పర్యావరణ ప్రేమికురాలు!

అడవులను రక్షించడానికి ఈ యువతి నిర్విరామంగా పోరాడుతున్నది. సుమత్రాలోని ల్యూజర్ అడవికి కాపలాదారురాలైంది. ఇంకేం చేస్తుందంటే..?
ప్రపంచంలో ప్రస్తుతం ఒరాంగుటాన్‌లు, ఖడ్గమృగాలు, ఏనుగులు, పులులు కలిసి జీవించే ప్రదేశం సుమత్రాలోని ల్యూజర్ ఎకోసిస్టమ్. అయితే ఇక్కడ కొంతమంది కార్పొరేట్ సంస్థల వ్యక్తులు ప్రభుత్వ రాయితీతో పామాయిల్ పండించేందుకు అడవులును నరికివేస్తున్నారు. దీంతో పర్యావరణ కార్యకర్త ఫర్వీజా ఫర్హాన్ ఆ వ్యక్తులపై వ్యతిరేకంగా స్థానికులతో కలిసి పోరాడుతున్నది. 2012లో తాను స్థాపించిన యయాసన్ హాకా అనే స్వచ్ఛంద సంస్థ తరపున అక్రమంగా పొందిన పర్మిట్‌లను రద్దు చేయిస్తున్నది. ఈ ప్రాంతంలో రహదారులు, డ్యామ్‌ల నిర్మాణం, ఆయిల్ పామ్ చెట్ల పెంపకానికి ఇస్తున్న రాయితీలకు వ్యతిరేకంగా కేసులు వేస్తున్నది. వన్యప్రాణులకు మద్దతుగా ఎవరూ మాట్లాడడం లేదని, అందుకే దీన్ని అన్యాయంగా భావించి తాను పోరాటం చేస్తున్నానని అంటున్నది ఫర్హాన్. మెరైన్ బయాలజీ పూర్తి చేశాక, నేను ప్రేమించిన ఈ ప్రాంతానికి తిరిగి వచ్చినపుడు ఇదంతా ధ్వంసమైంది. చాలా ఆవేదన కలిగింది. అడవులను విచక్షణారహితంగా కొట్టివేస్తున్నారు. అందుకే నా పోరాటం అంటున్నది. ఫర్హాన్ కృషి ఫలితంగా ఆ ప్రాంతంలో ఆయిల్ పామ్ చెట్లను పెంచుతున్న ఓ సంస్థ.. స్థానికులకు రూ.187 కోట్ల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణంపై చేసిన కృషికిగాను ఫర్వీజా ఫర్హాన్ 2016లో విట్లే అవార్డు పొందింది. ఒక్క ప్రాంతంలోనే కాకుండా సుమత్రా, అమెజాన్, మడగాస్కర్‌లాంటి ప్రాంతాల్లోనూ విపరీతమైన విధ్వంసం జరుగుతుందని, దీనిపై అంతా పోరాడాలని పిలుపునిస్తున్నది.