దృశ్యం పై ఉద్యమం

మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్లు, మన కూతుళ్ల్లు బయటికెళ్తే తిరిగి వచ్చే వరకు ఎందుకు సర్ మనం భయం భయంగా ఉంటున్నాం. బిక్కుబిక్కుమంటూ ఎందుకుంటున్నాం? అరె వాళ్లేమన్నా.. అడవుల్లోకి.. బాంబుల మధ్యా.. లేదంటే ఎడారుల్లోకి వెళ్తున్నారా? మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్లేది?ఆడది బయటికి వస్తే చాలు సర్.. సందుల్లోనూ, రోడ్లల్లోనూ, బస్టాపుల్లోనూ, బస్సుల్లోనూ, రెస్టారెంటుల్లోనూ, ఆఫీసుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ, పార్కుల్లోనూ, కాలేజీల్లోనూ.. ఎక్కడపడితే అక్కడ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ల మధ్యలో నడవాలి సర్.. మన స్త్రీ. ఎప్పుడు.. ఎవడు.. ఎక్కడ.. ఏం చేస్తాడోనని భయం సర్ మనకి. భయం. - ఇది రాఖీ సినిమా ైక్లెమాక్స్ కోర్ట్ సీన్‌లో జూ. ఎన్టీఆర్ డైలాగ్. అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది? ఏం మారలేదు! అవే కళ్లు. దానికి తోడు మరో కన్ను. అదే మూడో కన్ను. స్పై కెమెరా. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరు.. ఏ అమ్మాయిని దృశ్యంగా బంధిస్తారో తెలియదు.

దృశ్యం సినిమా చూసే ఉంటారు.. అందులో బాధితురాలిలాంటి వాళ్లు మన మధ్యే చాలా మంది ఉన్నారు. కొందరు భయపడి బయటికి చెప్పుకోవడం లేదు. ఇంకొందరు చెప్పుకోలేక భయపడి బలవన్మరణం పాలవుతున్నారు. తప్పు బాధితులది ఏ మాత్రం కాదు. ట్రయల్ రూమ్‌లో డ్రెస్ మార్చుకోవడం వారి తప్పా? రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే వారి తప్పా? అలా నడుస్తున్నప్పుడు ఎవడో ఫొటో తీశాడు. మార్ఫింగ్ చేశాడు. నెట్‌లో పెట్టాడు. ఈ తప్పు ఎవరిది? మూడో కన్నుది. అది సెల్‌ఫోన్, కావొచ్చు స్పై కెమెరా కావొచ్చు. దటీజ్ రెడ్ ఐ. ఈ మూడో కంటిపై నియంత్రణ ఉండాలి అంటూ యాంటీ రెడ్‌ఐ ఉద్యమం మొదలెట్టింది జి. వరలక్ష్మి.

ఇలాంటి సంఘటనలు నిత్యం ఎన్నో.. ఎన్నెన్నో. ఏమో.. ఎక్కడుందో ఆ మాయదారి మూడో కన్ను (స్పై కెమెరా). బాత్ రూములోనో, కబోర్డ్‌లోనో, కళ్లజోడులోనో, బీరువాలోనో, పెన్నులోనో, కీ చైయిన్‌లోనో, పవర్‌బ్యాంక్‌లోనో, బల్బులోనో, ఫ్యాన్‌లోనో, షర్టు బటన్‌లోనో, వాచీలోనో.. ఎక్కడని చెప్పలేం. కానీ అది నిరంతరం మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. వీటి వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో అమ్మాయిల జీవితాలు అగమ్యగోచరం అవుతున్నాయి. అవగాహన లేక ఆదమరిస్తే.. ఫొటోలు, వీడియోలు.. నీలిరంగు పులుముకుని ఇంటర్‌నెట్‌కు ఎక్కుతున్నాయి.

కేరళలో ఒక ఫొటోగ్రాఫర్ పెండ్లికెళ్లాడు. ఫొటోలు తీశాడు. మార్ఫింగ్ చేశాడు. వాటిని 50 వేల మందికి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు. ఈ దారుణంపై కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. ఏడాది కావస్తున్నా ఆ కేసు ఇప్పటి వరకూ బెంచ్ చేరుకోలేదు. ఇదీ మన వ్యవస్థ. ఈ సమస్యకు ఓ పరిష్కారంగా, బాధితులకు అండగా.. స్పై కెమెరాలపై నియంత్ర ఉండాలంటూ యాంటీ రెడ్‌ఐ ఉద్యమం మొదలైంది.

బాధితులకు తోడుగా యాంటీ రెడ్‌ఐ

స్పై కెమెరాలతో మహిళల ప్రైవేట్ లైఫ్‌ను వీడియోలు తీసి.. పోర్న్‌సైట్స్‌కు అమ్ముకుంటున్నారు కొందరు దుర్మార్గులు. దీంతో ఎంతోమంది మహిళలు మనోవేదనకు గురవుతున్నారు. మరికొంతమంది పరువు పోతుందేమోనని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఇలాంటి బాధితులందరికీ అండగా యాంటీ రెడ్‌ఐ ఉద్యమిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోనే కాకుండా పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్రల్లోనూ ఈ ఉద్యమం ఊపందుకుంటున్నది.

ఉద్యమం ఊపిరి పోసుకున్నదిలా..

ఖమ్మం పట్టణానికి చెందిన జి.వరలక్ష్మీ డిగ్రీ వరకూ చదివింది. ఆమెకు చిన్నప్పటి నుంచి సమాజానికి సేవ చేయాలని కోరిక. దీంతో ఆమె హెవెన్ హోమ్స్ సొసైటీ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళా, శిశు సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అలా సమాజసేవలో బిజీగా ఉన్న ఆమెకు ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యురాలిగా పనిచేసే అవకాశం వచ్చింది. ఆ సమయంలో సమాజంలో స్పై కెమెరాలను ఎలా దుర్వినియోగం అవుతున్నాయి అనే అంశం మీద తన టెక్నికల్ టీమ్‌తో అధ్యయనం చేయించింది. ఆ అధ్యయన ఫలితాలు, కొన్ని వీడియోలు చూసిన వరలక్ష్మి చలించిపోయింది. స్పై కెమెరాల వల్ల జరిగే అఘాయిత్యాలను కళ్లారా చూసి, ఎలాగైనా వాటిపై నియంత్రణ తెచ్చే ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నది. అందుకే యాంటీ రెడ్‌ఐ ఉద్యమాన్ని లేవనెత్తింది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, అహర్నిశలు కష్టపడుతూ ఎంతోమంది బాధితులను కాపాడింది.

ప్రత్యేక చట్టం కావాల్సిందే..

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ స్పై కెమెరాల విక్రయాలపై నియంత్రణ లేకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుందని గట్టిగా వాదిస్తున్నారు వరలక్ష్మి. దీని వల్ల ఎంతోమంది ఆడవాళ్ల జీవితాలు నాశనం అవుతున్నాయని అంటున్నారు. మెడికల్ షాపుల్లో మందులు కొనేప్పుడు ప్రిస్కిప్షన్, గన్‌కు ఇచ్చినట్లుగా లైసెన్స్‌ల లాంటి నిబంధనలు స్పై కెమెరాల విషయంలో కూడా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు వరలక్ష్మి. దీంతోపాటు ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 354సి, 2013 చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని, బెయిల్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్యమిస్తున్నారు. దీనికి మద్దతు కూడగట్టేందుకు ఒక సెల్ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. 8099259925 నెంబర్‌కు మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా మీరూ మద్దతు తెలుపొచ్చు. ఇలా కోటి మంది వరకూ మద్దతు లభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఆ మద్దతును తెలియజేయనున్నది. కొత్త చట్టం తీసుకువచ్చేలా కూడా కృషి చేస్తున్నది.

రేపటి బాధితులు మనవాళ్లే!

స్పై కెమెరాల దుర్వినియోగంపై వరలక్ష్మి చేస్తున్న ఉద్యమంలో సినీతారలు, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములవుతున్నారు. యాంటీ రెడ్‌ఐ ఉద్యమానికి ఆడవారు వారు మాత్రమే కాదు, మగవాళ్లు కూడా మద్దతు తెలుపాల్సిన అవసరం ఉందని అంటున్నారు వరలక్ష్మి. ఎందుకంటే సమస్య మాది కాదులే అని ఊరుకుంటే.. రేపు బాధితులు మీ కుటుంబసభ్యులే కావచ్చు. అందుకే చికిత్స కంటే ముందు నివారణ మార్గాలే వెతుక్కోవాలన్నది ఆమె ఉద్దేశం. యాంటి రెడ్‌ఐ ఉద్యమం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కలిగించేందుకు వరలక్ష్మి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ స్థాయిలో షార్ట్‌ఫిల్మ్ పోటీలు నిర్వహించి, ఉత్తమ చిత్రాలకు బహుమతులందజేశారు.

అవగాహనే ముఖ్యం..

స్పై కెమెరాలను ఉపయోగించి లైంగికానందం పొందేవాళ్లను సైకో సెక్సువల్ డిజార్డర్ పర్సన్ అంటారు. ఇలాంటి మృగాళ్లు ఆ వీడియోలు చూసి ఆనందం పొందిన తర్వాత.. ఇతరులతో పంచుకోవడం, అమ్ముకోవడం చేస్తుంటారు. మరికొందరు దుర్మార్గులైతే అమాయకులను బెదిరించి లోబర్చుకోవడం, డబ్బులు వసూలు చేయడం వంటివి చేస్తుంటారు. అందుకే స్పై కెమెరాలపై అవగాహనే ముఖ్యమని అంటున్నారు నిపుణులు. బహిరంగ, రహస్య ప్రదేశాల్లో స్పై కెమెరాలను గుర్తించేందుకు వీలుగా కొన్ని పద్ధతులను అవలంభించాలంటున్నారు. ఆండ్రాయిడ్‌లో, ఆపిల్ ప్లేస్టోర్‌లలో స్పై డిటెక్షన్‌కు సంబంధించి కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని వాటి ద్వారా అక్కడ స్పై ఉన్నదీ, లేనిదీ గుర్తించవచ్చు. మార్కెట్‌లో స్పై కెమెరాలను గుర్తించేందుకు కొన్ని బగ్ డిటెక్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

దక్షిణ కొరియా స్ఫూర్తిగా ఉద్యమించాలి!

మనకు న్యాయంగా రావాల్సింది.. రాకపోతే ఏం చేస్తాం? ఎంత కష్టమైనా, పోరాడైనా దానిని సాధించుకుంటాం. ఇక్కడా అదే సూత్రం వర్తిస్తుంది. ఎందుకంటే మీ ప్రైవసీ, మీ లైఫ్ మీ ఇష్టం. దానిని ఎవడో బజారుకీడుస్తున్నాడు. బెదిరించి మీ శీలాన్ని దోచుకుంటున్నాడు. భయపెట్టి డబ్బులు గుంజుతున్నాడు. మభ్యపెట్టి లోబరుకుంటున్నాడు. వంచనతో మిమ్మల్ని నట్టేట ముంచుతున్నాడు. అలాంటి సైకో మృగాళ్ల ఆటకట్టించాలంటే మీరు పోరాడక తప్పదు. 2010 నుంచి జరుగుతున్న ఇలాంటి అఘాయిత్యాలను సహించలేక దక్షిణ కొరియా మహిళలు ఏకంగా రోడ్డుపైకి ఉ్యమించారు. కరేజ్ టూ బీ అన్‌కంఫర్టబుల్ అంటూ 20 వేల మందికి పైగా మహిళలు పోరాడారు. తమకు తెలియకుండా జరుగుతున్న రహస్య లైంగిక దోపిడీని అరికట్టాలంటూ గొంతెత్తి నినదించారు. ఎక్కడ పడితే అక్కడ రహస్య కెమెరాలు పెడుతున్న 6 వేలకు పైగా మృగాళ్ల ఆటకట్టించారు. ఉద్యమాలు చేసి, కఠిన చట్టాలు తిరగరాయించి విజయవంతమయ్యారు. ఆ స్ఫూర్తిని మనమూ కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైంది. - జి.వరలక్ష్మి, యాంటీ రెడ్‌ఐ

సంఘటన 1

హైదరాబాద్ నగరంలో ఓ ఇంట్లో కొత్తగా పెండ్లయిన దంపతులు అద్దెకు దిగారు. కామాంధుడైన ఆ ఇంటి యజమాని వాళ్లకు తెలియకుండా ఇంటి గోడల్లో మేకులను పోలిన స్పై కెమెరాలు పెట్టాడు. నెల రోజుల తర్వాత ఆ దంపతుల బెడ్‌రూమ్ దృశ్యాలు పోర్న్ వెబ్‌పైట్లలో దర్శనమిచ్చాయి. ఈ దారుణాన్ని ఆలస్యంగా తెలుసుకున్న దంపతులిద్దరూ, సమస్యకు పరిష్కారం ఆలోచించకుండా, పరువుపోతుందేమోననే భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం పోలీసుల పరిశోధనలో బయపడింది. అప్పుడే అందరికీ తెలిసింది. ఇలాంటివి వెలుగులోకి రాని సంఘటనలెన్నో.

సంఘటన 2

నగరానికి చెందిన ఓ యువతి.. తన బాయ్‌ఫ్రెండ్‌ను నమ్మింది. అతడు పెండ్లి చేసుకుంటాడనే ఉద్దేశంతో దగ్గరయింది. ఆ దృశ్యాన్ని అబ్బాయి సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ విషయం ఆ అమ్మాయికి తెలియదు. కొన్నాళ్లకు ఆ వీడియో ఆ అమ్మాయి నెట్‌లో కనిపించింది. బాయ్‌ఫ్రెండ్ మొఖం మాత్రం బ్లర్ చేసి ఉంది. రిలేషన్‌షిప్ బ్రేకప్ అయింది. అమ్మాయి అవమానంతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. కానీ ధైర్యం తెచ్చుకుంది. మానసిక, న్యాయ నిపుణులను కలిసింది. ఆ మాయగాడిపై కేసు వేసి, కటకటాలకు పంపింది.

...? పసుపులేటి వెంకటేశ్వరరావు విద్యాసాగర్