భన్సాలీ మెచ్చిన కామాటిపుర వేశ్య కథ!

మేరీ కోమ్.. బాజీరావ్ మస్తానీ.. పద్మావత్.. ఆయన సినిమాలు ఎక్కువగా నిజ జీవితంలో నుంచే వస్తాయి. ఆయన కథా నాయకా, నాయకులు ఎగ్జిస్టింగ్ క్యారెక్టర్లే. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిన్న పద్మావత్ కథ చూపించాడు. ఇప్పుడు ఒక కామాటిపుర వేశ్య కథ ఆయన్ను ఆకట్టుకున్నది. మాఫియా క్వీన్ ఆఫ్ ముంబైగా పేరు గాంచిన.. గంగూబాయి కథను సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు భన్సాలీ. ఇంతకీ ఎవరీ గంగూబాయ్.. కామాటిపుర వేశ్య వాటిక నుంచి ముంబై డాన్‌గా ఎలా ఎదిగింది?

స్థలం : ఆజాద్ మైదాన్, ముంబై, సందర్భం : శిశు సంక్షేమం.. మహిళా సాధికారత పై

అనేక రాజకీయ పార్టీల నుంచి మహిళా నాయకురాళ్లు, స్వచ్ఛంద సంస్థల అధినేతలు ఆ సభలో పాల్గొన్నారు. ఆ వేదిక మీద ఒక వేశ్య కూడా ప్రసంగించనుంది. ఆమె పేరు గంగూబాయి. అప్పటిదాకా ఆమె ప్రస్థానం కామాటిపురలోనే సాగింది. తొలిసారి అంతమంది జనం ముందు ఆమె మాట్లాడబోతున్నది. పోడియం దగ్గరు వెళ్లి నిలుచుంది. ఆమె ఏం మాట్లాడుతుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆమె మొదటి మాటకే అందరూ నిశ్చేష్టులయ్యారు. ఆమె ఏమన్నదంటే.. నేను గర్‌వాలీ అని. ఆమె పరిభాషలో గర్‌వాలీ అంటే వేశ్య గృహాన్ని నడిపేదన్ని అని అర్థం. నిజానికి అసలు అర్థం మాత్రం గృహిణి అని. ఆ మాటకు అక్కడ అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ నిశ్శబ్దాన్ని చేధిస్తూ.. తన మాటలు కొనసాగించింది. మిగతా రాష్ర్టాల కంటే మహిళలకు మన గల్లీలు చాలా సురక్షితం అని నేను భావిస్తున్నా. ఆడవాళ్ల మీద అఘాయిత్యాలు జరుగకపోవడానికి కారణం మా కామాటిపుర కూడా ఒక కారణం. ఇది నేను గర్వంగా చెబుతున్నా. మేం ఈ పని సంతోషంగా చేస్తున్నామని అందరూ భావిస్తారు. కానీ మాకు ఎంత నరకంగా ఉంటుందో మీరు ఊహించలేరు. చాలామంది ఈ కూపంలోకి నెట్టివేయబడ్డారు. మరికొందరు తమ కుటుంబం గడువడానికి ఈ వ్యాపారాన్ని చేస్తున్నారు. దేశాన్ని జవాన్ ఎలా అయితే రక్షిస్తున్నాడో.. కామాంధుల నుంచి ఎంతోమంది నాలాంటి వేశ్యలు మిమ్మల్ని రక్షిస్తున్నారు. దేశం వాళ్లని గౌరవిస్తుంది.. మమ్మల్ని చూస్తే చీదరించుకుంటుంది. దీనికి నాకు సమాధానం కావాలి. ఎవరైనా చెబుతారా? అని ఒక్క నిమిషం ఆగింది. మౌనం. ఎవరూ మాట్లాడలేదు. మీ దగ్గర సమాధానం లేదని నాకు తెలుసు. ఈ విషయాన్ని పక్కకు పెట్టి మా సమస్యల గురించి ఇక్కడ చర్చించడానికి వచ్చాను అని ప్రసంగాన్ని ముగించింది. ఆ తర్వాత రోజు దీని గురించి పేపర్లలో రాశారు. ఇక ఎక్కడ చూసినా ఆమె గురించిన చర్చే.

పెండ్లి నుంచి కామాటిపుర..

రమణిక్ నమ్మించి గంగను పెండ్లి చేసుకున్నాడు. రెండు రోజులు ఆ ఊరు, ఈ ఊరు తిరిగి ముంబై స్టేషన్‌కి చేరుకున్నారు. ముంబైని చూశాక అందరూ చెప్పినది తప్పని అనిపించింది గంగకి. కానీ సినిమా మీద ఉన్న ప్రేమ ముంబై ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయాలనిపించింది. నాలుగు రోజులు ఒక లాడ్జీలో ఉండి సంతోషంగా గడిపారు. ముంబై మొత్తం చుట్టేశారు. సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగారు. తెచ్చుకున్న డబ్బులు నీళ్లలా ఖర్చయిపోయాయి. అప్పుడు రమణిక్.. మన డబ్బులు అయిపోయాయి కదా! నేను ఏదైనా పని వెతుక్కుంటా. ఒక్కరోజులో తిరిగొస్తా. అప్పటిదాకా మా పిన్ని దగ్గర ఉండాలి అని చెప్పాడు. ఆ మాటలు నిజమని నమ్మి తల ఊపింది. ఒక కారులో శీల అనే ఆవిడ దిగింది. ఆమెనే పిన్నిగా పరిచయం చేశాడు రమణిక్. ఆమె అవతారం చూసి గంగకి ఎందుకో నమ్మబుద్ధి కాలేదు. రమణిక్ చెప్పడాని ఆమెతో పాటు పయనమైంది. గమ్యం చేరుకున్నారు. ఒక ఇరుకైన సందులో వారి కారు ప్రయాణం సాగుతున్నది. బట్టలు సరిగా వేసుకోకుండా.. వింతగా తయారైన ఆడవాళ్లు ఆ గల్లీల్లో కనిపిస్తున్నారు. గంగకి చిరాకుగా అనిపించినా.. ఒక్కరోజే కదా ఇక్కడ ఉండడం అని తనకి తాను సర్ది చెప్పుకున్నది. తీరా వెళ్లాక అసలు నిజం తెలిసింది. ఐదు వందలకు రమణిక్ తనని శీలకి అమ్మేశాడని తెలిసింది. గుండె పగిలింది. వొలవొలా ఏడ్చింది.

గంగ టు గంగూబాయి

గంగ ఆ కూపంలోకి వెళ్లాక కన్నీరుమున్నీరైంది. ఎన్నో దెబ్బలు తిన్నది. రెండు వారాలు అలా గడిచిపోయాయి. అక్కడి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. ఇంటికి వెళితే పరువే ప్రాణంగా బతికే కుటుంబం ఏమవుతుందో అని ఆలోచించింది. శీలని పిలిచి తాను ఆ వృత్తిలోకి దిగేందుకు ఒప్పుకున్నది. అలా దిగిన వారికి నాత్ ఉతరనా అనే పద్ధతి పాటించి మరీ ఈ వృత్తిలోకి దింపుతారు. ఆ రోజు అక్కడ ఉన్నవారు ఆమె పేరును అడిగారు. తడుముకోకుండా గంగు నా పేరు అని చెప్పింది. ఇక తన పాత జ్ఞాపకాలను అక్కడితో చెరిపేసింది. అప్పటి నుంచి కామాటిపురలో ఎక్కువ డబ్బులు తీసుకునే వేశ్యగా గంగు పేరు నిలిచింది. ఇలాంటి క్రమంలో వివిధ రాష్ర్టాలను కూడా చుట్టి వచ్చింది. అలా సంపాదించిన డబ్బుతో ఎక్కువ బంగారం కొనేందుకు ఉపయోగించేది. ఇలా గడుస్తున్న జీవితంలోకి పటాన్ అనే రౌడీషీటర్ ఎంటరయ్యాడు.

మాఫియాతో సంబంధం..

పటాన్ డబ్బులు చెల్లించకుండా గంగును అనుభవించాడు. పైగా ఆమెను చిత్రహింసలు పెట్టాడు. రెండోసారి కూడా అలాగే జరిగింది. గంగు తట్టుకోలేకపోయింది. వారం రోజుల పాటు ఆసుపత్రి పాలైంది. ఇలా వదిలేస్తే వాడి ఆగడాలు మరీ ఎక్కువ అవుతాయని భావించింది. అతని గ్యాంగ్ బాస్ అయిన కరీమ్‌లాలాను కలువాలనుకున్నది. అతని దగ్గరకు వెళ్లి నేను నీకు ఉంపుడుగత్తెగా ఉంటా. కానీ నీ దగ్గర పని చేసే పటాన్‌కి ఎలాగైనా శిక్ష పడాలి అన్నది. ఆ మాటలు విన్న అతను.. నాకు పెండ్లి అయింది. నేను కుటుంబానికి విలువనిస్తా. నీకు అన్యాయం జరిగిందంటున్నావు. అతడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు సమాచారం ఇవ్వు అని చెప్పాడు. ఆ మాటలు విన్న గంగూ తన పర్సులో నుంచి ఒక దారాన్ని తీసి.. నాకు మిమ్మల్ని చూస్తే కొండంత ధైర్యం వచ్చింది. మీరు నన్ను కాపాడతారని భావిస్తున్నా. అందుకే ఈ రాఖీ అని కట్టి వెళ్లింది. అలా మాఫియా గ్యాంగ్‌తో గంగూకి సత్సంబంధాలు ఏర్పడ్డాయి.

ప్రధానితో భేటి..

అప్పటి నుంచి గంగూని అంతా కొత్తగా చూడడం మొదలుపెట్టారు. శీల కూడా ఈ బిజినెస్‌ని వదిలి వెళ్లడంతో గంగూనే బిజినెస్‌ని చూసుకోసాగింది. కామాటిపురలో గర్‌వాలీ ఎలెక్షన్స్ జరిగాయి. దాంట్లో గంగూ గెలిచింది. ఇక అప్పటి నుంచి గంగూ కాస్త గంగూబాయి మేడమ్‌గా మారింది. తాను వచ్చాక కామటిపురలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది. బలవంతంగా నెట్టివేయబడిన అమ్మాయిలకు ఆ చెర నుంచి విముక్తి కలిగించింది. అది గమనించే ఆమెను సభలకు కూడా పిలిచేవాళ్లు. తనకున్న పొలిటికల్ అండతో ప్రధాని నెహ్రూని కలిసింది. ఆయన గంగూ ఆలోచన దృక్పథాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకీ కూపంలో ఉన్నావు. ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చుగా అని సలహా ఇచ్చాడు. నేను మిసెస్ నెహ్రూ అయితే నా వ్యాపారం మరింత బాగుండేది. మీరు ఒప్పుకుంటారా అని నెహ్రూనే అడిగిన ధైర్యశాలి గంగూ. ఆ మాటలు విన్న ఆయన ఇంకో మాట మాట్లాడలేక పోయారు. ఆ తర్వాత గంగూనే కామాటిపురలో ఇబ్బందుల గురించి.. అక్కడ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏం చేయాలో సలహాలు సూచనలు ఇచ్చింది. అవి అప్పటికప్పుడు జరగకపోయినా.. కొన్ని సంవత్సరాల తర్వాత ఆచరణలోకి వచ్చాయి. కానీ, అప్పటికి అవి చూడడానికి గంగూబాయ్ మాత్రం మిగల్లేదు. ఆమె ఆకాంక్షలు మాత్రం కామాటిపురలో నెరవేరి ఆమెను అక్కడ ఉన్నతంగా నిలబెట్టాయి. అందుకే ఇప్పటికీ అక్కడ చాలా ఇండ్లలో ఆమె ఫొటోను పెట్టుకొని పూజించేవాళ్లున్నారు.

ఎవరీ గంగూబాయి?

గంగా హర్జీవన్‌దాస్ కతైవాడీనే.. గంగుబాయిగా మారింది. గుజరాత్‌లోని కతైవాడ్‌లో జన్మించింది గంగ. తండ్రి లాయర్‌గా పనిచేసేవారు. ఇంట్లో అందరూ బాగా చదువుకున్నవాళ్లే. అక్కడ రాయల్ ఫ్యామిలీ వాళ్లది. 1940ల కాలంలో గంగని మంచి చదువులు చదివించాలని భావించారు ఆమె తల్లిదండ్రులు. కానీ గంగ మనసు మాత్రం సినిమాల చుట్టూ తిరిగేది. తన ఫ్రెండ్స్ ముంబై చూసి వచ్చి అక్కడి బిల్డింగ్స్, కారులు, సినిమాల గురించి వివరించడంతో ముంబైకి వెళ్లాలనే కోరిక రోజురోజుకు పెరిగింది. ఈ విషయం ఆ తల్లిదండ్రులు గమనించలేకపోయారు. ఆ సమయంలోనే తండ్రి దగ్గర అకౌంటెంట్‌గా చేయడానికి రమణిక్ అనే వ్యక్తి వచ్చాడు. అతడు కొన్ని సంవత్సరాలు ముంబైలో ఉండి వచ్చిన విషయం గంగ చెవిన పడింది. అతనితో పరిచయం పెంచుకుంటే ముంబై గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనుకుంది. అక్కడే ఆమె తప్పటడుగు వేసింది. ఇది ఆసరాగా తీసుకొని రమణిక్ ఆమెను ప్రేమలోకి దించాడు. ముంబై చూపిస్తానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఆశ చూపాడు. ఆ మాటలు నమ్మి ఇంట్లోని డబ్బు, నగలు తీసుకొని రమణిక్‌తో ముంబై వెళ్లిపోయింది.

పరిశోధనలో..

సంజయ్ లీలా భన్సాలీ ఏ సినిమా తీసినా ముందు కాంట్రవర్సీ అవుతుంది. ఆ తర్వాత బాక్సాఫీస్ దగ్గర సినిమా బంపర్ హిట్ అవుతుంది. తాజాగా పద్మావత్ విషయంలోనూ అదే జరిగింది. ఎన్నో గొడవల మధ్య ఆ సినిమా విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించింది. ఆ సినిమా అయ్యాక భన్సాలీ కాస్త విరామం తీసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమా కోసం నిజజీవిత కథను తీసుకోవాలనుకుంటున్నాడు. కామాటిపురకి చెందిన మాఫియా క్వీన్ గంగుబాయి కొత్వాలీ కథ ఆధారంగా సినిమాని తెరకెక్కించబోతున్నాడు. దీంట్లో గంగూబాయిగా ప్రియాంక చోప్రా పేరును పరిశీలిస్తున్నారు. సినిమాకు హీరా మండి అనే పేరును పరిశీలిస్తున్నారట. గంగూబాయి గురించిన సమాచారం కోసం భన్సాలీ పరిశోధన చేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయితే షూటింగ్ ఆరంభించే పనిలో ఉన్నాడు. (మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా..) - సౌమ్య నాగపురి