గద్వాలలో కలిసిన బోరవెల్లి సంస్థానం

(తెలంగాణ సంస్థానాలు : పదమూడో భాగం) చరిత్ర సమస్తం ఆధిపత్య సంఘర్షణల సమాహారమే. కలవడం.. గెలవడం.. చరిత్రకు కొత్త కాదు. సంస్థానాల చరిత్రలో కూడా ఇలాంటి కలయికలు చాలా కనిపిస్తాయి. సంస్థానంగా పేరొందిన ఒక ప్రాంతం కొంతకాలం మరో సంస్థానంలో కలిసిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కారణాలు వేర్వేరుగా ఉన్నా కలయిక మాత్రం ఒక్కటే. విడిపోవడానికీ అలాంటి కారణాలే ఉన్నాయి. ఆందోలు-జోగిపేట సంస్థానం రాణి శంకరమ్మ పాలనా కాలంలో పాపన్నపేట సంస్థానంలో కలిసిపోయింది. గోపాల్‌పేట సంస్థానం వనపర్తి సంస్థానంలో భాగమైపోయింది. రాజాపేట సంస్థానం నుంచి సంస్థాన్ నారాయణపురం ఏర్పడింది. ఇలాగే బోరవెల్లి సంస్థానం కూడా గద్వాల సంస్థానంలో కలిసిపోయింది.

నగేష్ బీరెడ్డి ఫీచర్స్ ఎడిటర్, నమస్తే తెలంగాణ సెల్ : 80966 77177

చాలా సంస్థానాల చరిత్ర మాదిరిగానే బోరవెల్లి (జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడ్ మండలంలోని గ్రామం) సంస్థానం చరిత్ర కూడా మనకు చాలావరకు అందుబాటులో లేదు. ఒకప్పుడు ప్రసిద్ధ స్వతంత్ర సంస్థానంగా వెలుగొందిన బోరవెల్లి అటు తర్వాత గద్వాల సంస్థానంలో కలిసిపోయింది. దీంతో బోరవెల్లి చరిత్ర వేరుగా కాకుండా గద్వాలతోపాటే చదువుకోవాల్సి వస్తున్నది. బోరవెల్లి సంస్థానాధీశులు పాకనాటి రెడ్లు. వీరిది మిడిమిళ్ల గోత్రం. వీరి గృహనామం ముష్టిపల్లి. గద్వాల, బోరవెల్లి సంస్థానాధీశుల గృహ, గోత్ర శాఖానామాలు ఒకటే. పైగా వీరు బంధువులు. బోరవెల్లి సంస్థానానికి వారసులు లేక పాలన అగమ్యగోచరమైనప్పుడు వీరికి సమీప దాయాదులైన గద్వాల సంస్థానాధీశులకు ఈ సంస్థానం సంక్రమించి ఉండొచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. చింతపల్లి ఛాయాపతి కవి రచించిన రాఘవాభ్యుదయ ప్రబంధములోని అవతారికలోని కృతిశ్రోత వంశావతార వర్ణనము మేరకు బోరవెల్లి సంస్థానాధిపతుల పూర్వ చరిత్ర కొంత తెలుస్తున్నది. దీని ప్రకారం బోరవెల్లి సంస్థానం మూలపురుషుడు నాడగౌడు తమ్మారెడ్డి. ఇతడు బోరవెల్లి రాజధానిగా పాలిస్తుండేవాడు. ఈయన భార్య మాచమ్మ. వీరి కుమారుడు నల్లారెడ్డి. ఈయనకు మల్లాంబ, తిమ్మాంబ అని ఇద్దరు భార్యలు. నల్లారెడ్డి, మల్లాంబకు ఇద్దరు కుమారులు పెద సోమభూపాలుడు, చిన సోమభూపాలుడు. నల్లారెడ్డి, రెండో భార్య తిమ్మాంబకు తమ్మారెడ్డి, పాపారెడ్డి అని ఇద్దరు కొడుకులు, మల్లాంబ అనే కూతురు ఉండేవారు.

నల్లారెడ్డి ఐదుగురు సంతానంలో పెద్దవాడైన పెద సోమభూపాలుడి భార్య లచ్చమాంబ. వీరి కొడుకు వెంకటరెడ్డి. రెండో వాడైన చిన సోమభూపాలుని భార్య గిరియమ్మ. ఈవిడ గద్వాల వారి ఆడపడచు. గద్వాల చరిత్రలో సోమనాద్రిగా పేరొందిన పెద సోమభూపాలుని కూతురు ఈ గిరియమ్మ. చినసోమభూపాలునికి, గిరియమ్మకు సంతానం కలుగలేదు. దీంతో బావ కొడుకైన వెంకటరెడ్డిని చేరదీసి పెంచి పెద్ద చేసింది గిరియమ్మ. ఈ వరసన గద్వాల పెద సోమభూపాలుని (క్రీ.శ. 1663-1713)కి వెంకటరెడ్డి మనుమడు కాబట్టి ఇతడు పద్దెనిమిదో శతాబ్దానికి చెందినవాడుగా చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. బోరవెల్లి సంస్థానాధీశుల కాలంలో రెండు కృతులు వెలువడినట్లు చరిత్ర చెబుతున్నది. ఇందులో ఒకటి చింతపల్లి ఛాయాపతి కవి రచించిన రాఘవాభ్యుదయము. గిరియమ్మ సాదిన వెంకటరెడ్డియే రాఘవాభ్యుదయ కృతిశ్రోతగా చరిత్ర చెబుతున్నది. రెండో కృతి లయగ్రాహి గరుడాచల కవి రచించిన కౌసలేయ చరిత్రము. రామాయణ కథాత్మకమైన ఈ ప్రబంధ రచనను గిరియమ్మయే ప్రోత్సహించింది. బోరవెల్లి సంస్థానాధిపతుల కులదైవం కేశవస్వామి. గిరియమ్మ కౌసలేయ చరిత్రమును తమ కులదైవానికి అంకితమిప్పించింది. ఈ కావ్యంలో గిరియమ్మ పుణ్య కార్యాలతో పాటు ఆమె తల్లి లింగమాంబ సత్కార్యాలను కూడా వర్ణించారు. ఈ రెండు కృతులు బోరవెల్లి సంస్థానాధీశుల వంశానుక్రమాన్ని కొంతవరకు వివరిస్తున్నాయి.

పెద సోమభూపాలుడు, చిన సోమభూపాలుని తర్వాత రాణి గిరియమ్మ కొంతకాలం బోరవెల్లి సంస్థానాన్ని పాలించింది. గిరియమ్మ తన పాలనలో సంస్థానాన్ని పండిత పామర జనరంజకంగా తీర్చిదిద్దింది. కవులను సత్కరించడం, విద్యార్థులకు చదువు చెప్పించడం, దేవాలయాలను, తోటలను నిర్మించడం, తీర్థయాత్రలను చేయడం వంటి ధర్మాకార్యాలెన్నో చేసింది. రాణి గిరియమ్మకు ఇద్దరు సోదరులు తిరుమల రాయలు, రామరాయలు (గద్వాల సోమనాద్రి, లింగాంబల కొడుకులు). వీరిద్దరూ గద్వాల సంస్థానాన్ని కొంతకాలం పాలించారు. తిరుమల రాయలుకు ఇద్దరు భార్యలు మంగమ్మ, చొక్కమ్మ. ఈ రాణి చొక్కమ్మ కొంతకాలం సంస్థానాన్ని పాలించినట్లు బోరవెల్లికి చెందిన కృతుల ద్వారా తెలుస్తున్నది. ఈవిడ కాలంలోనే బోరవెల్లి సంస్థానం గద్వాల సంస్థానంలో విలీనమైంది. రాణి చొక్కమ్మకు సంబంధించిన ఇతర పాలనా వివరాలు తెలియడం లేదు. కానీ రాణి చొక్కమ్మ భర్త నిర్మించిన నిజాం కొండ గురించి కొన్ని వివరాలు లభిస్తున్నాయి.

గద్వాల సోమనాద్రి వీరమరణం తర్వాత, తిరుమల రాయలుకు ముందు సోమనాద్రి పట్టపురాణి అమ్మకాంబ (అమ్మక్కమ్మ) కొంతకాలం, రెండో భార్య లింగాంబ (లింగమ్మ) ఇంకొంత కాలం గద్వాల సంస్థానాన్ని పాలించారు. వీరి కాలంలో గోల్కొండలో కుతుబ్‌షాహీల పాలన అంతమై అసఫ్ జాహీల పాలన మొదలైంది. అంతవరకు గద్వాల వారికి, కర్నూలు నవాబులకు మధ్య శత్రుత్వం ఉండేది. వీరిని ఎదుర్కొనేందుకు రాణి లింగమ్మ నిజాంతో మైత్రిని పాటించి అతని అధికారాన్ని అంగీకరించింది. ఈ సమయంలోనే స్థావరం కోసం బీచుపల్లి (జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని గ్రామం) దగ్గర కృష్ణానది మధ్యలో ఉన్న కొండపై కోట నిర్మాణం చేపట్టింది. కొన్ని వందల సంవత్సరాలు ఎన్నో రాజ వంశాలు ఈ నడిగడ్డ ప్రాంతానికి ఆధిపత్యం వహించినప్పటికీ ఈ కొండను పట్టించుకున్నట్లు అనిపించదు. బహుశా ఈ దీవిని చూసిన నిజాం ఉల్ ముల్క్ రాణితో కొండపై కోట నిర్మాణం చేపట్టమని సూచించినట్లు కొందరు చరిత్రకారులు భావిస్తున్నారు. అందుకే ఈ జలదుర్గానికి నిజాం కొండ అనే పేరొచ్చినట్లు చెబుతారు. రాణి లింగాంబ తర్వాత కొడుకు తిరుమల రాయలు నిజాం కొండపై కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. తిరుమల రాయలు అకాల మరణంతో ఆయన రెండో భార్య రాణి చొక్కమ్మ పాలనా బాధ్యతలను తీసుకుంది. భర్త పూర్తి చేసిన నిజాం కొండలో ఆంజనేయ స్వామిని ప్రతిష్టించింది. ఈ జలదుర్గంలో అత్యవసర సమయంలో ఉపయోగించుకునేందుకు కొంత సైన్యం, యుద్ధ సామాగ్రి ఉండేదట. గద్వాల కోట నుంచి నిజాం కొండపైకి రహస్య సొరంగ మార్గాలున్నట్లు స్థానికంగా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తిరుమల రాయలు తర్వాత రామరాయలు కొంతకాలం గద్వాల సంస్థానాన్ని పాలించాడు. రామరాయలుకు సంతానం కలుగలేదు. దీంతో అన్న తిరుమల రాయలు, వదిన చొక్కమ్మల కొడుకు చిన సోమభూపాలుడిని దత్తత తీసుకున్నాడు. ఈయన పాలనా కాలం నుంచే గద్వాల, బోరవెల్లి సంస్థానాలు వేర్వేరుగా కాకుండా ఒకే పాలన కిందికి వచ్చాయి.

రాజకీయంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా గాడాంధకారంలో పడి కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ప్రజలను మేల్కొలిపిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 1896 మే 28న బోరవెల్లి గ్రామంలోని తన అమ్మమ్మ గారింట్లో జన్మించారు. తల్లిదండ్రులు రంగమ్మ, నారాయణరెడ్డి. వీరి స్వగ్రామం ఇటిక్యాలపాడు. మా ఊరు నీరు లేని ఇటికాలపాడు అని చమత్కారంగా తమ ఊరి గురించి సురవరం చెప్పుకునేవారు.