చిన్న వయసులో పొదుపే శ్రీరామరక్ష

వ్యక్తిగత ఫైనాన్స్‌లో పొదుపు, పెట్టుబడి అనేవి రెండు అత్యంత కీలక అంశాలు. సంపాదనలో పడ్డాక ప్రతీ ఒక్కరు ఈ రెండింటిని వీలైనంత త్వరగా ప్రారంభించాలి. అయితే చాలామంది అరకొర ఆదాయం కారణంగా వీటిపై దృష్టిసారించరు. ఉద్యోగంలో చేరిన తొలి పదేండ్లదాకా ఇదే పరిస్థితి. కానీ ఇది సరికాదు. సంపద వృద్ధికి కావాల్సినంత సమయం అవసరం. 30 ఏండ్ల వయసులోకి అడుగిడినా.. లేదంటే 35 ఏండ్ల వయసున్నా.. మీకు పైండ్లె, పిల్లలుండటం చాలాచాలా సాధారణం. అంటే ఉద్యోగ సంబంధిత బాధ్యతలకుతోడు కుటుంబ బాధ్యతల్నీ మోస్తున్నారన్నమాట. కాబట్టి మీరు పెట్టుబడులను ఇంకా ఆరంభించకపోతే, దానివల్ల మీకు జరిగే నష్టం.. ఎందుకు మదుపుపై తీవ్రంగా ఆలోచించాలి అన్నది తెలుసుకుందాం.

మీ బాధ్యతల్ని గుర్తించండి

మీరు ఒంటరిగా ఉన్న రోజులు అయిపోయాయి. మీకు ఇప్పుడు ఓ కుటుంబం అంటూ ఉన్నది. భార్య, పిల్లలు ఇలా అంతా ఉన్నారు. చాలాచాలా గుర్తుంచుకోండి.. మీ పిల్లలు ఎదుగుతున్నారు. ఉన్నత విద్య వైపువెళ్తున్నారు. అయితే ఈ అవసరాలన్నింటినీ తీర్చుకునే సామర్థ్యం మీ దగ్గరుందా?.. రోజురోజుకూ పెరిగే ఈ ఖర్చులన్నింటినీ మీరు భరించగలరా?.. పైగా కాలం గడుస్తున్నకొద్దీ ఆరోగ్య సమస్యలూ వచ్చిపడుతాయని మీకు తెలుసా?.. ఈ ప్రశ్నలన్నింటికీ మీ దగ్గర సమాధానం లేదు.. తెలియదు అన్నదే అయితే ఇకనైనా జాగ్రత్తపడండి.

ఖర్చుల్ని తగ్గించి పెట్టుబడులకెళ్లండి

సరైన సమయంలో కాకుండా దాదాపు దశాబ్దకాలం, అంతకంటే ఎక్కువకాలం నుంచి మీరు పొదుపు, పెట్టుబడుల వైపు చూడకపోతే ఆ ప్రభావం మీ దీర్ఘకాలిక ప్రయోజనాలపై చూపుతుంది. తొలి పదేండ్లలో మీరు పోగేసిన సొమ్మే.. తర్వాతి పదేండ్లలో మీకు ఆకర్షణీయ ప్రతిఫలాల్ని అందిస్తుంది. కానీ మీరు ఇప్పటికే ఆలస్యమైపోయారు. అయినప్పటికీ ఆందోళన అక్కర్లేదు. ఖర్చుల్ని తగ్గించుకోండి. అలా మిగిలిన సొమ్మును పెట్టుబడుల వైపు మళ్లించండి. ఇది సాధ్యమైతే మీకు లాభం చేకూరుతుంది. అంతేగాక మీ పెట్టుబడులూ పెరుగుతాయి.

బీమాను మరువద్దు

మీరు ఏ వయసులో ఉన్నా.. బీమాను మాత్రం మరువకండి. ఇన్సూరెన్స్ కూడా మీ ఆర్థిక ప్రణాళికలో ఓ భాగమే. జీవిత బీమాగావచ్చు.. ప్రమాద బీమాగావచ్చు.. ఆరోగ్య బీమాగావచ్చు.. అదేదైనా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. ఇప్పటికీ మీకు బీమా లేనైట్లెతే, వెంటనే చేయించుకోవడం ముఖ్యం. బీమాను ఆలస్యంగా చేయించుకున్నా అది మీకు ఆర్థిక భారమేనని గుర్తించండి. చిన్న వయసులో ఉన్నప్పుడే బీమా చేస్తే ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. పాలసీ సొమ్మూ ఎక్కువగా అందుతుంది. రిటైర్మెంట్ ప్రణాళిక అవసరం

మనకు ఎన్ని ఆర్థిక లక్ష్యాలున్నా.. పదవీ విరమణ తర్వాతి కాలం చాలాచాలా ముఖ్యమైనది. జీవితం చివరి దశలో రిటైర్మెంట్ అన్నది ఉన్నా.. ఇందుకూ ఓ ప్రణాళిక ఎంతో అవసరమని గుర్తించాలి. పనిచేసే సామర్థ్యం తగ్గినప్పుడు లేదా లేనప్పుడు ఈ రిటైర్మెంట్ ప్లాన్లే మనల్ని కాపాడుతాయి. కనుక ముందు నుంచే ఇందుకూ కాస్త సొమ్మును వెనుకేసుకోవడం ఎంతైనా ఉత్తమం. అయితే ఇప్పటికే మీ పెట్టుబడులు ఆలస్యమైపోయాయి. అయినప్పటికీ అనవసర వ్యయాన్ని తగ్గించి, క్రమశిక్షణ కలిగిన ఆర్థిక జీవనాన్ని పాటిస్తే లక్ష్యం సాధ్యమే.

లక్ష్యాలు ఎక్కువ.. సమయం తక్కువ

ఇప్పటిదాకా మీరు మీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసి ఉంటారు. దీనివల్ల మీకు జీవితంపై ఓ అవగాహన అనేది కచ్ఛితంగా ఉంటుంది. మీకు ఎదురైన అనుభవాలు ఆర్థిక లక్ష్యాల విలువను చెప్పే ఉంటాయి. వాహనం, ఇల్లు కొనుగోలు కావచ్చు, పిల్లల చదువో లేదంటే పెండ్లిండ్లు ఏదైనాసరే. ఈ లక్ష్యాలన్నీ ఎక్కువే, అలాగే మీకున్న సమయం కూడా తక్కువేనని గుర్తించాలి. అప్పుడే పెట్టుబడులకు, పొదుపునకు మనల్ని మనం సిద్ధం చేసుకోగలం. మీకింకా 25 ఏండ్లు పనిచేసే వయసున్నా.. పెట్టుబడులను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దు.