మార్పుకోసం కృషి

పరువు హత్య జరిగినప్పుడు సమాజం తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ అంతటితో ఆగకుండా సమాజంలో పేరుకు పోయిన పాతకాలపు ఆలోచనా ధోరణిని మార్చడానికి కృషి చేయాలె. ఒకప్పుడు సంఘ సంస్కర్తలు సామాజిక పరివర్తన కోసం కృషి చేశారే తప్ప ఇటువంటి ఘటనలను తమ లబ్ధి కోసం ఉపయోగించుకోలేదు. యుక్తవయసులోకి అడుగిడిన యువతీ యువకులు నిష్కల్మశమైన ప్రేమతో పెళ్ళాడి జీవిస్తున్నప్పుడు, తండ్రి, ఇతర కుటుంబ పెద్దలు కత్తికట్టి వారిని బలితీసుకోవడం దిగ్భ్రాంతికరం. ఇటీవల మిర్యాలగూడలో తన కుమార్తె వివాహమాడిన వ్యక్తిని తండ్రి హత్య చేయించాడు. కుమార్తె ఆ యువకుడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నదని, ఆమె గర్భవతి అని తెలిసిన తర్వాత కూడా ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన నుంచి సమాజం తేరుకోకముందే హైదరాబాద్ నగరంలో మరో దారుణమైన దాడి జరిగింది. కన్న తండ్రి నమ్మించి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన కుమార్తె దవాఖానలో విషమ పరిస్థితుల్లో ఉన్నది. పిల్లల ప్రేమను అంగీకరించకుండా, వారి మానాన వారిని బతుకనీయకుండా కక్షగట్టి దాడులు చేయడం ఆందోళనకర పరిణామం. కొద్దికాలం కిందట నల్లగొండ జిల్లా లింగరాజుపల్లికి చెందిన ప్రేమ జంట పాణభయం ఉండటంతో ముంబయికి వెళ్ళి బతుకుతుంటే, యువతి తండ్రి మనసు మారినట్టు నటించి వారు తిరిగి రాగానే అల్లుడిని హత్య చేయించాడు. దీంతో ఆయన కుమార్తె కూడా ఆత్మహత్య చేసుకున్నది. హైదరాబాద్ నగరంలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో యువతిని ఆమె బంధువులు హత్య చేస్తే, అంబర్‌పేట్‌లో యువతి కుటుంబీకులు ఆమె భర్తను దారికాచి హతమార్చారు. తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధాన్ని చేసుకునే పాతకాలం కాదిది. పిల్లలు తమకు నచ్చిన వ్యక్తిని వివాహమాడటమే వాంఛనీయం. కానీ వాస్తవాన్ని జీర్ణించుకోలేని పెద్దలు ఇటువంటి క్రూరత్వానికి పాల్పడుతున్నారు. తమ కుమార్తె ప్రేమించి పెండ్లి చేసుకుంటే, అందులోనూ కులాంతర వివాహం చేసుకుంటే తమ పరువు పోతుందనే అభిప్రాయంతో తం డ్రి ఇతర బంధువులు హత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరువు హత్యలు ఉత్తరాది రాష్ర్టాలలో ఎక్కువ. గణాంకాలు పరిశీలిస్తే ఉత్త రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ర్టాల్లో ఇటువంటి దారుణాలు ఎక్కువ గా సాగుతున్నాయి. అక్షరాస్యత, సామాజికాభివృద్ధి ఎక్కువగా ఉన్న దక్షిణాది రాష్ర్టాల్లో కూడా ఇటువంటి దాడులు జరుగుతుండటం ఆశ్చర్యకరమే. యువతీయువకులకు తమ జీవిత భాగస్వామిని నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. కానీ వారి ఇష్టాయిష్టాలను గౌరవించే స్థితిలో తల్లిదండ్రులు, సమాజం లేకపోవడమే దారు ణం. యువతి తన తల్లిదండ్రులను విడిచి వెళ్ళి తనకు నచ్చిన యువకుడిని వివాహమాడితే పరిణామాలు ఎట్లా ఉంటాయో అందరికీ తెలిసిందే. తల్లిదండ్రులు తమ కుమార్తె ప్రేమికుడు లేదా భర్తపైన అపహరణ కేసు పెడుతారు. వారి కోసం వేట మొదలవుతుంది. ఇటువంటి సందర్భాల్లో పోలీసులు తల్లిదండ్రుల ప్రలోభాలకు లొంగి ప్రేమికులపై ఒత్తిడి తెచ్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. అన్ని ఒత్తిడులకు తట్టుకొని ప్రేమజంట నిలదొక్కుకున్నా, ప్రాణభయం వెం టాడుతూనే ఉంటుంది. ఈ కాలంలో ప్రేమ జంట భయపడి పారిపోయే పరిస్థితే రాకూడదు. తల్లిదండ్రుల తరఫున వీరిని ఎవరూ బెదిరించకుండా, ఒత్తిడి తేకుండా భరోసా, భద్రత కల్పించాలె. అయితే పోలీసులు కాపలా ఉండి భద్రత కల్పించడం ఎల్లవేళలా సాధ్యం కాదు. తల్లిదండ్రులు నమ్మించి ఆదమరిచిన ఏ క్షణంలోనో దాడులు చేయించవచ్చు. అందువల్ల కులాంతర వివాహాలు తప్పేమీ కాదనీ, అది గొప్ప విషయమే తప్ప, పరువు పోయేదేమీ లేదని తల్లిదండ్రులకు బోధపరుచాలె. పరువు హత్యలను నిరోధించడానికి ప్రత్యేక చట్టం చేయాలనే వాదన కూడా ఉన్నది. కానీ చట్టాల కన్నా సామాజిక మార్పు ప్రధానం. తెలంగాణలో కానీ ఇతర సమాజాల్లో కానీ కులాంతర వివాహాల సంఖ్య తక్కువేమీ లేదు. ఇటీవలికాలంలో ఉన్నత విద్యావంతులు, సామాన్యు లు, మధ్యతరగతి సహా అన్నివర్గాల వారు కులాంతర వివాహాలు చేసుకోవడం ఎక్కువైంది. కానీ పత్రికలు, టీవీ చానెల్స్ ఈ అభ్యుదయకర వార్తలకు తగినంత ప్రచారం ఇవ్వడం లేదు. దీనినొక ఆదర్శంగా ప్రసారం చేయడం లేదు. పరువు పేర సాగే హత్యలనే సంచలనాత్మకంగా ప్రసారం చేస్తున్నాయి. దీంతో ఒక హత్య ప్రభావం ఇతర తల్లిదండ్రులపై పడే ప్రమాదం ఉన్నది. ప్రేమ వివాహాలను నిరోధించడం ఇరువురికి సంబంధించిన లేదా కుటుంబానికి చెందిన వ్యవహారం కాదు. సామాజిక పరివర్తనను అడ్డుకోవడంగా గుర్తించాలె. పరువు పేరుతో ఒక హత్య జరిగినప్పుడు దానిని రాజకీయంగా లేదా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడానికి ఉపయోగించుకుందామనే ధోరణి కనిపిస్తున్నది. ఇది అత్యంత హీనమైన ఆలోచనాధోరణి. పరువు హత్య జరిగినప్పుడు సమాజం తీవ్రంగా ఖండించాల్సిందే. కానీ అంతటితో ఆగకుండా సమాజంలో పేరుకు పోయిన పాతకాలపు ఆలోచనా ధోరణిని మార్చడానికి కృషి చేయాలె. ఒకప్పుడు సంఘ సంస్కర్తలు సామాజిక పరివర్తన కోసం కృషి చేశారే తప్ప ఇటువంటి ఘటనలను తమ లబ్ధి కోసం ఉపయోగించుకోలేదు. వివిధ సంఘాలు, మేధావులు సామాజిక మార్పుకోసం చిత్తశుద్ధితో తమవంతు కృషిచేస్తే ఇవాళ ఇటువంటి దారుణ ఘటనలకు తావుండేది కాదు.