విజయాల దేవరకొండ

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ పేరు హాట్ టాపిక్.. నిర్మాతలకు హాట్‌కేక్.. యూత్‌కు ఐకాన్..పెళ్లిచూపులు చిత్రంతో టాలీవుడ్‌లోకి రివ్వున దూసుకొచ్చిన ఈ యువకెరటం.. ముచ్చటగా మూడో సినిమా గీతగోవిందంతో వారసత్వపు హీరోలకే సాధ్యమని అనుకునే 100 కోట్ల వసూళ్ల క్లబ్‌లో స్థానం సంపాందించాడు. తన క్రేజ్‌తో.. సినీ వర్గాలను, ట్రేడ్ పండితులను విస్మయపరుస్తూ.. టాలీవుడ్ టాప్‌టెన్ హీరోల జాబితాలో చేరాడు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వయం కృషితో తనకంటూ ఓ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ విజయాల దేవరకొండ కెరీర్ తాజాగా టాక్సీవాలా ఘనవిజయంతో టాప్‌గేర్‌లో స్పీడుగా దూసుకెళుతున్నది. ఈ సందర్భంగా ఈ యువ కథానాయకుడితో నమస్తే తెలంగాణ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది!

- ఎవడే సుబ్రహ్మణ్యం నుండి టాక్సీవాలా వరకు మీ సినీ ప్రయాణంలో వచ్చిన మార్పులేమిటి?

- జీవితంలో మార్పులనేవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. అది సహజం. ఎవడే సుబ్రహ్మణ్యంతో పోలిస్తే ప్రస్తుతం నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఒక్కసారిగా అనేక మార్పులు వచ్చాయి. ఫస్ట్‌క్లాస్‌లో ఉన్నప్పటితో పోలిస్తే ఐదో తరగతికి చాలా మారిపోయాయి. ఆ తర్వాత టెన్త్, డిగ్రీ ఇలా తరగతి పెరుగుతున్న కొద్దీ నా జీవితం మారింది. నా లైఫ్ కాబట్టి ఆ మార్పులు ఎలాంటివో తెలియడం లేదు. నా సన్నిహితులు, నాతో ప్రయాణం చేసిన, గమనించిన వారికే అది తెలుస్తుందని అనుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నిరంతరం నేర్చుకుంటూనే ఉన్నాను. సాటి మనుషులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకుంటున్నాను. నా నటనలో ఏ విధమైన మార్పులు చేసుకోవాలి. కథల ఎంపికలో అభిరుచులు, ధరించే దుస్తులు అన్నీ మారిపోయాయి.

- మీరు అనుహ్యంగా స్టార్‌గా మారిపోయారని ప్రతి ఒక్కరూ అంటున్నారు. ఓవర్‌నైట్‌స్టార్ అయ్యారనే మాటతో ఏకీభవిస్తారా? అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి?

- నా సినీ కష్టాలన్నీ తెరవెనుక పడినవే. నేనంటే ఎవరికి తెలియని సమయంలో అవన్నీ ఎదుర్కొన్నాను. హీరోగా ఇప్పటివరకు ఐదు సినిమాలు మాత్రమే చేశాను. ఆ సినిమాల ద్వారా నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు, అభిమానులు చూపిస్తున్న ప్రేమ, ఇండస్ట్రీ ఆదరణ వల్ల అలా అనిపిస్తుంది. ఐదు సినిమాలకు ముందు నాలుగేండ్లు నేను పడిన కష్టం మాత్రం ఎవరికీ తెలియదు.

- ప్రస్తుతం ఉన్న స్టార్‌డమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందా? ఈ పొజిషన్‌ను నిలబెట్టుకోవాలనే తపన, భయం ఉన్నాయా?

- ఆ భయం లేదు. అలాగని ఆ స్థాయిని నిలబెట్టుకోవాలనే ఆలోచన లేదు. ఇంకా భిన్నమైన ప్రయత్నాలు చేయాలనుంది. కెరీర్ బాగుంది ఈ సమయంలో తమిళ్ సినిమా చేయడం అవసరమా అని ఆలోచించలేదు. ఎందుకు చేయకూడదని ప్రయత్నించాను. అది వర్కవుట్ అయితే జీవితానికి ఓ విధంగా కలిసి వస్తుంది. వర్కవుట్ కాకపోతే మరోవిధంగా ఉపయోగపడింది. అలాగని ప్రయత్నం మానకూడదు. క్లాతింగ్‌లైన్ వర్కవుట్ కాదని అనుభవజ్ఞులు చెప్పారు. ఇప్పటివరకు ఏ నటుడు ఆ ప్రయత్నాలు చేయలేదు. యుక్తవయస్సులో అనవసరంగా ఇవన్నీ పెట్టుకోవద్దని సలహా ఇచ్చారు. నాకు ఆ క్యాలికులేషన్స్ అర్థం కాలేదు. చేసి చూద్దామని మొదలుపెట్టాను. అది మంచి సక్సెస్ అయింది. ఏది ఎలా కలిసివస్తుందో, పరాజయం పాలవుతుందో అనుభవపూర్వకంగా వాటి ద్వారా తెలుసుకోవచ్చు. నా ప్రయత్నాలు మాత్రం మానను. సక్సెస్‌ను మనతో పాటు తీసుకెళ్లలేం. అమితాబ్‌బచ్చన్ సైతం ఏదో ఒకరోజు రిటైర్ అవ్వక తప్పదు. స్టార్‌డమ్ ద్వారా డబ్బు వస్తే వృద్ధాప్యంలో సుఖంగా బతకవచ్చు. సక్సెస్ అనేది తాత్కాలికమే. జీవితాన్ని ఆసక్తికరంగా, మధురమైన జ్ఞాపకాలమయంగా మలుచుకోవడానికే ఇష్టపడతాను.

- మీ సక్సెస్‌లను అమ్మానాన్నలు ఎలా ఆస్వాదిస్తున్నారు?

- అమ్మనాన్నలను చూస్తున్నప్పుడు అమితానందంగా ఫీలవుతుంటాను. నాన్న ఇప్పుడు రిలాక్స్‌గా ఇంట్లో గడుపుతున్నారు. అమ్మ తనకు ఏం కావాలో? ఎలా ఉండాలనుకుంటుందో అలా స్వేచ్ఛగా ఉంటుంది. వారి ఆనందాన్ని చూస్తున్నప్పుడు జీవితానికి సార్థకత లభించిందని అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నేను ఆనందంగా ఉండాలని అనుకుంటాను. కానీ కుదరడం లేదు. ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి అని నాకు నేను చెప్పుకుంటాను. కానీ అలా ఉంటానా లేదా తెలియదు.

- అమ్మానాన్నల సలహాలు సూచనలు స్వీకరిస్తుంటారా?

- వృత్తిపరమైన విషయాల్లో నాన్న సలహాలు తీసుకుంటాను. మనశ్శాంతి కోసం అమ్మను ఆశ్రయిస్తాను. ప్రేమ, కంఫర్ట్ తన దగ్గరే దొరుకుతాయి.

- నోటా విడుదలైన సమయంలో అమ్మకు ఆరోగ్యం సరిగా లేదని.. సినిమాల్ని వదిలివేద్దామనుకున్నానని అన్నారు ఎందుకు అలా?

- జీవితం మీద ఉన్న కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకు ఆ విధంగా జరగాలి అనిపించింది. నేను తీసుకున్నది చాలా తప్పుడు నిర్ణయం. దాని వల్ల నాతో పాటు ఇతరులకు ఉపయోగం ఉండదు. కోపంతో అలా చేయాల్సి వచ్చింది.

- అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యమివ్వడం, ఎమోషనల్ అటాచ్‌మెంట్ వల్లే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని అనుకోవచ్చా?

- అలాంటి సంఘటనలపై ఎలా ప్రతిస్పందించాలో నాకు తెలియదు. జీవితంలో నేను కొంచెం ప్రాక్టికల్‌గానే ఉంటా. కానీ, అమ్మకు ఆరోగ్యం సరిగా లేకపోయేసరికి ప్రాక్టికాలిటీ, లాజిక్‌లు అన్ని మర్చిపోయాను. అమ్మతోనే నాకు అనుబంధం ఎక్కువ.

- సినిమాలు కాకుండా మీకు ఎక్కువ రిలీఫ్‌ను ఇచ్చేవి ఏవీ?

- స్నేహితులే నా బలం. చిన్ననాటి, కాలేజీ మిత్రులందరూ అంటే నాకు ఇష్టం. నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వాళ్లతోనే పంచుకుంటాను. నాకు పెళ్లి చేసుకోవాలని లేదు. వాళ్లు కూడా బ్రహ్మచారులుగానే ఉండాలని అనుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటే స్నేహితుల మధ్య దూరం పెరుగుతుందని మా నమ్మకం. స్నేహితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటానంటే కూర్చొని క్లాస్ ఇస్తాను. పెళ్లి వయసు దాటిపోతుంది, ఇంకా ఎంత కాలం క్లాస్‌లు తీసుకుంటావు, నీలా ఉండడం మాకు వర్కవుట్ కాదు. పెళ్లి చేసుకుంటాం అని చెబుతున్నారు. ఎవరికీ పెళ్లి కాలేదు కాబట్టి రాత్రింబవళ్లు అంతా కలిసి సరదాగా కాలక్షేపం చేస్తున్నాం. నచ్చిన ప్రదేశానికి వెళుతున్నాం. పెళ్లయితే అవన్నీ కుదరదు. బాధ్యతలు పెరుగుతాయి. క్రీడలంటే నాకు ఇష్టం. క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ బాగా ఆడతాను. అడ్వెంచర్ స్పోర్ట్స్ పట్ల ఆసక్తి ఉంది.

- పెళ్లి చేసుకోమని ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తున్నారా?

- చెప్పిన మాట నేను విననని అమ్మానాన్నలకు తెలుసు. అప్పుడప్పుడు అమ్మ నా పెళ్లి మాట ఎత్తుతుంది. ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఏడాది గడువు పెంచేస్తాను. అప్పటి వరకు 33 యేండ్లలో పెళ్లి చేసుకుంటానని చెబితే.. పెళ్లి మాట తీసుకురాగానే మళ్లీ 34 యేండ్లకు చేసుకుంటా అని చెబుతా. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ గడువు పెంచుతున్నాను. ఏదో ఒక రోజు చేసుకుంటానని అడగడం మానేశారు.

- పుస్తకాలు చదివే అలవాటు ఉందా?

- ఒకప్పుడు పుస్తకాలు బాగా చదివేవాణ్ణి. స్కూల్‌డేస్‌లో హాస్టల్లో పుస్తకాలే మాకు పెద్ద వినోద సాధనం. టీవీ, సినిమాలు ఉండేవీ కాదు. ఇంటర్‌లో కూడా లాస్ట్‌బెంచ్‌లో కూర్చొని నవలలు బాగా చదివేవాణ్ణి. ప్రస్తుతం చదివే తీరిక ఉండడం లేదు. ఏడాది నుంచి ఒక పుస్తకం పట్టుకొని తిరుగుతున్నాను. అప్పుడప్పుడు ఒక్కో పేజీ తిప్పుతున్నాను.

- కంగ్రాట్స్.. విడుదలకు ముందే పైరసీ అయినా టాక్సీవాలా విజయం సాధించడం ఎలా ఉంది?

- చాలా సంతోషంగా ఉంది.. మా యూనిట్ కష్టానికి తగిన ప్రతిఫలం లభించింది. ఈ చిత్ర విజయం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు ఉన్నారు. ముఖ్యంగా ఈ చిత్ర దర్శకుడు, కెమెరామెన్, సంగీత దర్శకుడు, రైటర్. ఇలా వ్యక్తిగతంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా చిత్రం కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ విజయం నాలో మరింత నమ్మకాన్ని పెంచింది. పైరసీకి గురైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో? థియేటర్‌కు వస్తారా? రారా?.. అని, ఓ కొత్త పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో? లేదో అనే టెన్షన్ ఉండేది. విడుదల రోజు మార్నింగ్ షో టాక్ వినగానే రిలాక్స్ అయ్యాం.

- దేవుడిపై నమ్మకం ఉందా?

- అమ్మ ఎప్పుడైనా గుడికి వెళ్దామని అంటే వెళ్తా. ఒంటరిగా మాత్రం వెళ్లను. ప్రత్యేకంగా దేవుడిపై నమ్మకం లేదు. అలాగని నాస్తికుడిని కాదు. దేవుడు ఉన్నాడా లేడా అన్నది తెలియదు. మడూరి మధు