గొంతు బొంగురు.. థైరాయిడా?

నా వయసు 38 సంవత్సరాలు. ఈ మధ్య నాకు తుమ్ములు.. దగ్గులు విపరీతంగా వస్తున్నాయి. అవి వచ్చిన తర్వాత గొంతు పూర్తిగా బొంగురుపోతుంది. ఓ గంట తర్వాత మామూలు స్థితికి వస్తుంది. తెలిసినవాళ్లు దీనిని థైరాయిడ్‌గా చెప్తున్నారు. ఇది నిజమేనా? థైరాయిడ్ లక్షణాలేంటి? నాకు.. నిద్రలో గురక పెట్టే సమస్య ఉంది. గొంతు బొంగురుకు, గురకకు ఏమైనా సంబంధం ఉందా? -వై. సుదర్శనం, చిట్యాల

సుదర్శనం గారూ.. అలర్జెక్ రినిటీస్ లేదా థైరాయిడ్.. స్లీప్ ఆప్నియా సిండ్రోమ్ వంటి వ్యాధులు ఉంటే తుమ్మినా.. దగ్గినా వెంటనే నోరు బొంగరు పోవడం జరుగుతుంది. ఇటీవల ఇలాంటి సమస్యలో చాలామందిలో చూస్తున్నాం. దీని గురించి దిగులు చెందకుండా కారణమేంటో తెలుసుకోండి. ఇది థైరాయిడా? అని నిర్ధారించాలంటే మీరు నేరుగా కలిస్తేనే తెలుపగలం. ఎందుకంటే థైరాయిడ్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు. వ్యాధి తీవ్రతను బట్టి.. లక్షణాలను బట్టి మాత్రమే అది థైరాయిడో కాదో తెలుపగలం. థైరాయిడ్‌లో కూడా రకాలున్నాయి. అవి: 1.హైపో థైరాయిడిజం 2.హైపర్ థైరాయిడిజం. శరీరం అధిక బరువుతో లేక మరీ తక్కువ బరువుతో ఉన్నవారిలో హైపోథైరాయిడిజం ఎక్కువగా ఉంటుంది. వీరిలో ముఖం లావుగా ఉంటుంది. చల్లని పదార్థాలు.. వాతావరణం పడవు. హైబీపీ ఉండటం.. బరువు తగ్గుతూ ఉండటం వంటి లక్షణాలు ఉంటే అది హైపర్ థైరాయిడిజం. కాబట్టి ప్రత్యేకంగా ఎక్కడా గొంతు బొంగురు పోవడమనే లక్షణం ఉంటే థైరాయిడ్ ఉంటుందని ఎక్కడా చెప్పలేదు.

కాబట్టి మీరు ముందుగా పరీక్షలు చేయించుకొని మీ సమస్య ఏంటో నిర్ధారించుకోండి. నాసికా రంధ్రాలలోని పాలిప్స్.. డీఎన్‌ఎస్.. ఇసినోఫిల్ లెక్కింపు కోసం హోమోగ్రామ్.. థైరాయిడ్ పరీక్ష.. ఆర్‌బీఎస్.. పాలిసోమ్నోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోండి. వీటివల్ల గొంతు బొంగరు ఎందుకు పోతుంది? గురక ఎందుకు వస్తుంది? అదే ఏ స్థాయిలో ఉంది? దానివల్ల గొంతు బొంగురు పోవడానికి ఏమైనా సంబంధం ఉందా? వంటి విషయాలన్నీ తెలుస్తాయి. అప్పటివరకు మాన్‌ల్యూకాస్ట్.. లెవోసిట్రిజెన్ వంటి టాబ్లెట్లు ప్రతిరోజూ సాయంత్రం వాడండి. పది రోజులు వాడితే సరిపోతుంది. మీకు సమస్య ఉంది కాబట్టి చల్లని పానీయాలు, పదార్థాలు తీసుకోకండి. వేడివేడి పదార్థాలు మాత్రమే తీసుకోండి. చలికాలంలో బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రోజులో అర్ధగంటపాటు వ్యాయామం చేయండి. ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. గురక సమస్య ఉందంటున్నారు కాబట్టి.. ఆల్కహాల్ తీసుకొని పడుకుంటే నిద్రలో అది పొరమరిలే ప్రమాదం ఉంది. జాగ్రత్తలు పాటిస్తే మీ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. ఆల్ ది బెస్ట్!

-డాక్టర్ వి. రవి ప్రవీణ్‌రెడ్డి మెడికల్ సూపరిండెంట్ సీహెచ్‌సీ చిట్యాల, జయశంకర్ భూపాలపల్లి