సమస్యకు శాశ్వత పరిష్కారం

వర్షకాలం రోడ్డుపై వెళ్తుంటే.. భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ అయింది. ఆ వర్షపు నీరు వరదలా వృథాగా పోతుండడంతో ఆలోచనలో పడింది తవిషి అనే యువతి. ఆ నీరు ఎప్పటికీ వృథా కాకుండా ఓ చక్కటి శాశ్వత పరిష్కారాన్ని కనుగొన్నది.

గుర్గావ్‌కు చెందిన తవిషి సరికొత్త ఆలోచన చేసింది. దివ్యాంగులైన ఇళ్లులేని 500 మందికి రోజూ 10 వేల లీటర్ల నీటిని అందిస్తున్నది. ట్రాఫిక్‌జామ్‌లో వచ్చిన ఆలోచన ప్రకారం.. వృథాగా పోతున్న వర్షపు నీటిని నిల్వ ఉంచి వారి రోజువారీ అవసరాలకు అందించాలనేది ఆమె ఆలోచన. ఈ విషయాన్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో పంచుకున్నది. ఆలోచన నలుగురికి ఉపయోగపడేలా ఉండడంతో వారూ సహాయం అందించారు. ఎర్త్ సేవియర్ ఫౌండేషన్ అనే ఎన్జీఓతో ఒప్పందం చేసుకొని నీటి నిల్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే వాళ్లు భూమి లోపల 20 అడుగుల లోతులో రెండు గుంతలు తియ్యాలని, వర్షపు నీటిని వాటిల్లోకి మళ్లించేందుకు కాల్వలు తియ్యాలని, అందుకు రూ.లక్షన్నర వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో తెలిసిన వారి ద్వారా ఆర్థిక సహాయాన్ని కోరింది. ఎంతమందిని కలిసినా అంత పెద్దమొత్తంలో డబ్బులు వసూలు కాకపోవడంతో.. తన సోదరి సలహా మేరకు కెట్టో అనే క్రౌడ్ ఫండింగ్ సంస్థను ఆశ్రయించింది. దాని ద్వారా కేవలం మూడు రోజుల్లో రూ.1,78,000 వసూలు కావడంతో పనులు ప్రారంభించింది. ఆమె ఆలోచన నచ్చడంతో పలువురు అధికారులు, ఇంజినీర్లు ప్లానింగ్ ఇచ్చారు. ఓ కాంట్రాక్టర్ దగ్గరుండి పనులు చేయించాడు. ఇలా కొద్దిరోజుల్లోనే తవిషి సంకల్పం కార్యరూపం దాల్చింది. ప్రస్తుతం ఆ నీటి గుంతల ద్వారా దాదాపు పదివేల లీటర్ల నీటిని నిల్వ చేసి, దివ్యాంగులైన ఆ ఇళ్లు లేనివారికి అందిస్తున్నది. ఇలా ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది తవిషి.