వ(అ)ండర్ వాటర్ రిసార్ట్స్!

నీళ్లలో కట్టడమే ఓ అద్భుతం. అందులో మరిన్ని అద్భుతాలు ఏర్పాటు చేస్తే మహాద్భుతం అవుతుంది. దుబాయిలో నిర్మించతలపెట్టిన అండర్ వాటర్ రిసార్ట్స్ నిజంగా గొప్ప వండర్..2016 సంవత్సరంలో 1.6 మిలియన్ల భారతీయులు దుబాయి సందర్శనార్థం వెళ్లారు. అక్కడున్న బీచ్‌లు, ఆకాశాన్ని తాకే అంతస్తుల భవనాలన్నింటినీ చూశారు. అప్పుడు వెళ్లిన వాళ్లే 2020లో వెళ్తే గతంలో చూసిన వాటితో పాటు ఒక కొత్త కట్టడాన్ని చూడొచ్చు. అదే అండర్ వాటర్ లగ్జరీ రిసార్ట్స్. ప్రపంచంలోనే మొదటిసారిగా దుబాయిలో ఫ్లోటింగ్ వెనిస్ పేరుతో అండర్ వాటర్ లగ్జరీ రిసార్ట్స్ నిర్మిస్తున్నారు. దుబాయిలోని అతిపెద్ద కట్టడాల్లో ఇది ఒకటి కానున్నది. అక్కడి ఇంజినీర్లు ప్రతిష్టాత్మకంగా దీని నిర్మాణ పనుల్లో తలమునకలై ఉన్నారు. దుబాయి ప్రధాన పట్టణం నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర తీరంలో దీని నిర్మాణం చేపట్టారు. ఇందులో రెస్టారెంట్స్, హోటల్ రూమ్స్, షాపింగ్, స్ట్రీట్స్ ఇలా ఎన్నో రకాల స్పాట్స్ ఏర్పాటు చేస్తారు. చుట్టూ అద్దాల గోడల అవతల చేపలు, వివిధ రకాల జల జీవాలు కదలాడుతుంటే ఇవతల పర్యాటకులు ఉంటారు. ఇందులో స్పా కూడా ప్రారంభించనున్నారు. ఇది కూడా ప్రపంచంలో మొదటి అండర్ వాటర్ స్పాగా రికార్డుల్లో కెక్కనున్నది. క్లెయిండినైస్ట్ గ్రూపు సంస్థ ఈ అద్భుత కట్టడాన్ని నిర్మిస్తున్నది.