వాట్సాప్ ద్వారా చీరెలమ్మి.. కోట్లు సంపాదించి !

మనిషి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకూ కీలక పాత్ర పోషిస్తున్నది సోషల్ మీడియా. ఇది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుని ఆదాయామార్గంగానూ మలుచుకోవచ్చని చెన్నైకి చెందిన మహిళ నిరూపిస్తున్నది. వాట్సాప్ గ్రూపుల ద్వారా చీరెల వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తూ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.
కొంతమంది తమ చదువుకు తగిన ఉద్యోగం రాలేదని కుమిలిపోతుంటారు. మరి కొందరు సమయాన్ని వృథా చేస్తుంటారు. మనసుంటే మార్గముంటుందనడానికి చెన్నైకి చెందిన షణ్ముఖప్రియ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వాట్సాప్‌లో ప్రతి రోజూ హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ మెస్సేజ్‌లతో సమయాన్ని వృథా చేయలేదు. కొంత మంది అనవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తూ విసుగు తెప్పిస్తుంటారు. ఈమె మాత్రం వాట్సాప్ ద్వారా చీరెలు అమ్మి కోట్లు రూపాయలు సంపాదిస్తున్నది. కేవలం మూడేండ్లలో 2.4కోట్ల వ్యాపారం చేసిందంటే నమ్మగలరా? షణ్ముఖ వాళ్ల అత్త గతంలో చీరెల వ్యాపారం చేసేది. కొద్ది రోజుల తర్వాత ఆమె చనిపోయింది. కొన్నాళ్ల తర్వాత షణ్ముఖకు బాబు పుట్టడంతో చాలా రోజులు ఇంటి వద్దనే ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో ఆమెకు వాట్సాప్ ద్వారా చీరెలు అమ్మాలనే ఆలోచన వచ్చింది. అలా ఆమెకు వచ్చిన ఆలోచనను వెంటనే అమలు చేసింది. ముందుగా తమ బంధువులు,స్నేహితులకు తన దగ్గర అందుబాటులో ఉన్న చీరెలు, వాటి ధరలతో కూడిన ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేసింది. మొదట్లో 20 నుంచి 40 చీరెలు కావాలంటూ ఆర్డర్లు వచ్చేవి. ఆతర్వాత మరికొన్ని కొత్త గ్రూపులను క్రియేట్ చేసి మరిన్ని చీరెలు అమ్మడం ప్రారంభించింది. కొనుగోలుదారులు ఆన్‌లైన్‌లోనే చీరెలు చూసి తమకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేస్తారు. అలా ఆర్డర్ చేసిన చీరెలను వారికి అందించడానికి పలు కొరియర్ సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరుచుకున్నది. అప్పటి నుంచి ఆర్డర్లు సంఖ్య బాగా పెరిగింది. షణ్ముఖప్రియ ప్రస్తుతం 50 నుంచి 80కి పైగా చీరెలు అమ్ముతున్నది. పండుగల సీజన్‌లోనైతే 100కుపైగా ఆర్డర్లు వస్తున్నాయి. మూడేండ్ల నుంచి ఆమె వాట్సాప్ ద్వారా చీరెలు అమ్మి రూ.2.4కోట్ల వరకూ సంపాదించింది. ప్రస్తుతం భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నది షణ్ముఖ ప్రియ. తన భర్త ప్రోత్సాహంతోనే తాను ఈ వ్యాపారం చేస్తున్నానని అంటున్నది. తాను రూపొందించిన పలురకాల డిజైనర్ శారీస్‌తోపాటు, హోల్‌సేల్‌లో కొనుగోలు చేసిన చీరెలకు డిమాండ్ పెరిగింది. దీంతో తన వద్ద మరి కొంత మంది ఉద్యోగులను నియమించుకున్నది. ఫేస్‌బుక్, టెలిగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వేదికగా చేసుకొని వేల మందితో వ్యాపారం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది.