హస్తకళలకు విలువనిస్తున్ననవ్య అగర్వాల్

చేతివృత్తులు, హస్తకళలు భారతదేశంలో అనేక గ్రామాల్లో ఆదాయవనరులు. అయితే టెక్నాలజీ పుణ్యమా అని చేతివృత్తులు, హస్తకళలనే నమ్ముకున్న లక్షలాదిమంది కార్మికుల, కళాకారుల జీవితాలు చితికిపోతున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ టెక్నాలజీతోనే వీరికి మళ్లీ కొత్త ఊపిరి పోసే ప్రయత్నం జరుగుతున్నది. అలాంటి ప్రయత్నమే చేసింది నవ్య. గ్రామీణ హస్తకళలకు ఆధునిక హంగులు చేర్చి అంతంత మాత్రం ఆదరణ ఉన్నవాటికి కొత్త వెలుగు తెచ్చిపెట్టిందామె. హస్తకళాకారులకి మునుపెన్నడూ లేనంతగా ఉపాధి చూపించగలుగుతున్నది. చేతివృత్తులు, హస్తకళలకు జీవం పోస్తున్న నవ్య అగర్వాల్ సక్సెస్ మంత్ర.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సీతాపూర్ గ్రామం. సీతాపూర్ బాగా గ్రామం. కనీస సౌకర్యాలు అంతంతమాత్రమే. నిన్నమొన్నటిదాకా ఆ ఊరి పేరు చుట్టుపక్కల గ్రామాలకు అంత గా తెలియదు. కానీ ఇప్పుడా ఊరికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. అది కూడా నవ్య మూలంగానే.

కళాకారుల జీవితం మారాలని..

సీతాపూర్ గ్రామంలో హస్తకళలకు ప్రాధాన్యం ఎక్కువ. దాదాపు ప్రతి ఇంటిలోనూ ఓ కళాకారుడు ఉంటారు. ఎక్కువ మంది వాటితోనే ఉపాధి పొందుతూ ఉంటా రు. కానీ వారికి లభించే ఆదాయం మాత్రం అత్యల్పం. అయినా దాన్నే చేస్తూ ఉంటారు కళాకారులు. ఇలాంటి గ్రామంలో ఓ మోస్తరు వ్యాపారస్తుల కుటుంబం నుంచి వచ్చింది నవ్య అగర్వాల్. పట్టణాల్లో చదువులు పూర్తి చేసింది. కానీ ప్రాజెక్టు వర్క్ కోసం మళ్లీ గ్రామానికి వచ్చింది. గ్రామంలో పరిస్థితులు చూసిన తర్వాత గ్రామసులు అబ్బురపరిచే కళానైపుణ్యానికి కొద్దిగా సృజనాత్మకత జోడిస్తే.. కళాకారులు, కార్మికుల బతుకు మారిపోతుందని ఆమె అంచనా వేసింది. మనసులో ఫిక్సయిన తర్వాత పెద్దగా ఆలోచించలేదు నవ్య. వెంట నే 2013లో ఐ వాల్యూ ఎవ్రీ ఐడియా (IVEI) పేరుతో ఒక సంస్థను ప్రారంభించింది.

తండ్రి నుంచి అప్పు తీసుకొని..

మొదట ఊరంతా తిరిగి నలుగురు వడ్రంగి పనివారితో మాట్లాడింది. వారి చేత కొన్ని మీనియేచర్ కళాఖండాలను చేయించి.. పనితీరుని అంచనా వేసింది. వాళ్లకి ఇంకాస్త శిక్షణ అవసరం అనిపించి కొన్ని ఉచిత కార్యశాలలు ఏర్పాటు చేసింది. తమకొచ్చిన పనిని చూపించడానికి అందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అదే ఉత్సాహంతో సొంత డబ్బులతో ఆధునిక యంత్రాలను తెప్పించింది. గంటకి ఇంత కూలీ అంటూ వారికి ఉపాధి కల్పించాలనుకుంది. ఇందుకోసం తన తండ్రి నుంచి అప్పు తీసుకుంది. నవ్య చెప్పిన అన్ని విషయాలు సావధానంగా ఆలకించిన తండ్రి మూడున్నర లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించాడు. కాకపోతే తమ వస్తువులకు అంత ఆదరణ ఉంటుందా? అని హస్తకళాకారులందరూ మొదట్లో సందేహించారు. ఆ అంచనాలను తలకిందులు చేస్తూ వారికి ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను అందిస్తూ, కొత్త మెళకువలు చెప్పేది. మొత్తం పన్నెండు మంది సిబ్బందితో పనులు మొదలుపెట్టింది. అందర్నీ తను చెప్పిన విధంగా ఉడెన్ ఆర్టికల్స్ తయారు చేయించేలా ఒప్పించేందుకు ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది.

కొత్త కొత్త డిజైన్లు

ఆ పన్నెండు మందిలో ఓ హౌస్ మెయిడ్ కూడా ఉంది. ఈమె చెక్కతో గాజులు చేయడంలో ప్రత్యేకమైన ప్రతిభ చూపింది. ఓ యువతి మెహందీ డిజైనింగ్‌పై అమిత ఆసక్తితో పనిచేసింది. హస్తకళాకారులందరికీ మొదట నవ్య అగర్వాల్ బేసిక్ డిజైన్ల తయారీ బాధ్యతను ఇచ్చేవారు. పెన్ స్టాండ్స్, వాల్ క్లాక్స్, ట్రేస్, స్నాక్ బౌల్స్ లాంటివి తయారు చేయించేవారు. అవి సిద్ధమైన తర్వాత అక్రాలిక్ పెయింట్, విరిగిపోయిన గాజు ముక్క లు, కుట్టు పనితో అందంగా ముస్తాబు చేయించేవారు. అందరి పనితనాన్ని కొద్దికొద్దిగా మెరుగుపరిచే ప్రయ త్నం చేసేవారు. దీంతో నవ్య అగర్వాల్ స్టార్టప్‌లో భాగంగా తయారు చేసే ఉత్పత్తులు చాలా ఆకర్షణీయగా రూపుదిద్దుకున్నాయి.

మార్కెటింగ్‌లో ప్రవేశించి..

కుకు క్రెట్ అనే సంస్థ నుంచి మొదటి ఆర్డర్ పొందింది నవ్య అగర్వాల్. వంద మిక్కీమౌస్ షేప్‌లో ఉన్న క్లాక్స్‌కు ఆర్డర్ వచ్చింది. ఒక్క క్లాక్ తయారీకి వంద రూపాయలు అయితే నూట పదిరూపాయలకు అమ్మా రు. అదే నవ్య కళ్ల జూసిన మొదటి లాభం. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు నవ్యకు సరైన ఆర్డర్స్ లభించలేదు. అయితే మొదటగా ఆర్డర్ ఇచ్చిన కుకు క్రెట్ అనే సంస్థ హఠాత్తుగా మూతపడడంతో నవ్య అగర్వాల్ మనసు మారింది. తర్వాత బొటిక్ షాపులను టార్గెట్‌గా మార్కెటింగ్ ప్రారంభించింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై లాంటి మెట్రో నగరాల్లోని దుకాణాల్లో వీటిని అందుబాటులో ఉంచడం ప్రారంభించింది. అయితే 2014లో ఐదు వందల వైట్ బోర్డ్ క్యాలెండర్స్ కోసం వచ్చిన ఆర్డర్ ఐ వాల్యూ ఎవ్రీ ఐడియా (IVEI) దశను మార్చివేసింది. ఈ ఆర్డర్ ద్వారా మంచి లాభాలు రావడంతో నవ్య అగర్వాల్ ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమేజాన్‌లోనూ నవ్య ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కార్పొరేట్ ఆర్డర్స్ సైతం అందుతున్నాయి.

పుల్ టైం వర్క్..

మొదట తన సంస్థలో పార్ట్‌టైంగా పనిచేసేలా హస్తకళాకారులతో ఒప్పందం చేసుకుంది నవ్య అగర్వాల్. తన ఉత్పత్తులు సక్సెస్ బాట పట్టడంతో వారిని పూర్తి స్థాయి ఉద్యోగులు నియమించుకుంది. ఇప్పుడు మొత్తం 18 మంది కళాకారులు ఐ వాల్యూ ఎవ్రీ ఐడియాలో పనిచేస్తున్నారు. వీరంతా గంటకు రూ. 60 వరకు సంపాదిస్తున్నారు. అంతకుముందు రోజంతా కష్టపడి పని చేసినా వీరికి రూ. 200 దక్కడమే గగనంగా ఉండేది. సంస్థ ఆదాయం కూడా అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. మొదటి ఏడాది ఐవీఈఐకి వచ్చిన ఆదాయం కేవలం లక్ష రూపాయలే. కానీ పట్టుదలతో నవ్య అగర్వాల్ చేసిన ప్రయత్నాలతో సంస్థ ఆదాయం రూ. 18 లక్షలకు చేరింది. ఆన్‌లైన్ ఆర్డర్స్‌తో పాటు.. కార్పొరేట్ బల్క్ ఆర్డర్స్, షాపుల ఆర్డర్స్ కూడా అనూహ్యంగా పెరుగడమే దీనికి కారణం. ఇది ఆ బృందం మొత్తానికి చాలా పెద్ద మొత్తం.
ఐవీఈఐ సంస్థ కేవలం ఇంటి అలంకరణకు ఉపయోగించే వస్తువులే కాదు, కార్పొరేట్ బహుమతులు, వ్యక్తిగత గిఫ్టులు తయారుచేస్తున్నది. దీంతో కళకూ చక్కని ఆదరణ లభిస్తున్నది. అన్నింటికీ మించి నవ్యకు వారి జీవితాల్లో మంచి మార్పు తీసుకొచ్చానన్న సంతృప్తి మిగిలింది!

కొత్త పద్ధతుల్లో, క్రియేటివ్‌గా పనిచేసే విషయంలో చిన్నమ్మాయిని కదా అని మొదట్లో నా సలహాలను తేలిగ్గా తీసుకునేవారు. దాంతో వాళ్ల వర్క్‌షాపులకు వెళ్లి కూర్చొని చెప్పి పని చేయించేదాన్ని. నేను చెప్పింది చేసిన తర్వాత వారి పనితనాన్ని చూసి వారే ఆశ్చర్యపోయేవారు. ఆ తర్వాత మరింత నేర్చుకునేందుకు ఆసక్తి చూపించారు. కొంత మంది అయితే మాకు కొత్తదనంతో పనిచేయడం నేర్పితే చాలు ఉచితంగా చేస్తామని ముందుకొచ్చారు. -నవ్య అగర్వాల్

మరింత విస్తరణ

భారత్‌లో హస్తకళల మార్కెట్ చాలా పెద్దది. అంతరించిపోతున్న కళను ప్రోత్సహించే విషయంలో ఇటీవలి కాలంలో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్‌ను ఆవిష్కరించింది. వీరికి ప్రొత్సాహం అందించే విషయంలో ఆన్‌లైన్ ఈ-కామర్స్ స్టార్టప్‌లు ముందడుగు వేస్తున్నాయి. దేశం నలుమూలల విశేషమైన చరిత్ర ఉండి ఆదరణ కోల్పోతున్న కళలకు ఇవి ప్రాణం పోస్తున్నాయి. ఇలాంటి స్టార్టప్స్ బాటలోనే నవ్య అగర్వాల్ కూడా నడుస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది హస్తకళాకారులతో తన IVEIను మరింత విస్తరించాలనే ప్రణాళికలు వేసుకుంటున్నారు.