ఇండియన్ రోబోటిక్స్ లీగ్ లక్ష్యమంటున్న కవలలు

-అదితి ప్రసాద్ దీప్తి రావ్ కవలలు అనగానే పోలికలు మాత్రమే ఒకేలా ఉంటాయని తెలుసు. కానీ ఆ ఇద్దరి ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయంటే కొంత ఆశ్యర్యమేస్తుంది. చిన్నతనం నుంచి కూడా వారికి రోబో టెక్నాలజీ విషయంలో అమితమైన ఆసక్తి. ఆ ఆసక్తే వారిని కొత్త కొత్త అన్వేషణలకు మార్గదర్శనం చేసింది. రోబోల తయారీలో నూతన విధానాలను అవలంబిస్తూనే కొత్త తరహా టూల్స్‌ను కూడా వారు తయారు చేస్తున్నారు. భవిష్యత్తులో ఇండియన్ రోబోటిక్స్ లీగ్ ని విస్తృతం చేయడమే తమ లక్ష్యమంటున్న అదితి ప్రసాద్, దీప్తి రావ్ సుచీంద్రన్‌ల సక్సెస్‌మంత్ర.

బాల్యం నుంచే...

పాఠశాల స్థాయినుంచీ మాలో టెక్నాలజీ కి సంబంధించిన ఆలోచనలు ముసురుకునేవి. అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నా మాకెంతో ఇష్టం. ఇంటర్ స్కూల్ కల్చరల్ కాంపిటీషన్స్‌లో వాలీబాల్ టీమ్‌కు నేను కెప్టెన్‌గా ఉండేదాన్ని. మా నాన్నగారు దగ్గరుండి మరీ ముందుకు నడిపించేవారు. థియరీకి ప్రాక్టికల్స్‌కీ మధ్య తేడా ఏంటో నాన్న చెప్పేవారు. ఆలోచనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా వివరించేవారు. ప్రతి ఆదివారం ఖాళీగా ఉన్న సమయంలో టైం మ్యాగజైన్ చదివేదాన్ని. అందులో వచ్చే సైన్స్ ఆర్టికల్స్ మీద చర్చ జరిగేది. మా ఆలోచనలను, అభిప్రాయాలను పుస్తకంలో రాసి పెట్టుకునేదాన్ని. భారత రాజ్యాంగం, చరిత్ర అంటే నాకెంతో ఇష్టం. పుణేలోని ఐఎల్‌ఎస్ లా కాలేజీలో న్యాయశాస్త్రం, సింగపూర్‌లోని లీ కౌన్ యు స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో చదువుకున్నాను అని అదితి వివరించారు.

అదితి గురించి...

తన గ్రాడ్యుయేషన్ అయిపోయాక కొంతకాలం లీ కౌన్ యు స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలోనే పనిచేసింది. ఆ తర్వాత సింగపూర్ నుంచి ఇండియాకు తిరిగొచ్చింది. ఇక్కడికి వచ్చాక ఐఐటీ మద్రాసులోని చైనా స్టడీస్ సెంటర్లో పరిశోధన ప్రారంభించింది. అప్పుడే రోబోటిక్స్ లర్నింగ్ సొల్యూషన్ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించుకుంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా తన ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించింది ఇండియన్ రొబోటిక్స్ లీగ్‌లో వారి ఆలోచనలకు సంబంధించిన రోబోలను ప్రదర్శించి అభినందనలు అందుకున్నారు.

దీప్తి గురించి..

నేను ఐదేళ్ళ వయసు ఉన్నప్పటి నుంచే టెక్నాలజీ గురించి నాన్న దగ్గర నేర్చుకునేదాన్ని. ఐస్ స్కేటింగ్‌కు సంబంధించిన ఓ మోడల్ చిన్నప్పుడే చూపించాను అంటున్నది దీప్తి.12 ఏళ్ళ వయసులో షార్క్ చేపల విన్యాసాలను జాస్ (Jaws) మూవీలో చూసిన దీప్తి వాటి పనితీరును పరిశీలించింది. వాటిపై పరిశోధన కూడా చేసింది. కాలేజీ స్టేజికి వచ్చాక జీనోమ్ సైన్స్, బయోలజీ టెక్నాలజీపై ఆసక్తి పెంచుకుంది దీప్తి.
తన అభిరుచి మేరకు అన్నా యూనివర్శిటీ చెన్నై నుంచి ఇండస్ట్రియల్ బయో టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. నేషనల్ సెంటర్ ఫర్ బయాలాజికల్ సైన్సెస్ నుంచి న్యూరో సైన్స్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అందుకుంది. అలాగే యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా చాపెల్ హిల్ నుంచి పిహెచ్‌డీ పూర్తిచేసింది. ఆతర్వాత న్యూరో సైన్స్ టెక్నాలజీ సంస్థను ప్రారంభించాలని నిర్ణయించానుకున్నారు. దానిలో నుంచి వచ్చిందే రోబోటిక్స్ లర్నింగ్ సొల్యూషన్స్. ఆ సంస్థకు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ దీప్త్తినే.
కవలలైన అదితి ప్రసాద్, దీప్తి రావ్‌ల ఆలోచనలు కూడా సారూప్యంగా ఉంటాయి. వీరు ప్రస్తుతం రోబోటిక్స్ లెర్నింగ్ సొల్యూషన్స్ సంస్ధకు ఒకరు ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఓఓ), మరొకరు ఛీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్(CIO) గా వ్వవహరిస్తున్నారు. రోబోల తయారీలో కొత్త అన్వేషణలు అవసరం అంటుంటారు అదితి, దీప్తి, అందుకోసం వారు ఓ కొత్తరకం టూల్ ని తయారుచేశారు. దానికి STEM అని పేరు పెట్టారు. అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథ్స్. ఈ రంగాల్లో నైపుణ్యం సంపాదించుకుంటే భవిష్యత్తు బంగారు బాట అవుతుందన్నది వారి విశ్వాసం.

ఈతరం వారికి తెలియాలని

STEM ఫీల్డ్‌లో మహిళలు వివక్షకు గురవుతున్నారు. అనాది కాలం నుంచి పరిశోధనా రంగంలో పురుషాధిక్యం బాగా పెరిగిపోయిందని. ఈ రంగంలో ఔత్సాహికులైన అమ్మాయిలను ప్రోత్సహించాలనే దీన్ని ప్రారంభించాం అంటున్నారు అదితి. వివాహిత మహిళలకు పిల్లల పెంపకంతోనే సరిపోతున్నది. వారికి సరైన ఛైల్డ్ కేర్ సెంటర్లు ఉంటే STEM రంగంలో వారి సేవలు దేశానికి ఉపయోగపడతాయి. అందుకే రోబోటిక్స్ టెక్నాలజీ గురించి ఈతరం యువతులకు తెలియజేయాలని వారు భావిస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎలాంటి భవిష్యత్తు ఉంటుందో తెలుసుకోవాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగా ఇండియన్ రోబోటిక్స్ లీగ్‌ని విస్తృతం చేయాలి. ప్రధాన నగరాల్లో రోబోటిక్ ఎగ్జిబిషన్లు నిర్వహించాలి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్‌పై ఈనాటి యువత బాగా పట్టు సాధించగలగాలి. దీనికి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. దక్షిణ భారతదేశంలో K-12 స్కూల్స్‌లో రోబోటిక్ ఎడ్యుకేషన్‌పై ఇప్పడిప్పుడే అవగాహన పెరుగుతున్నది. ప్రతి ఏటా రోబోటిక్స్ కాంపిటీషన్, ఇండియన్ రోబోటిక్స్ లీగ్‌ని నిర్వహించాలనుకుంటున్నారు అదితి, దీప్తి.

పిల్లలకు కూడా..

వివిధ శారీరక అవలక్షణాలతో పుట్టిన పిల్లలకు కూడా టెక్నాలజీని పరిచయం చేయాలి. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా వారిలోని లోపాలను సరిదిద్దాలనే ఆశయంతో త్రిచీలోని అన్నై ఆశ్రమంలో అనాథ పిల్లలను ఆదరించి వారికి విద్యను అందిస్తున్నారు ఈ కవలలు. ఇక్కడ మరో విషయం ఆలోచించాలి. STEM ఎడ్యుకేషన్‌పై ముందుగా తల్లిదండ్రులను చైతన్యపరచాలి. ఇలాంటి స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్ అమ్మాయిలకు అవసరం లేదనేది తల్లిదండ్రుల భావన. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఇలాంటి ఎడ్యు కేషన్‌లో ముందుంటున్నారు. అందుకే వివిధ కాలేజీలు, స్కూళ్ళలో ఈ తరహా అవగాహన కల్పిస్తున్నా మంటున్నారీ సోదరీలు. ఆడపిల్లలను STEM, రోబోటింగ్ అండ్ కోడింగ్‌లో నిపుణులుగా తయారు చేయగలగాలంటారు అదితి, దీప్తి.ఈ తరం చిన్నారులు చాలా సున్నితంగా. వేగంగా ఆలోచించగలుగుతున్నారు. ఇతరుల పిల్లలతో మన పిల్ల ల్ని పోల్చి చూసుకోకుండా.. వారి ఆలోచనలకు అనుగుణంగా విద్యను అందించే ఏర్పాటుచేయాలంటారు. నేటి పిల్లలే రేపటి సైంటిస్టులు. రోబోటిక్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వారిని ముందుకు నడిపించే వ్యవస్థ మనకు ఇప్పుడు అవసరం అని చెబుతున్నారు అదితి, దీప్తి. సృష్టిలో బాల్యానికి మించిన మధురమైన స్మృతులు లేవు. చిన్నప్పటి ఆలోచనలు భవిష్యత్తుపై ఎంతో ప్రభావం ఉంటుందంటారు వీళ్లు.

తండ్రే తొలి గురువు

సాధారణంగా అమ్మాయిలు తండ్రి ఆలోచనలకు, ఆయన అడుగుజాడలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరూ కూడా అంతే. వారి సందేహాలను తీర్చడంలో ఆ తండ్రి ఒక్కోసారి గురువుగా మారేవాడు. ఆయన దగ్గర నుంచి ఎన్నో విషయాలను అడిగి తెలుసుకునేవారు. అదితి, దీప్తిలు చిన్నతనం నుంచి రోబో టెక్నాలజీ విషయంలో కొత్త కొత్త అన్వేషణలు సాగిస్తూనే ఉన్నారు. శాస్త్ర సంబంధమైన విషయాల్లో వాళ్ళ తండ్రే మార్గదర్శి. చిన్నతనంలో వచ్చే చిన్న చిన్న సందేహాలను ఆయనే తీరుస్తూ ఉండేవారట. వారు అడిగే ప్రశ్నలకు ఆయన చాలా ఓపికగా సమాధానం చెప్పేవారట. వారికి వచ్చే ఆలోచనలు కూడా శాస్త్రీయ సంబంధమైనవి కావడంతో ఆయన వాటి గురించి ఎంతో సేపు వారితో చర్చించేవాడు. కింద పడేసిన బంతి ఏ శక్తివల్ల తిరిగి పైకి ఎగురుగుతుంది. చిన్న విత్తనం పెరిగి మహావృక్షంగా ఎలా మారుతుంది? ఆ వృక్షం నుంచి ఉద్భవించిన పండ్లు, ఫలాలు జీవకోటికి ఎలా ఆహారంగా మారుతున్నాయనేది అదితి, దీప్తిలను అన్వేషణ వైపు అడుగులు వేసేలా చేశాయి. ఇంటి ఆవరణలోని సీతాకోకచిలుక వారిలో ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించేది. గొంగళిపురుగు సీతాకోక చిలుకగా ఎలా మారింది. ఇలా ఎన్నో ప్రశ్నలు తమ తండ్రి దగ్గర వేసి సమాధానాలు రాబట్టేవారు. రోబోటిక్స్‌పై వారికున్న మక్కువను గుర్తించిన ఆయన STEM ఎడ్యుకేషన్‌ను వారి దగ్గరకి చేర్చాలని ఆయన భావించారు.