కొత్త శకానికి నాంది!

మన దేశంలో ఉన్న కొందరు ఆఫ్రికన్ అమ్మాయిలకు, అబ్బాయిలకు.. డ్రగ్స్ బానిసలు అనే పేరుండేది. ఈ చెడ్డ పేరును రూపుమాపేందుకు జాంబియా దేశానికి చెందిన ఓ విద్యార్థిని విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలో కొత్త శకానికి నాంది పలుకడానికి నిత్యం కృషి చేస్తూనే ఉన్నది.

జాంబియా దేశానికి చెందిన ఈ యువతి పేరు లారిస్క కలోంగో. మన ఉస్మానియా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నది. కలోంగో రెండేండ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటున్నది. ఆఫ్రికా దేశాలకు చెందిన కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు డ్రగ్స్‌కు బానిసలవడం, మాదక ద్రవ్యాల సైప్లెలో పాలుపంచుకోడం కలోంగోను తీవ్రంగా కలిచివేసింది. ఎలాగైనా వారిలో మార్పు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నది. మోడల్ అయిన కలోంగో.. మిస్ ఆఫ్రికా ఇండియా పోటీలు నిర్వహించి వారిని ఇటువైపు మళ్లించాలనుకున్నది. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకొని 12 మందితో కలిసి బృందంగా ఏర్పడింది. మన దేశంలోని పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో చదువుకుంటున్న ఆఫ్రికా దేశాల యువతకు తన ఆలోచన చెప్పింది. ఇందుకు సానుకూలంగా యువతులు దాదాపు 230 మంది వరకూ ఆడిషన్లలో పాల్గొన్నారు. ఈనెల 8న హైదరాబాద్‌లో మిస్ ఆఫ్రికా ఇండియా పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేసింది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి గురించి ఆఫ్రికా దేశాల సంస్కృతి, సంప్రదాయాలను వివరిస్తూ.. మార్పు తెచ్చేందుకు ప్రత్నించింది. పెడదోవ పడుతున్న ఆఫ్రికన్లను మంచి మార్గంలో నడిపించేందుకు తన వంతుగా ప్రయత్నాలు చేస్తున్నది కలోంగో.