పరేషాన్‌కు పరిష్కారం!

రైల్వే స్టేషన్‌లలోని గోడలు, ఫుట్‌పాత్‌లు, కరెంటు స్తంభాలు, కంపార్ట్‌మెంట్లపై అంతటా పాన్ ఉమ్మిన మరకలే! ఆ మరకలను తొలగించడానికి రైల్వే శాఖ ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రతి పది లీటర్ల యాసిడ్, అరవై వేల లీటర్ల నీటిని వాడాల్సి వస్తుంది. కొంత మంది చెడు ప్రవర్తన కారణంగా ప్రభుత్వానికి అనవసర వ్యయం పెరిగిపోతున్నది. ఆ వ్యయాన్ని తగ్గించేందుకు ముంబైలోని ఓ కళాశాలకు చెందిన 8 మంది విద్యార్థినులు ఓ వినూత్న పరిష్కారాన్ని అందించారు.
పాన్లు నమిలి ఎక్కడపడితే అక్కడ నిర్లక్ష్యంగా ఉమ్మివేయడం వల్ల అపరిశుభ్రంగా ఉండడమేకాకుండా జనాలు వాటి కారణంగా పలు రోగాల బారిన పడుతున్నారు. ఒక్క స్టేషన్‌లోనే కాదు అన్ని రైల్వేస్టేషన్లదీ అదే పరిస్థితి. ఫ్లోర్ మీద, ఫుట్ ఓవర్ బ్రిడ్జి మెట్లపై, రైళ్లలోనూ పాన్లు, గుట్కాలు నమిలి ఉమ్ముతున్నారు. వాటి శుభ్రతకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తున్నది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకు ముంబైలోని రామ్‌నారాయణ్ కళాశాలలో చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థినిలు వినూత్న పరిష్కారాన్ని చూపారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడానికి ముందుగా పాన్ షాప్ యజమానులను కలిసి పాన్‌లో వాడే పదార్థాలను గురించి ఆరా తీశారు. అనంతరం పారిశుధ్య కార్మికులను, రసాయనాలు ఉపయోగించే పలు సంస్థలను, ఇతర క్లీనింగ్ ఏజెంట్లను కలిసి వారి సలహాలను కూడా తీసుకున్నారు. సూక్ష్మజీవులు, ఎంజైముల రసాయనిక చర్య ద్వారా ఓ జెల్‌ను రూపొందించారు. ఆయా మరకలపై ఈ జెల్‌ను అంటించడం ద్వారా సులువుగా తక్కువ నీటిని ఉపయోగించి శుభ్రం చేయవచ్చని నిరూపించారు. ఈ విద్యార్థులు కనుగొన్న ఈ పద్ధతిని అనుసరించడం వల్ల ఖర్చు తగ్గడమేకాకుండా, రైల్వే స్టేషన్లు పరిశుభ్రంగా ఉంచేందుకు ఉపయోగపడుతున్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి మయూరి రీజ్ ఆధ్వర్యంలో ఐశ్వర్య రాజుర్కర్, అంజలీ వైద్య, కోమల్‌పరబ్, మైథిలీ, మిథాలీ పాటిల్, నిష్టా, శానిక అంబ్రే, శృతిక సావంత్‌లు ఈ ప్రాజెక్టును రూపొందించారు. పాన్ సే పరేషాన్ పేరుతో అపరిశుభ్రతపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోస్టన్‌లో జరిగిన జన్యు ఇంజినీరింగ్ యంత్రాల సాంకేతికతను ఉపయోగించి వినూత్నంగా డిగ్రీ చదవిన విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణల పోటీలో రెండు ఉత్తమ విభాగాల్లో బహుమతులు లభించాయి. ఒకటి పర్యావరణానికి మేలు చేసే ఉత్తమ పరిష్కారాల విభాగం, మరొకటి ఉత్తమ మానవ పరిష్కారాల విభాగంలో వచ్చాయి.