అమృతలాంటి ఓ కౌసల్య కథ!

గాయపడ్డ గువ్వకే ఆ గాయం తాలూకు బాధేంటో తెలుస్తుంది. పగిలిన గుండెకే.. మరో హృదయం అనుభవించే నొప్పి తీవ్రత తెలుస్తుంది. భర్త పరువుహత్యకు గురై పుట్టెడు దుఃఖంతో ఉన్న అమృత వర్షిణిని కలిసింది తమిళనాడుకు చెందిన కౌసల్య శంకర్. తన కులం కాని వ్యక్తిని పెండ్లి చేసుకున్నందుకు కౌలస్య తండ్రి కూడా శంకర్‌ను కత్తులతో అతి కిరాతకంగా చంపించాడు. అమాయకత్వం నిండిన మొఖంతో దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరుగకూడదంటే రోదించడం కాదు.. గర్జించాలని నిర్ణయంచుకున్నది. దండోరా మోగిస్తూ తమిళనాడు వీధివీధి తిరుగుతూ కులోన్మాదం మీద పోరాటం చేస్తున్నది. కులాంతర వివాహాలు చేసుకునే యువజంటలకు బాసటగా నిలుస్తున్నది. మిర్యాలగూడలో అమృతను కలువడానికి వచ్చిన సందర్భంగా ఆమె తన ప్రేమకథ, నిందితులకు శిక్ష పడేవరకు చేసిన పోరాటం గురించి జిందగీతో పంచుకున్న ముచ్చట్లు మీకోసం..
ప్రణయ్ హత్య గురించి తెలియగానే నాకు శంకర్ గుర్తొచ్చాడు. శంకర్‌ని కూడా మెడ మీద కత్తితో నరికి చంపారు. కత్తివేటు పడగానే శంకర్ కూడా ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. నన్ను ఒంటరిగా వదిలేసి ఈ లోకం విడిచివెళ్లాడు. కానీ తన ఆశయాన్ని నేను కొనసాగిస్తున్నా. అమృతను చూడగానే నన్ను నేను చూసుకున్నట్టనిపించింది. కళ్లలో నీళ్లు తిరిగాయి. అమ్మాయి ప్రేమలో పడిందని తెలియగానే తల్లిదండ్రులు ఆమెకు బలవంతంగా పెండ్లి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇంట్లో నిర్భందిస్తారు. అబ్బాయిల విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించొచ్చు కదా! పిల్లలను చిన్నప్పటి నుంచి కులం అనే భావనకు దూరంగా పెంచాలి. నా పోరాటానికి మద్ధతునిస్తున్న అందరికీ ధన్యవాదాలు. కులాంతర వివాహాలు చేసుకున్నవారు, పరువుహత్య బాధితులు ధైర్యంగా ఉండండి. మన ధైర్యమే మనకు బలం. మన పోరాటమే కులోన్మాదానికి చరమగీతం. కౌసల్య శంకర్, పరువు హత్య బాధితురాలు, సామాజిక కార్యకర్త, శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్ట్ ఫౌండర్
ఏంజరిగిందో.. తెలుసుకునేసరికల్లా జరుగాల్సిన నష్టం జరిగిపోయింది. కోలుకోవడానికి చాలారోజులే పట్టింది. తలకు 36 కుట్లతో బతికి బయటపడింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న శంకర్‌ని తల్లిదండ్రులే చంపించారని తెలిసింది. శంకర్‌ది, తనది వేర్వేరు కులాలు కావడమే అందుకు కారణం అని మీడియా కోడై కూసింది. శంకర్‌ని నరికి చంపిన వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసుల సమక్షంలో కౌసల్య ఆ వీడియో చూసింది. మానసికంగా కుంగిపోయింది. అప్పటి వరకు అంతో ఇంతో తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండేది. ఆ ఘటనతో ఆమె మనసు విరిగిపోయింది. అత్తవారింట్లోనే ఉండిపోయింది. ఏం చేసినా శంకరే గుర్తొస్తున్నాడు. ఎవరు మాట్లాడినా శంకర్ మాటలే గుర్తొస్తున్నాయి. శంకర్ లేని లోకంలో బతుకకూడదనుకుంది. ఈ ఘటన జరిగిన రెండు నెలల తర్వాత తను కూడా చనిపోవాలని నిర్ణయం తీసుకుంది. విషం మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. శంకర్ తల్లిదండ్రులు కౌసల్యకు సకాలంలో వైద్యం అందించారు. మృత్యువును మరోసారి జయించింది. క్రమంగా కోలుకుంది. తను ఎందుకు బతికుందో ఆలోచించింది. చావు పరిష్కారం కాదు.. సమస్యను రూపుమాపడమే పరిష్కారం అనుకుంది. ఈ సమయంలో తమిళనాడు ప్రభుత్వం కౌసల్యకు అండగా నిలబడింది. పలు ఎన్జీవోలు, సంఘాలు కౌసల్యకు ధైర్యం చెప్పాయి. కౌసల్యకు తన కర్తవ్యం ఏంటో అర్థమయింది. నిందితులకు శిక్ష పడేలా పోరాటం మొదలుపెట్టింది. శంకర్ మరణానికి కారణమైన తండ్రి, ఇతర నిందితులకు మరణ శిక్ష పడేలా తన పోరాటం తీవ్రం చేసింది.

పోరాటం మొదలైంది..

శంకర్ సోషల్ జస్టిస్ ట్రస్ట్ పేరుతో ఓ సంస్థ ప్రారంభించింది. శంకర్ ఇల్లు ఉండే ప్రాంతంలో చాలామంది పిల్లలు చదువుకు దూరంగా ఉండేవారు. ఇంగ్లీష్ విద్యంటే వారికి అందని ద్రాక్షే. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా ఇంగ్లీష్ క్లాసులు చెప్పించడం మొదలుపెట్టింది. శంకర్ ఆశయాన్ని కొనసాగిస్తూనే.. ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేది. ఈ సమయంలోనే ఓ నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసుకొని సీరియస్‌గా ప్రిపేరయింది. రెవెన్యూ అసిస్టెంట్‌గా ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు తన జీవితానికో భరోసా.. తన కాళ్ల మీద తను నిలబడుతూ.. పదిమందికి సాయం చేయొచ్చు. కానీ.. అక్కడే కథ మరో మలుపు తిరిగింది. నిత్యం విధులకు హాజరు కావాలి. తన కదలికలు తల్లిదండ్రులకు తెలిసిపోతాయి. ఎప్పటికైనా తన ప్రాణాలకు ముప్పే అని ఆలోచించింది. నిజానికి శంకర్‌ని చంపిన తర్వాత కౌసల్య మీద దాడి చేయడానికి ఆమె తండ్రికి సంబంధించిన వ్యక్తులు చాలాసార్లు ప్రయత్నించారు. కానీ ఆమె నిత్యం ప్రజల మధ్య ఉండడం వల్ల కుదరలేదు. దీనికి తోడు ప్రభుత్వం ఆమెకు ఇద్దరు పోలీసులను రక్షణగా నియమించింది. అయినా.. ఆమెకు తండ్రి నుంచి పొంచి ఉన్న హాని తొలగిపోలేదు. అందుకే తన ఉద్యోగాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేస్తూ.. తన బదులుగా తన అత్తవారింట్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని అర్జీ పెట్టుకుంది. అందుకు గల కారణాలను, పరిస్థితులను వివరిస్తూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆమె మామకు ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తా ఉద్యోగం ఇచ్చింది.

రూటు మార్చింది..

ప్రభుత్వం, దాతల సహాయంతో తన అత్తమామలకు ఇల్లు కట్టించింది. దూరవిద్య ద్వారా బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తిచేసింది. వేషం మార్చింది. అప్పటి వరకు అమాయకురాలిగా కనిపించే కౌసల్య ఒక్కసారిగా టామ్‌బాయ్‌లా మారిపోయింది. పొడవాటి జుట్టును అబ్బాయిలా కటింగ్ చేయించుకుంది. భుజానికి డప్పు వేసుకొని బుల్లెట్ మీద తిరుగుతూ కులోన్మాదానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. భారతదేశంలో కులవ్యవస్థ వల్ల ఉన్న నష్టాలేంటో ఏకరువు పెడుతూ జనాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇదంతా చేసూన్తే.. శంకర్ హత్యకు కారణమైన తల్లిదండ్రులు, నిందితుల మీద పోరాటం సాగిస్తూనే ఉంది. పోలీసుల కస్టడీలో ఉన్న కౌసల్య తండ్రి జైలు నుంచి బయటకు రావడానికి 58 సార్లు బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నాడు. కౌసల్య కోర్టులో బలంగా వాదించి 58సార్లు బెయిల్ ఇవ్వడానికి కోర్టు తిరస్కరించేలా పోరాడింది. కౌసల్య పోరాటానికి, ప్రచారానికి తనలాంటి బాధితులు భారతి, ప్రియాంక, దివ్య మరికొందరు జతకలిశారు. అందరూ కలిసి తమిళనాడు మొత్తం తిరుగుతూ కులవివక్షకు, కులానికి వ్యతిరేకంగా, కులాంతర వివాహాలకు మద్ధతుగా ప్రచారోద్యమం నిర్వహిస్తున్నారు. వారికి నాయకత్వం వహిస్తూ కౌసల్య సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. చిచ్చరపిడుగులా ప్రసంగాల వర్షం కురిపిస్తున్నది. ప్రస్తుతం 30 మందికి ట్రస్టు ద్వారా చదువు, డప్పు శిక్షణ ఇస్తున్నది కౌసల్య. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఆశ్రయం కల్పిస్తూ, వారికి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తున్నది.

పోరాట ప్రతిఫలం..

కౌసల్య రెండేండ్ల పోరాటం అంతిమదశకు చేరుకుంది. 2017 డిసెంబర్12న తిరుపూర్ జిల్లా కోర్టు కౌసల్య కేసు విషయమై తీర్పు వెలువరించింది. ఈ తీర్పు దేశంలో సంచలనం సృష్టించింది. కౌసల్య భర్త అయిన శంకర్ హత్యకు కారణమైన ఏ1 నిందితుడు, కౌసల్య తండ్రి చిన్నస్వామిని రెండుసార్లు ఉరి తీయాల్సిందిగా, మిగతా నిందితులకు కూడా ఉరిశిక్ష వేయాలంటూ తీర్పునిచ్చింది. ఒకరికి జీవితఖైదు విధించింది. శంకర్ కుటుంబానికి, కౌసల్యకు కలిపి పన్నెండు లక్షల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలని తీర్పు చెప్పింది. పరువు హత్యల విషయంలో దేశంలో ఇదే అతిపెద్ద, సంచలన తీర్పు. కోర్టు, ప్రభుత్వం, ఎన్జీవోలు, యువత ఇచ్చిన సపోర్ట్‌తో కౌసల్య తన పోరాటాన్ని విస్తృతం చేస్తున్నది. కౌసల్య ఏ ప్రాంతానికి వెళ్లినా ఆమెకు రక్షణగా పోలీసులే కాక.. ఆయా ప్రాంతాల యువత స్వచ్ఛందంగా ఆమెకు రక్షణ కల్పిస్తున్నారు.

ఇవే డిమాండ్లు

-కులాంతర వివాహాలు చేసుకునే జంటలకు రక్షణ కల్పించే చట్టం చేయాలి. -ప్రేమ వివాహాలు చేసుకున్న జంటలకు పోలీసులు రక్షణ కల్పించాలి. -ప్రేమికులను హత్య చేసిన నిందితులకు మరణశిక్ష విధించాలి. -నిందితులకు శిక్ష పడేవరకు నాన్‌బెయిలబుల్ కేసు పెట్టాలి. -విద్యావ్యవస్థలో మార్పులు రావాలి. -కులాలకు అతీతంగా విద్య, వైద్యం, ఇతర సేవలు అందించాలి. కుల నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి. -పరువు హత్యలు నిరోధించడానికి ప్రత్యేక చట్టం చేయాలి.

అది 2016 మార్చి..తమిళనాడులోని

తిరుపూర్ జిల్లా ఉడుముల్‌పేట్ మార్కెట్..కొత్తగా పెండ్లి చేసుకున్న కౌసల్య, శంకర్‌లు బట్టలు కొనుక్కోడానికి మార్కెట్‌కి వచ్చారు. ఆయుధాలతో ముగ్గురు దుండగులు వారిని అనుసరిస్తున్నారు. కబుర్లు చెప్పుకుంటూ షాపులు కలియతిరుగుతున్న ఆ జంట వారిని గమనించలేదు. బట్టలు కొనుక్కుని రోడ్డు దాటుతుంటడా.. ఒక్కసారిగా ముగ్గురి చేతుల్లో ఉన్న కత్తులు వారి మీద విరుచుకుపడ్డాయి. చూస్తుండగానే శంకర్ ప్రాణాలు కోల్పోయాడు. కౌలస్య మీద లెక్కలేనన్ని కత్తిపోట్లు.. స్థానికులు తేరుకునే లోపే దుండగులు తమ పని పూర్తి చేసుకొని పారిపోయారు. కౌలస్య కుప్పకూలిపోయింది. స్పృహ కోల్పోయింది. ప్రవీణ్‌కుమార్ సుంకరి