రైతును లక్షాధికారి చెయ్యడమే లక్ష్యం!

తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువులు, ప్రకృతి వైపరీత్యాలతో వ్యవసాయం ఒట్టిపోయి ఆ ప్రాంతంలోని రైతులు ఆత్మహత్యల బాటపట్టారు. వలసలకు వెళ్లలేక, వ్యవసాయం చెయ్యలేక నిత్యం నలిగిపోయారు. వారి పరిస్థితి చూసి చలించిన టాటా ట్రస్ట్.. రైతులను లక్షాధికారులను చెయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఆ దిశగా రైతులకు సాయమందిస్తూ.. సఫలీకృతమవుతున్నది.
రైతులు సంతోషంగా ఉంటేనే దేశం బాగుంటుందని అంతా అంటారు. కానీ రైతులు ఎందుకు ప్రాణాలు తీసుకుంటున్నారో తెలిసి కూడా ఎవరూ పట్టించుకోరు. వీరి బాధను అర్థం చేసుకొని టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది. గుజరాత్‌లోని సబర్‌కంఠ జిల్లాలోని ఖేద్‌బ్రహ్మ బ్లాక్‌లో టాటా ట్రస్ట్ ద్వారా 23 గ్రామాలు పూర్తిగా అభివృద్ధి చెందాయి. రైతులు యేటేటా తమ ఆదాయాన్ని పెంచుకుంటూ లక్ష్యానికి చేరువలోకి వచ్చారు. గతంలో సరైన నీటి సదుపాయాలు లేక, ఆధునిక వ్యవసాయం చేతకాక, సాయమందించే వాళ్లు లేక, కరువులతో అల్లాడుతూ కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దుస్థితి నుంచి రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో టాటా ట్రస్ట్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. కష్టపడి పనిచేసే వాళ్లందరికీ చేతనైన సాయం చేసింది. వ్యవసాయానికి బోర్లు వేయించడం, తాగునీటికి బోర్లు తవ్వించడం, ఇళ్లు లేనివారికి ఇళ్లు కట్టించడం, విద్యుత్ సదుపాయం లేనిచోట సోలార్ వ్యవస్థను ఏర్పాటు చెయ్యడం వంటి పనులు చేపట్టింది. ఆయా గ్రామాల్లోని రైతులతో నిత్యం సమావేశమై కాలానికి తగినట్లుగా పంటలు వేయించడం, వ్యవసాయ పనిముట్లు ఇప్పించడం వంటి పనులు చేపట్టి రైతులకు ధైర్యాన్ని ఇచ్చింది. అంతేకాకుండా పాడి పశువులు, గొర్రెలు ఇప్పించి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూతనిచ్చింది. గిరిజన మహిళలల్లో చైతన్యం తెచ్చేందుకు రాత్రిపూట చదువు కూడా చెప్పింది. వారికి బ్యాంకు లావాదేవీలు, ఫోన్ వాడకం గురించి అవగాహన కల్పించి, వారి నూతన జీవితానికి నాంది పలికింది. టాటా ట్రస్ట్ ఇచ్చిన ఆర్థిక భరోసాతో రైతులు గోధుమ, బజ్రా, పత్తి, కూరగాయలు పండిస్తూ.. యేటేటా తమ ఆదాయాన్ని పెంచుకుంటూ లక్ష్యానికి దగ్గరయ్యారు. ఒక్క గుజరాత్ లోనే కాకుండా.. రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖ్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలలో రైతులు, గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నది టాటా ట్రస్ట్. 2007 నుంచి ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న టాటా ట్రస్ట్.. 2020 నాటికల్లా అన్ని గ్రామాల రైతులను లక్‌పతి కిసాన్‌గా మారాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నది.