అర్షమొలలకు ఆయుర్వేద మందే అదుర్స్

-నేడు అంతర్రాష్ట్రీయ అర్శమొలల దినోత్సవం అర్షమొలలు, మూలశంఖ, మూలవ్యాధి, పైల్స్ పేరేదైనా వ్యాధి ఒకటే. ఈ వ్యాధిలో మలద్వారం మాంసపు గోడల్లో ఉండే రక్తనాళాలు ఉబికి, మోలల్లా బయటకు పొడుచుకొని వస్తాయి. సంస్కృతంలో అరి అంటే శత్రువు అని అర్థం. ఈ వ్యాధి ఒక శత్రువు బాధించినట్లు రోగిని తీవ్ర బాధలకు గురిచేస్తుంది. కాబట్టి దీనికి ఆయుర్వేదంలో అర్షస్సు మొలలు అని పేరుపెట్టారు. అదే రానురాను అర్షమొలలయ్యాయి. అర్షమొలలను ఆయుర్వేదమే చక్కగా అర్థం చేసుకుంది. అందుకే ఆధునిక కాలంలో కూడా ఈ వ్యాధికి ఆయుర్వేద చికిత్సే అదుర్స్ అని చెప్పొచ్చు.

అర్షమొలల వ్యాధికి కారణాలు:

1.అహారరూప కారణాలు: మనం తినే ఆహారాన్ని బట్టే అనేక వ్యాధులు వస్తుంటాయి. మినప, చెనగ పప్పుతో చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, భోజనం చేసిన తరువాత అరటి పండు, పనస పండు, సీతాఫలాలు తినడం, వేపుళ్లు, ముర్కులవంటి తడిలేని పదార్థాలు, పూరీలాంటి పిండిపదార్థాలు, గడ్డ పెరుగు, ఎక్కువగా తినడం, ఎక్కువ మద్యపానం వల్ల కూడా అర్షమొలల వస్తుంటాయి. 2. విహారరూప కారణాలు : చేసే పనులను బట్టి కూడా వ్యాధులు వస్తుంటాయి. సమయానికి భోజనం చేయకపోవడం, హడావుడిగా తినడం, తరచూ ఏదో ఒకటి తింటూనే ఉండటం, సరిగా నీరు తాగకపోవడం, పీకలదాకా భోజనం చేయడం, ఆకలి లేకపోయినా, పొద్దుపోయాక భోజనం చేయడం, తక్కువగా నిద్రపోవడం, రాత్రి చాలా సేపు మేల్కొని ఉండటం, పొగతాగడం, మల మూత్రాల విసర్జనను తరచూ ఆపుకోవడం.. ఇలాంటి పనులు వల్ల అర్ష మొలలు వచ్చే ప్రమాదం ఉంది. 3. బీజదోష (Hereditary) కారణాలు : పుట్టుకతోనే కొందరికి పేగుల్లో ఏర్పడే వికారాల వల్ల ఈ అర్షమొలల వ్యాధి వస్తుంది. 4. సహజ కారణాలు: వెంట వెంటనే గర్భధారణ వల్ల పేగుల రక్తనాళాలపై ఎక్కువ భారం పడడం వల్ల కూడా ఈ వ్యాధి కలుగుతుంది.

వ్యాధి రకాలు:

1. వాతజ అర్షస్సు, 2. పిత్తజ అర్షస్సు, 3. కఫజ అర్షస్సు, 4. సన్నిపాతజ అర్షస్సు, 5. రక్తజ అర్షస్సు

ఆయుర్వేద చికిత్స:

ఆయుర్వేదం ద్వారా అర్షమొలకు 1. ఔషధ చికిత్స, 2. శస్త్ర చికిత్స, 3. క్షార చికిత్స(Sclerosing agents), 4. అగ్నికర్మ చికిత్స (Cauterisation) అనే నాలుగు పద్ధతుల ద్వారా చికిత్స చేయొచ్చు. ఈ నాలుగు రకాల చికిత్సా పద్ధతులను చక్కగా వివరించి చెప్పింది ఆయుర్వేదం. అంతేకాదు ఈ వ్యాధిని తొందరగా, సరిగా చికిత్స చేసుకోకపోతే కలిగే ఇతర అపాయాల గురించి కూడా హెచ్చరించింది ఆయుర్వేదం. పథ్యం: ఆయుర్వేద మందులు తింటే పథ్యం ఉండాల్సి వస్తుందని చాలా మంది భ్రమ పడుతుంటారు. కానీ ఇది వ్యాధికి ఉంటుంది కాని వాడే మందుకు ఉండదు. అంటే వ్యాధి, చికిత్స, రోగి శరీరస్థితి బట్టి వైద్యులు రోగికి పథ్యం చెబుతుంటారు. అర్షమొలలతో బాధపడేవారు మినప పప్పు, సెనగ పప్పులతో చేసే వడ, ఊతప్ప, దోశ మొదలగు వస్తువులు, పెరుగు, మాంసాహారం, అరటిపండ్లు, పనసపండ్లు, సీతాఫలాలు, అధిక నూనె పదార్థాలు వ్యాధి పూర్తిగా తొలగిపోయేవరకు తినకూడదు. డాక్టర్ ఎన్. శ్రీధర్ ఎండీ (ఆయుర్వేదం), శల్యతంత్ర హెచ్‌ఓడీ, డా.బీఆర్‌కేఆర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సెల్ : 9848538535