చెత్తను సేకరించి.. నష్టాన్ని తగ్గించి!

నగరాల్లో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయితీల్లో.. చెత్తను సేకరించేందుకు రిక్షాలు, ఆటోలు వస్తాయి. అందులో తడి, పొడి చెత్త ఉంటుంది. కానీ ఎలక్ట్రానిక్ చెత్త ఉంటుందని మీకు తెలుసా? ఈ అమ్మాయిలు అలాంటి చెత్తను సేకరించే పనిలో ఉన్నారు. ఎందుకంటారా?
మార్కెట్‌లోకి రోజుకో కొత్త గ్యాడ్జెట్ వస్తున్నది. పాతవన్ని ఈ-వేస్టేజ్‌గా స్టోర్ అవుతున్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ఈ-వేస్టేజ్ కుప్పలుకుప్పలుగా పోగై పర్యావరణానికి హాని చేస్తున్నది. ఈ విషయాన్ని తెలుసుకున్న అమ్మాయిలు ఒక ఆలోచన చేసి ఆవిష్కరణకు ఆజ్యం పోశారు. ఇంటింటికి వెళ్లి ఈ-వేస్టేజ్ ఉంటే సేకరించే పనిని మొదలుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ-వేస్టేజ్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మనది ఐదో స్థానం. అంటే మన దగ్గర ఎంతగా వాడుతున్నారో అంచనా వేసుకోవచ్చు. అదితి జైన్, స్నేహా అగర్వాల్, శ్రద్ధ ఛూగ్, శ్రియా శుక్లా, క్రితికా శర్మ నోయిడాలోని విశ్వభారతి పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నారు. వీళ్లందరూ కలిసి ఓ ఆండ్రాయిడ్ అప్లికేషన్ తయారు చేసి అవార్డు అందుకున్నారు. ఎనిమిది నెలల శ్రమ అనంతరం ఈడు పేరుతో ఆవిష్కరించి ఈ-వేస్టేజ్ సేకరిస్తున్నారు. ఈ యాప్ ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నది. కానీ పలు అవార్డుల పోటీలకు పంపగా అన్నింట్లో విజయం సాధించింది. సేకరించిన ఈ-వేస్టేజ్‌ను వేడి చేసి అందులో ఇనుము వంటి పదార్థాలను వేరు చేస్తారు. వాటి వల్ల వెలువడే రసాయనిక పొగ వల్ల నష్టం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రకృతి నాశనం అవుతుంది. దాన్ని కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి బాధ్యతగా తీసుకొని, కర్తవ్యంగా భావించి ఒక కొత్త ఆలోచనకు నాంది పలికారు ఈ విద్యార్థులు.