెట్టుకొని నడుస్తుంటే ఆ లుక్కే వేరంటున్నారు ఫ్యాషన్ ప్రియులు.