పోరాడి గెలిచిన రత్నం

భర్తకు ఎయిడ్స్ .. వదిలేశాడు. భర్త వల్ల తనకూ ఎయిడ్స్.. అయినవాళ్లు వెళ్లగొట్టారు. ఇంకెందుకీ జీవితమని ఆత్మహత్య చేసుకుందామనుకుంది. విధి ఓడిపోయింది. ఈమె నిలిచి, గెలిచింది. రత్న జాదవ్ ఆదర్శ జీవిత కథ ఇది.

రత్న జాదవ్‌కు 2001లో హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా టకేలి గ్రామంలో పుట్టింది. వాళ్ల తల్లిదండ్రులు ఇద్దరు కూతుర్లు ఉన్నారని, కొడుకు కావాలనుకున్నారు. మూడో సంతానంగా పుట్టిన రత్న ఆడపిల్ల అని వదిలిపెట్టారు. ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఫీజు కట్టలేదని స్కూల్ నుంచి గెంటేశారు. ఒక టీచర్ చేరదీసింది. ఆర్థికంగా ఆదుకొని ఇంటర్ వరకు చదివింది. తన పదిహేనళ్ల ప్రాయంలో దత్తు జాదవ్‌ను పెండ్లాడింది. వివాహానంతర జీవితం సంతోషంగా గడుపుతున్న కాలంలో ఒక విషాద వార్త విన్నది. భర్తకు హెచ్‌ఐవీ ఉన్నదని తెలిసి కంగుతిన్నది. అంతలోనే కొడుకు (లఖాన్) పుట్టాడు. అనుమానంతో తనకు, తన కొడుకుకు పరీక్ష చేయించింది. ఇద్దరికీ ఎయిడ్స్. ఆ నోటా ఈ నోటా ఈ వార్త ఊరంతా పాకింది. అక్కడ ఉండలేక ఊరి నుంచి బయటికి వచ్చింది. కొన్నాళ్లు బతికింది. ఎవరూ ఉపాధి కల్పించకపోతే భర్త ఊరికి వెళ్లింది.

అక్కడ పట్టించుకునే నాథుడే లేకపోవడంతో కొడుకుతో పాటు నాలుగు నెలలు మేకల షెడ్‌లో నివాసమున్నది. చివరకు రోడ్డు ప్రాజెక్ట్‌లో కూలీగా పనిలో చేరింది. వాటితో వచ్చిన డబ్బుతో కొడుకుకు వైద్యం చేయించింది. ఎంత ఖర్చు పెట్టినా కొడుకు దక్కలేదు. కొడుకు మరణంతో మరింత కుంగిపోయింది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నది. గ్లాసు నిండా రసాయన ఎరువులు తాగి ఆత్మహత్యాహత్యం చేసుకున్నది. చుట్టుపక్కల వాళ్లకు తెలిసి ఆసుపత్రిలో చేర్పించారు. సరైన సమయానికి వైద్యం అందడంతో బతికింది. ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులు ఆలోచించి, ఒక నిర్ణయం తీసుకున్నది. అదే నిర్ణయం తన జీవితంలో వెలుగులు నింపింది. సీఆర్‌హెచ్‌పీ అనే స్వచ్ఛంద సంస్థలో సోషల్ వర్కర్‌గా చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి వైద్యానికి దూరంగా ఉంటున్న ప్రజలకు వైద్యం అందించే బాధ్యతలను భుజాల మీద వేసుకున్నది. హెచ్‌ఐవీ, సాధారణ వ్యాధుల మీద ప్రజలకు అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నది. తన జీవితంలో ఎదురైన ఒక విషాధ ఘటనను ఉదాహరణగా చెప్తూ ఎంతోమంది హెచ్‌ఐవీ బాధితులకు ధైర్యం నింపుతున్నది. వారి వైద్యానికి అవసరమైన అవకాశాలను కల్పిస్తున్నది. స్విట్జర్‌ల్యాండ్‌కు వెళ్లి మన దేశం తరపున ప్రాతినిధ్యం వహించి వక్తగా పాల్గొన్నది.