మహిళా క్రికెటర్లకు మద్దతు

నీలి రంగు జెర్సీలు వేసుకుని ఫొటో దిగాలి.. ఒక్కరు ముగ్గుర్ని నామినేట్ చేయాలి. హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేసి ట్వీట్ చేయాలి- ఇదో సరికొత్త ఉద్యమం. సోషల్‌మీడియాలో ఉధృతంగా సాగుతున్న ఉమెన్ ఇన్ బ్లూ విప్లవం. వివక్షకు వ్యతిరేకంగా.. మహిళా క్రికెటర్లకు మద్దతుగా సాగుతున్న నవతరం పోరాటం ఇది. ఇటీవల మిథాలీరాజ్ రికార్డులను బద్దలు కొట్టింది. టీ20 మ్యాచ్ వ్యక్తిగత అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన మొదటి నలుగురిలో ఇద్దరు మహిళా క్రికెటర్లు ఉన్నారు. 2283 పరుగులతో మిథాలీరాజ్, 2207 పరుగులతో రోహిత్‌శర్మ, 2102 పరుగులతో విరాట్‌కోహ్లీ, 1827 హర్మాన్‌ప్రీత్ కౌర్‌లు వరుస నాలుగు స్థానాల్లో నిలిచారు.
క్రీడల్లో ఎక్కువ వివక్షకు గురయ్యే క్రీడాకారుల నుంచే ఈ ఉద్యమం ప్రారంభమైంది. మహిళా టీ20 వరల్డ్‌కప్ మొదలయింది కదా. ప్రస్తుతం లీగ్ దశ మ్యాచ్‌లు నడుస్తున్నాయి. టీమిండియా మహిళల జట్టు ఈ దశలో సెమీఫైనల్స్‌కు వెళ్లింది. ఫైనల్‌కు వెళ్లాలని సగటు భారతీయుడు కోరుకుంటున్నాడు. సామాజిక మాధ్యమాలలో తనవంతుగా మహిళా క్రికెటర్లకు మద్దతు తెలుపుతున్నాడు. నవంబర్ 14..ఏంటి ఈ రోజు ప్రత్యేకత? బాలల దినోత్సవం మాత్రమే కాదు.. భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఈ రోజు ఓ వీడియో ట్వీట్ చేశాడు. అది ఇప్పుడు ఒక ఉద్యమంగా మారింది. మహిళా క్రికెటర్లను ప్రోత్సహిస్తూ వాళ్లలో ఉత్తేజాన్ని నింపడం కోసం కోహ్లీ ఈ ప్రచారాన్ని మొదలెట్టాడు. సామాజిక మాధ్యమాల ద్వారా ఉమెన్ ఇన్ బ్లూ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. అటు తర్వాత ట్వీట్ల పరంపర మొదలైంది. ఉమెన్ ఇన్ బ్లూ (#womeninblue) హాష్ ట్యాగ్‌తో దాదాపు భారత క్రికెటర్లంతా ట్వీట్ చేశారు. ప్రముఖ క్రీడాకారులు, సెలెబ్రిటీలు స్పందిస్తూ రీట్వీట్‌లు కూడా చేస్తున్నారు. ఈ జెర్సీకి మీరెవరు, మీరెక్కడి నుంచి వచ్చారో తెలియదు. మీరు స్త్రీలా, పురుషులా కూడా ఎరుగదు. మనస్ఫూర్తిగా దేశం కోసం ఆడి మన ఖ్యాతిని ప్రపంచానికి చాటాలి అని వీడియో ట్వీట్ చేశాడు విరాట్. ఈ వీడియోలో వెస్టిండీస్, టీమిండియా ఫైనల్ మ్యాచ్ కోసం శుభాకాంక్షలు తెలిపాడు. మీరూ ఇప్పుడే హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయడం మొదలుపెట్టండి. నావంతుగా సునీత్‌ఛత్రీ, రిషబ్‌పంత్, సైనా నెహ్వాల్‌లను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు.
జెర్సీఅది కేవలం నీ తపను చూస్తుంది. జెర్సీకి లింగవివక్ష ఉండదు అని ట్వీట్ చేసింది మేరీ కోమ్. అభినవ్ బింద్రా, ఇమ్రాన్‌ఇరంపాల్‌లకు నామినేట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. నేను టీమిండియా మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నా. మేరీకోమ్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్, హార్ధిక్ పాండ్యా ప్రతీఒక్కరూ మన బ్లూ జెర్సీ వేసుకొని ఈ రోజు రాత్రికి ఫొటోలను పోస్ట్ చేస్తూ మీ మద్దతు తెలుపండి. చొరవ తీసుకొని మొదటి అడుగు వేసిన విరాట్ కోహ్లీకి ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది సానియా మీర్జా. దీనికి బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ కూడా స్పందించింది.