శకుంతల

లోకంలో ఏ స్త్రీ కూడా సీతలా కష్టాలు అనుభవించకూడదనీ, సీతజాతి చరిత్రను తిరగరాసేలా ఉండాలే గానీ అనాదరణే తన జీవిత పంథాగా మార్చుకోకూడదనీ ఎంతోమంది చెబుతుంటారు. వినడానికి బాగానే ఉన్నా స్త్రీ విషయానికి వచ్చేసరికి ఆచరణ కరువవుతుంది. ఆలోచన చిన్నదవుతుంది. పుట్టుక, పెంపకం, వివాహం, గృహస్థ జీవితం, జీవిత చరమాంకం... ఇలా ప్రతీ మలుపు స్త్రీని అనాదరణ దిశగానే నెట్టేస్తున్నాయి. సరే, మంచీ చెడు తెలియని వారి మధ్యనో, మానవీయత లేనివారి మధ్యనో, కుటుంబ పరిస్థితుల అనిశ్చితి కారణంగానో, సమాజపు కట్టుబాట్ల కారణంగానో, పురుషాధిక్య ప్రపంచంలోనో స్త్రీ సీత కష్టాలను అనుభవిస్తుందంటే అనాదరణకు గురవుతుందంటే విషయం వేరు. అన్నీ తెలిసినా, ఆలోచించేంత స్థాయి ఉన్నా స్త్రీ అనాదరణ పొందుతుందంటే తప్పెవరిది? అయినా స్త్రీ కుంగిపోవట్లేదు, మదన పడట్లేదు, నిరసన ప్రకటించడం లేదు. కేవలం సర్దుకుపోతుంది. ఆ సర్దుబాటు కూడా తనవారని తాను నమ్మిన బంధం కోసం మాత్రమే. మనుషులు తనను ఆదరించకపోయినా ప్రకృతి, తనదైన జీవితం, తనదైన మరణం మాత్రమే తనను ఎన్నటికీ వదిలిపెట్టలేదనే విషయాన్ని స్త్రీజాతి కోణంలో తెలియజేసింది శకుంతల. - ప్రమద్వరమే

నక, విశ్వామిత్రుల స్వంతకూతురు శకుంతల. అడవిలో ప్రకృతి ఒడిలో పక్షులద్వారా రక్షించబడి, పక్షులద్వారానే కణ్వుడికి అప్పజెప్పబడింది కనుక శకుంతలగా పేరుగాంచింది. కణ్వమహర్షి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు శకుంతల. ఆశ్రమ వాతావరణంలో, అందమైన ప్రకృతి పోషణలో, అరణ్యజీవులనే తన తోబుట్టువులుగా భావించి పెరిగి పెద్దదైంది శకుంతల. ఆమె రూపం వాసన చూడని పువ్వు. గోరుసోకని చిగురు. ఉలితో చెక్కని రత్నం. ఆస్వాదించని మధువు. ఎన్నో పూర్వ జన్మల పుణ్యాల అఖండ ఫలం. అయితేనేం తల్లిదండ్రులు చిన్ననాడే వదిలేసారు. ఆశ్రమాన్ని రక్షిద్దామని వచ్చిన దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకొని త్వరలోనే వచ్చి నిన్ను తీసుకెళ్తాననీ, ఈ ప్రపంచంలో నేను పాలించే భూమినీ, నా భార్యవైన నిన్నూ ఎన్నటికీ మర్చిపోననీ మాట ఇచ్చి వెళ్ళిపోతాడు. కణ్వుడు తను ఆశ్రమంలో లేనప్పుడు జరిగిన శకుంతలా దుష్యంతుల గాంధర్వ వివాహం గురించి తెలుసుకొని కూతురు ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్ళాల్సిందేనని వీడ్కోలు చెప్పి పంపిస్తాడు.

శకుంతల ఆశ్రమం వదిలి అత్తవారింటికి వెళ్ళే సందర్భం హృదయవిదారకం. ఆమె పెంచుకున్న చెట్లూ, లతలూ, జంతువులు ఆమెను వదిలి ఉండలేమని తపించాయంటే ఆమెలోని సహృదయత అర్థం అవుతుంది. శకుంతల దుష్యంతుని దగ్గరకెళ్ళి అసలు తనకీ దుష్యంతునికీ సంబంధమే లేదన్న పిడుగులాంటి మాటను వినాల్సి వచ్చింది. భర్త దగ్గర అనాదరణ పొందిన స్త్రీ, భర్తే తన జీవితం అనుకొని తన వారందరినీ వదిలి వచ్చిన స్త్రీ తిరిగి పుట్టింటికి వెళ్ళడం సాధ్యపడదని మరో ఆశ్రమ జీవితాన్ని వెదుక్కుంది శకుంతల. అక్కడ కూడా ప్రకృతిలో మమేకమవుతూ ప్రశ్నార్థకం అయిన తన జీవితానికి సమాధానాలు వెతక్కుండా కాలం పంచన జీవితం గడపసాగింది. తర్వాత భారతీయతకు పేరు నిచ్చిన భరతవంశానికీ రూపమిచ్చిన భరతుడు శకుంతలకు జన్మించాడు. అయినా ఆమెలో ధైర్యం తగ్గలేదు. సహజమైన పుట్టుక బతకడం కూడా నేర్పించకపోదనే ధీమా ఆమెది.

దుష్యంతుడు తిరిగి వచ్చి శకుంతలనూ, తన పుత్రుడైన భరతుడినీ స్వీకరించి, తప్పు నాదేననీ ఒప్పుకున్నా ఒక్కమాటైనా మాట్లాడక తనవెంట నడిచింది శకుంతల. ఎంతటి గొప్ప మనసంటే లోకం ముందు తన జీవితం అభాసుపాలైనా, అందులో తన తప్పేమీ లేకపోయినా, నిందించక జీవితం ముందుకు సాగిస్తుంది శకుంతల.జీవితం పట్ల ఆశ అనేది ఒక బంధంలా మనుషుల్ని అల్లుకుపోతుంది. ఆ బంధం ఎంతటి దుఃఖాన్నైనా సహించేటట్లు చేస్తుంది. అయితే స్త్రీలలో సహజంగా ఉండేదే ఆశ. కానీ, అది స్వార్థజనితం కాదు. తన వారు తన కుటుంబం, తన వంశం బాగుండాలనే అభిలాష. శకుంతలదీ అదే అభిలాష. అందుకోసం జీవితం ఇచ్చిన జీవితాన్ని జీవిస్తూనే, అన్ని మలుపులనూ దాటుతూ, అనాదరణనను కూడా ఆదరిస్తూ, తన కర్తవ్యాలను నిర్వర్తిస్తూ చివరిదాకా జీవితం సాగించింది. ప్రకృతి పంచన, ఆలోచనల విస్తృత వివేచన, కాలంపై విశ్వసనీయత, స్త్రీలోని సహజ మానవీయత, కాఠిన్యమైన పరిస్థితులకు చెదరని ఆత్మనిశ్చలత శకుంతలకు మాత్రమే అనువర్తిస్తాయి. ప్రతీ స్త్రీ కూడా శకుంతలలా అనాదరణకు ఏదో ఒక సందర్భంలో బలవ్వక తప్పదు. అయినా గంభీరమైన తన ప్రవర్తనతో తానే అందరినీ ఆదరిస్తూ వస్తుంది. అర్థం చేసుకుంటే స్త్రీలలోని స్వచ్ఛత మరింత ద్విగుణీకృతమై జీవితాలకు దారీ, తెన్నూ చూపగలదు. అపార్థం చేసుకుంటే వారి సహవాసానికి దూరమై జీవితంలో అమూల్యమైన కాలాన్ని కోల్పోతారనే విషయం శకుంతల తనద్వారా ప్రపంచానికి నిరూపించింది.

అర్థం చేసుకుంటే స్త్రీలలోని స్వచ్ఛత మరింత ద్విగుణీకృతమై జీవితాలకు దారీ, తెన్నూ చూపగలదు. అపార్థం చేసుకుంటే వారి సహవాసానికి దూరమై జీవితంలో అమూల్యమైన కాలాన్ని కోల్పోతారనే విషయం శకుంతల తనద్వారా ప్రపంచానికి నిరూపించింది.