విభిన్న రంగాలు విశేష బాలలు

బాలల దినోత్సవ ప్రత్యేకం
తపనకు వయసుతో పని ఉండదు. దానికి కృషి, కసి తోడైతే అద్భుతాలు జరుగుతాయి. అలాంటి అద్భుతాలు చేసిన వాళ్లను ప్రపంచం గుర్తిస్తుంది. గౌరవిస్తుంది. ఈ చిన్నారులు కూడా అలాంటి అద్భుతాలే చేస్తున్నారు. అందుకే విభిన్న రంగాల్లో రాణిస్తున్న విశేష బాలబాలికలను ఈ బాలల దినోత్సవం సందర్భంగా.. జిందగీ పరిచయం చేస్తున్నది.. భవిష్యత్తులో వారు మరిన్ని విజయాలు సాధించాలను కోరుకుంటూ..

ఇంజినీరింగ్ విద్యార్థుల గురువు!

హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన 11 యేండ్ల మహ్మద్ హసన్ అలీ వండర్ కిడ్‌గా ప్రశంసలందు కుంటున్నాడు. ఎందుకంటే.. తాను చదివేది 7వ తరగతే అయినా.. బీటెక్, ఎంటెక్ చదువుతున్న వాళ్లకు క్లాసులు చెప్తున్నాడు. ఇంజినీర్ అవ్వాలన్న ఆకాంక్షతో.. ఆ సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసేవాడు అలీ. అలా ఓ రోజు కనిపించిన వీడియో చలింపచేసింది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన యువతరం వృత్తిలో రాణించకుండా.. విదేశాల్లో ఇతర పనులు చేసుకుంటూ పడుతున్న అవస్థల గురించిన వీడియో అది. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం చెప్పాలనుకున్నాడు. అందుకు సంబంధించిన సబ్జెక్టులను క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ప్రత్యేకంగా నోట్స్ రాసుకొనేవాడు. తన తెలివితేటలకు తగ్గట్లుగానే సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టులు పూర్తిగా చదివేశాడు. డిజైనింగ్‌లో ఉన్న ప్రాథమిక, సాంకేతిక భాషా పరిజ్ఞాన లోపాలతోనే మన ఇంజినీర్లు రాణించలేక పోతున్నారని గుర్తించాడు. ప్రత్యేకంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాడు. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన వారిలో ఉన్న లోపాలు.. వాటిని తొలిగించేందుకు అభ్యసించాల్సిన విషయాలపై అవగాహన పెంచుకున్నాడు. అంతే.. తనకు తెలిసిన విషయాలను బీటెక్, ఎంటెక్ విద్యార్థులతో పంచుకోవా లనుకున్నాడు. తండ్రితో కలిసి మలక్‌పేట తిరుమల టవర్స్‌లోని ఓ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లాడు. డిజైనింగ్, డ్రాఫ్టింగ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థులు చేస్తున్న లోపాలు, పాటించాల్సిన మెళకువలు ఆ అబ్బాయి చకచకా వివరిస్తుంటే నోరెళ్లబెట్టారు అక్కడివారు. ఇంటిగ్రల్ ఫౌండేషన్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న అలీ ఏడాదిగా అక్కడ పాఠాలు చెబుతున్నాడు. వయసులో చిన్నవాడైనప్పటికీ.. విద్యార్థులంతా హసన్ చెప్పే పాఠాలు ఆసక్తిగా వింటున్నారు. స్కూల్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి.. హోంవర్క్ పూర్తిచేసుకొని.. కాసేపు ఆడుకుంటాడు. సాయంత్రం 6 నుంచి 8 వరకూ ఇనిస్టిట్యూట్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాడు. ప్రస్తుతం 30 మందికి పాఠాలు చెబుతూ, 2020కి వెయ్యిమందికి పాఠాలు చెప్తానంటున్నాడు అలీ.

నాలుగేండ్ల రచయిత!

ఈ బుడతడు భారతదేశంలో అతి పిన్న వయస్కుడైన రచయితగా రికార్డులోకెక్కాడు. అసోం నార్త్ లఖీంపూర్‌కు చెందిన నాలుగేళ్ల అయాన్ గొగోయ్ గొహైన్ సెలెబ్రెటీగా మారిపోయాడు. ఎందుకంటే.. తనకు తోచిన పద్యాలతో ఒక పుస్తకం రాసి, వాటికి బొమ్మలు కూడా తనే వేశాడు. 80 పేజీలున్న ఈ పుస్తకం పేరు హానీకూంబ్. ఈ ఏడాది జనవరిలో పుస్తకం పబ్లిష్ అయింది. నాలుగేండ్ల అయాన్ ఏదైనా దృశ్యాన్ని చూసినపుడు తనలో కలిగే స్పందనలను మాటల్లో పలికేవాడు. అయాన్ వాళ్ల అమ్మ సంగీత గొగోయ్ తన ఫోన్‌లో ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసింది. ఆ యాప్‌లో ఆ మాటలన్నీ రికార్డు అయ్యేవి. ఆ ఆడియో క్లిప్‌లను ముద్రణా సంస్థకు ఇస్తే వాళ్లు పుస్తకం రూపంలో ప్రచురించారు. హానీకూంబ్‌ని ప్రముఖ కవి దిలీప్ మహాపాత్రాతో పాటు పలువురు సాహితీవేత్తలు సమీక్షించారు. అమెరికా నార్త్ కరోలినాలోని ప్రముఖ రచయిత జాన్ లియొట్టా ఈ పుస్తకం చదివి చాలా ప్రశంసించారు. ఇలా ఈ బుడతడు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. హనీకూంబ్ పుస్తకం ఖరీదు 250 రూపాయలు.

పిల్లల పొదుపు మంత్రం!

ఉన్నప్పుడు దాచుకో.. అవసరానికి వాడుకో! ఇదే ఈ పిల్లలకి పొదుపు మంత్రం. ఈ విద్యార్థులది వరంగల్ అర్బన్ జిల్లా, హసన్‌పర్తి మండలం, మడిపల్లి గ్రామం. ఇక్కడ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న ఈ విద్యార్థులంతా చిన్నప్పటి నుంచే డబ్బులు పొదుపు చేసుకుంటున్నారు. వీరికి పొదుపు పాఠాలు నేర్పింది ఇక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సట్ల రంగయ్య. చిరుతిండి తినడం వల్ల కలిగే అనర్థాలు, పొదుపు చెయ్యడం వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించి.. ఆర్థిక అవగాహన కల్పిస్తున్నాడు. మాచర్ల నాగజ్యోతి అనే విద్యార్థిని లీడర్‌గా ఎన్నుకొని, టీచర్-స్టూడెంట్ పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశారు. తల్లిదండ్రులు ఇచ్చే రెండు రూపాయలు మొదలు వంద రూపాయల వరకూ ఆయా విద్యార్థులు తమ అకౌంట్‌లో జమ చేసుకుంటున్నారు. ఇలా 90 మంది వరకు విద్యార్థులు డబ్బులు దాచుకుంటున్నారు. అందరికీ పొదుపు పుస్తకాలు అందజేసి, అందులో దాచుకున్న, తీసుకున్న వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం అందరి డబ్బులు కలిపి రూ. 24 వేలు అకౌంట్‌లో ఉన్నాయి. ఇలా డబ్బులు దాచుకోవడం ద్వారా భరత్ అనే విద్యార్థి సైకిల్ కొనుక్కున్నాడు. అనిల్ కుమార్ తన తండ్రికి రూ.3 వేలతో వైద్యం చేయించాడు. భలే కదా... మీరూ ఇలాంటి ప్రయత్నం చేయండి.

పంచ్‌ల వర్షం

హైదరాబాద్‌కి చెందిన అమృతరెడ్డి అభ్యుదయ హై స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నది. ఆమెకు ఇంటినిండా పతకాలు ఉన్నాయి. ఒంటినిండా ఆత్మవిశ్వాసం ఉన్నది. అవును జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీలు ఏవైనా సరే పాల్గొనాల్సిందే. పతకం సాధించాల్సిందే చిన్న వయసులో పంచ్‌ల వర్షం కురిపిస్తున్నది. సాహస క్రీడ కరాటేలో రాణించి ఇప్పటికే ఎన్నో బహుమతులు సాధించి ఎంతో మందితో ప్రశంసలు అందుకున్నది. 64వ హైదరాబాద్ జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో కరాటే ఆటలో రెండో స్థానంలో నిలిచింది. నేరరహిత సమాజం కోసం మహబూబ్‌నగర్‌లో జరిగిన భారత జైళ్ల శాఖ పరుగుల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. కురుక్షేత్రలో జరిగిన 28వ జాతీయ కరాటే పోటీల్లో మూడో స్థానం సంపాదించింది. మొదటి తెలంగాణ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ చాంపియన్‌షిప్‌లో గెలిచి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నది.

15 యేండ్లకే డిగ్రీ పట్టా!

అమెరికాలో భారత సంతతికి చెందిన బాలుడు 15 యేండ్లకే బయోమెడికల్ పట్టా సాధించాడు. ఇప్పుడు పీహెచ్‌డీ కూడా పూర్తి చేయాలనుకుంటున్నాడు. ప్రజలను పట్టి పీడిస్తున్న క్యాన్సర్‌కు మెరుగైన చికిత్సలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేరళ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన బిజౌ అబ్రహం, తాజి దంపతుల కుమారుడు తనిష్క్ అబ్రహం. ఇతనికి అసమాన ప్రతిభ ఉన్నది. తండ్రి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, తల్లి డాక్టర్. తనిష్క్ చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉండేవాడు. ఆరేండ్ల వయసులోనే జీవశాస్త్రం, కెమిస్ట్రీ, జియోలజీ, పాలెంటోలజీ తరగతులు ఆన్‌లైన్ ద్వారా నేర్చుకున్నాడు. 7 యేండ్లకు అమెరికన్ రివర్ కాలేజీలో ఖగోళశాస్త్రం, భూగోళశాస్త్రం కోర్సులు పూర్తి చేశాడు. అన్నింటిలోనూ అతనికి మొదటి ర్యాంకు వచ్చింది. 2016లో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బయోమెడికల్ ఇంజినీరింగ్ చేరి.. 2018లో డిస్టింక్షన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. కేవలం 15 యేండ్ల వయసులోనే బయోమెడికల్ ఇంజినీరింగ్ పట్టా పొంది.. చాలామందికి గ్రాడ్యుయేట్స్‌కి తరగతులు చెప్పాడు. ఇప్పుడు అదే కాలేజీలోనే పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాడు. క్యాన్సర్ వ్యాధి నివారణలో కొత్త ఆవిష్కరణలు తేవడమే తన లక్ష్యమని అంటున్నాడు. కాలిన గాయాలతో బాధపడుతున్న వారిని తాకకుండానే.. వారి స్పందనల వేగాన్ని తెలుసుకునే పరికరాన్ని ఈ మేధావి ఇప్పటికే రూపొందించడం విశేషం.

ఊరి మీద చిన్నారి ప్రాజెక్ట్!

నేటి బాలలే రేపటి పౌరులని ఊరికే అనలేదు పెద్దలు. 2014 నుంచి 2018 నాటికి గ్రామంలో జరిగిన అభివృద్ధిని 4వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్లో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రాజెక్ట్‌లో కళ్లకు కట్టినట్లు వివరించింది. ఆ చిన్నారి పేరు గాయత్రి నాయక్. సోలిపూర్ గాయత్రి గౌతమి విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతున్నది. స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్‌లో భాగంగా 2014 కంటే ముందు మా ఊరు, 2014 తర్వాత మా ఊరు అనే ప్రాజెక్ట్‌ను తయారు చేసింది. సోలిపూర్‌లో ఉండే పెద్ద చెరువు 30 యేండ్ల నుంచి ఎండిపోయి ఉన్నది. ఇప్పుడు స్వరాష్ట్రం ఏర్పడింది. చెరువు నిండింది. దీంతో ఆ ఊరి ముఖచిత్రమే మారిపోయింది. చెరువు కింద వెయ్యి ఎకరాల్లో పంటలు పండిస్తున్నారు. సోలిపూర్ గ్రామాన్ని పూర్తిగా మార్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, వనపర్తి టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది గాయత్రి.

తమ్ముడిని కాపాడాడు!

ఆ అబ్బాయి వయసు పదేండ్లు. కానీ పెద్దవాళ్లలా తెగువ, ధైర్యం చూపించాడు. తన తమ్ముడు కిడ్నాప్ కాకుండా కాపాడుకున్నాడు. 9 నవంబర్ 2018 మధ్యాహ్నం 1.30 ముంబ్రా ప్రాంతం. దగ్గరలో పెండ్లి జరుగుతున్నది. దాంతో కాలనీలో పెద్దగా సందడి లేదు. పదేండ్ల పిల్లలు, రెండేండ్ల వయసున్న బాబు బయట ఆడుకుంటున్నారు. ఇంతలో బుర్ఖా వేసుకున్న ఆవిడ వచ్చి రెండేండ్ల పిల్లాడిని పలుకరించి ముద్దు చేస్తున్నది. అది ముందుగా మిగిలిన ఇద్దరు పిల్లలు గమనించలేదు. ఈలోపు ఆ బుర్ఖా వేసుకున్న ఆవిడ చిన్న పిల్లాడిని ఎత్తుకొని ముందుకు వెళుతున్నది. అది చూసిన ఆ పిల్లాడి అన్న పరుగున ఆమె దగ్గరకు చేరుకున్నాడు. ఎందుకు తీసుకెళుతున్నావు? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాడు. దానికి ఆమె చాక్లెట్ కొనిచ్చి మళ్లీ తీసుకొస్తాను అంటూ సమాధానమిచ్చింది. ఎందుకో అనుమానం వచ్చి ఆమె వెంట నడుస్తూ ప్రశ్నలు అడుగుతున్నాడు. పక్కనే ఉన్న అన్నతో ఇంట్లో వాళ్లను పిలుచుకురమ్మని చెవిలో చెప్పి పంపించాడు. ఈలోపు ఆమె వేగం పెంచడంతో ఆమె వెనుక ఆ పదేండ్ల పిల్లాడు పరుగు అందుకున్నాడు. ఈలోపు చుట్టుపక్కల వాళ్లను పిలువడంతో ఆ రెండేండ్ల పిల్లాడిని అక్కడ వదిలేసి ఆ బుర్ఖా ఆవిడ వెళ్లిపోయింది. ఎనిమిది నిమిషాల పాటు ఈ సంఘటన జరిగింది. అక్కడ దగ్గరలోని సీసీ టీవీ ఫుటేజ్‌లో ఇదంతా రికార్డు కావడంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఏదో జరిగిపోతుందని గమనించి అలాగే ఉండిపోకుండా.. తనకంటే పెద్దవాడినే అలర్ట్ చేసిన విధానాన్ని అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.

చెరువును సంరక్షించేందుకు..

బెంగళూరుకు చెందిన గౌతమ్ దయాళ్ పదోతరగతి చదువుతున్నాడు. తమ ఊరిలో ఉన్న పెద్ద చెరువును బాగు చేసేందుకు జనాల్లో అవగాహన కల్పించాడు. చెరువును సంరక్షించే ప్రయత్నం చేస్తున్నాడు. సామాజిక మాధ్యమాల్లో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టి చెరువు సమస్యను పరిష్కారం కోసం వినూత్న ప్రయోగాన్ని అమలు చేశాడు. ఒకప్పుడు దక్షిణ బెంగళూరుకు సాగు నీరు, తాగు నీరు అందించిన బెళ్లందూర్ చెరువు పూర్తిగా కాలుష్యమయమయింది. దీంతో ఆయా పరిసర ప్రాంతాలల్లో నివసించే ప్రజలకు నష్టం వాటిల్లింది. బెళ్లందూర్ చెరువు కర్ణాటక రాష్ట్రంలోనే అతి పెద్దది. దీనికోసం దయాళ్ ప్రజలను, మేధావులను, ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖల మద్దతు కూడగట్టాడు. చెరువును సంరక్షించేందుకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించి పదిలక్షల మంది ప్రజలకు ఈ సమస్య గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. తనతోపాటు మరో 9మందిని బృందంగా చేసుకొని చెరువు రక్షణ కోసం శ్రమిస్తున్నాడు. అందులో భాగంగానే ప్రొఫెసర్లను, ఇంజినీర్లను, సామాజికవేత్తలను కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నాడు. సేవ్ బళ్లందూర్ లేక్ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించి జనాల అభిప్రాయాలను, సూచనలను, వాయిస్‌ను, ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేయిస్తున్నాడు.