మొబైల్స్‌తో ఆటలు కాదు.. పుస్తకాలు చదువడం నేర్పుదాం

ఆమెకు చిన్నప్పట్నుంచీ పుస్తకాలంటే పిచ్చి.. పండుగలకు అందరూ కొత్త బట్టలు కొనుక్కుంటుంటే తను మాత్రం ఒక మంచి పుస్తకం కొని సంబురపడిపోయేది.. సింగపూర్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది.. మైసూర్‌లో ఉద్యోగం చేసింది. కానీ సంతృప్తి కలుగలేదు. ఇంకేదో చేయాలనే ఆలోచన. ఉద్యోగాన్ని వదిలేసి పిల్లల కోసం ల్రైబ్రెరీ ఏర్పాటు చేయాలనుకుంది. మొబైల్స్‌కు అడిక్ట్ అవుతున్న పిల్లల్ని మరిపించడానికి ఓ లైబ్రెరీ ఏర్పాటు చేసింది. 1500 పుస్తకాలతో మొదలైన ఆ లైబ్రెరీలో ప్రస్తుతం 7000 పుస్తకాలున్నాయి. పిల్లల్ని పుస్తకాలు చదివించడం వైపు ఎలా మళ్లించాలో చెబుతున్న బత్తుల హరిప్రియ జిందగీతో పంచుకున్న ముచ్చట్లివి.మనకు తెలిసి కాలేజీకి వెళ్లే విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లు, రిటైర్ అయిన వాళ్లు మాత్రమే ఎక్కువగా లైబ్రెరీకి వెళ్తుంటారు. మరి చిన్న పిల్లలు ఎందుకు వెళ్లరు? వాళ్లకి కావాల్సిన కథలు, బొమ్మలు, టైంపాస్ చేసేవి ఉండవు కాబట్టి. హరిప్రియ చిన్నప్పుడు ఎక్కువగా పుస్తకాలు చదువుతుండేది. అయితే ఎలాంటివి చదువాలో అప్పుట్లో గైడెన్స్ ఉండేది కాదు. అదే పిల్లల కోసం లైబ్రెరీ ఏర్పాటు చేయాలనే ఆలోచనకు పురుడు పోసింది.

సింగపూర్‌లో చదివి..

బత్తుల హరిప్రియది వనపర్తి. కానీ వారి కుటుంబం చాలా యేండ్ల కిందటే హైదరాబాదులో స్థిరపడింది. తండ్రి కృష్ణయ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో మేనేజర్‌గా చేసి రిటైర్ అయ్యారు. తల్లి జగదాంబ కుటుంబాన్ని చూసుకుంటుంది. హరిప్రియకు ముగ్గురు అక్కలు, ఒక తమ్ముడు. హరిప్రియ పదవ తరగతి వరకు హైదరాబాద్‌లోనే చదివింది. తరువాత కలకత్తాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్‌లో బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేసింది. ఆ తరువాత ఇండియాకు తిరిగి వచ్చింది. సింగపూర్‌లో కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసింది. ఉద్యోగం సంతృప్తినివ్వలేదు.

పుస్తకాలతోనే సరిపోయేది..

హరిప్రియ స్కూల్‌కి వెళ్తున్నప్పుడు ఎక్కువగా పుస్తకాలతోనే గడిపేది. మ్యాగజైన్స్, చందమామ కథలు, నవలలు చదువుతుండేది. ఇంట్లో అందరూ బట్టలు కొనుక్కుంటే తాను మాత్రం పుస్తకాలు కొనుక్కొనేది. సింగపూర్‌లో చదువుకుంటున్న సమయంలోనూ పుస్తకాలు చదువడం మానలేదు. సింగపూర్‌లో చాలా పెద్ద లైబ్రెరీలు ఉండేవి. హరిప్రియ ఎక్కువగా లైబ్రెరీలోనే గడుపుతుండేది.

అన్నకొడుకుని మార్చాలని..

సింగపూర్ నుంచి ఇండియా తిరిగి వచ్చిన హరిప్రియ ఎక్కువగా తన అన్నయ్య కొడుకుతోనే గడిపేది. చాలామంది పిల్లలు మొబైల్ ఫోన్స్‌కి అడిక్ట్ అవుతున్నారని హరిప్రియ గ్రహించింది. ఆ బాబుకి పుస్తకాలు చదువడం అలవాటు చేయాలనుకున్నది. రోజూ హరిప్రియ కథలు చదివి వినిపించేది. నెమ్మదిగా బాబుకి పుస్తకాలు చదువడం అలవాటు అయ్యింది. మరుసటి రోజు చెప్పకుండానే బాబే నిద్రలేచి పుస్తకాలు చదువడం గమనించింది. హరిప్రియ ఆనందానికి అవధుల్లేవు. అక్కడే ఒక ఆలోచన మెరిసింది.

పిల్లల కోసం లైబ్రెరీ..

ఇండియాకి వచ్చిన తర్వాత పిల్లల కోసం లైబ్రెరీ పెట్టాలనుకున్నది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకూ చెప్పింది. లైబ్రెరీ అనగానే వారు ముందు కొంత సంకోచించారు. ఆ తరువాత ప్రోత్సహించారు. అలా అంబర్‌పేట్, డీడీ కాలనీలోని ఇంట్లోనే లైబ్రెరీ పురుడుపోసుకుంది. తన అక్కలు, తమ్ముడి సహాయంతో చెన్నై, ఢిల్లీ, సింగపూర్‌ల నుంచి పుస్తకాలు సేకరించింది. అలా 1500 పుస్తకాలతో లైబ్రరీ మొదలైంది. దానికి బుక్‌షెల్ఫ్ అని నామకరణం చేసింది. లైబ్రెరీ అయితే పెట్టింది కానీ అక్కడ ఒక లైబ్రరీ ఉంది అని పిల్లలకి తెలియాలి కదా. కొన్ని పాంప్లెట్‌లు పంచింది. పిల్లలు ఒక్కొక్కరిగా రావడం మొదలుపెట్టారు. చిన్నపిల్లలు ఎలాంటి పుస్తకాలు ఇష్టపడుతారో అలాంటి పుస్తకాలన్నీ చూపించి చదివించేది. బొమ్మల్ని చూపించి ఎలా చదువాలి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాలు వివరించేది. దీంతో పిల్లలు లైబ్రెరీకి రావడానికి ఆసక్తి చూపేవారు. లైబ్రెరీకి వచ్చిన పిల్లలకు స్కూళ్లల్లో మార్కులు కూడా బాగా వచ్చేవి. ఎందుకంటే పుస్తకాలు చదువడం అలవాటయితే తరగతుల్లో చెప్పే పాఠాలు ఒక్కసారి వింటే చాలు గుర్తుండిపోతాయి. అలా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రతిరోజూ తమ పిల్లల్ని లైబ్రెరీకి పంపించేవారు. వారికి తెలిసిన వారికి కూడా లైబ్రెరీకి పంపించమని చెప్పేవారు. ఎన్ని పాంప్లెట్లు పంచినా రాని గుర్తింపు పిల్లలు తల్లిదండ్రుల ద్వారా రావడం హరిప్రియకు ఆనందాన్ని కల్గించింది.

ల్రైబ్రెరీ సమయం..

పిల్లలకి ఉదయాన్నే లైబ్రెరీకి వెళ్లడానికి సమయం ఉండదు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వారికి అనువైన సమయం. అందుకే పిల్లలకి వీలుండేలా లైబ్రెరీ సమయాన్ని కేటాయించింది. సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 4.30 నుంచి 8.30 నిమిషాల వరకు, ఆదివారం మాత్రం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. లైబ్రరీలో మొంబర్ అవ్వాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. తల్లిదండ్రుల పేరు, ఇంటి అడ్రస్ ఇస్తూ అడ్వాన్స్‌గా రూ.800 ఫీజు చెల్లించాలి. ఇక ప్రతి నెలా 250 రూపాయలు కట్టి కావాల్సిన పుస్తకాలను ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు. చదువడం పూర్తయిన తర్వాతే తిరిగి ఇవ్వాలి.

చదువు మాత్రమే కాదు..

పిల్లల్ని నాలుగుగోడల మధ్యే చదివిస్తే ఎవరికైనా విరక్తి కలుగుతుంది. అందుకే చదువుతో పాటు ఇతర యాక్టివిటీస్‌ను చేయించేది హరిప్రియ. పేపర్లతో రకరకాల డిజైన్స్ చేయించేది. వాటితో లైబ్రెరీని అందంగా తీర్చిదిద్దేవారు. పిల్లలు పుస్తకం చదివిన తరువాత ఏమి అర్థమయిందో ఇతరులకు వివరించమని చెప్పేది హరిప్రియ. ఒకరి తరువాత ఒక్కరు డెమో ఇచ్చేవారు. డెమో ఇవ్వడం వల్ల స్టేజ్‌ఫియర్ పోతుంది. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. లైబ్రెరీకి మొత్తం 80 మంది వరకు వస్తుంటారు. హరిప్రియ లైబ్రెరీతోనే కాలం గడుపకుండా ప్రతీవారం గవర్నమెంట్ స్కూల్‌కి వెళ్లి అక్కడి పిల్లలకి కథలు చెప్తుంటుంది. మీ ఇష్టాల్ని పిల్లల మీద రుద్దకండి. వాళ్లకి ఇష్టమైన వాటిని చేయనివ్వండి అని పిల్లల తల్ల్లిదండ్రులకు వివరిస్తున్నది. లైబ్రెరీ చిరునామా : బుక్‌షెల్ఫ్ లైబ్రెరీ, అంబర్‌పేట్, డీడీ కాలనీ, ఉస్మానియా యూనివర్సిటీ గేట్. ఈ మెయిల్: b.haripriya@gmail.comని సంప్రదించండి. చిన్నతనం నుంచే...పిల్లలకు చిన్నతనం నుంచే పుస్తకాలు చదువడం అలవాటు చెయ్యాలి. తల్లిదండ్రులు పిల్లలకి న్యూస్‌పేపర్ ఇచ్చి పెద్దగా చదివించాలి. తప్పు చదివితే సరిచేయాలి. అలా చేయడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, త్వరగా చదువగలుగుతారు, తెలివితేటలు పెరుగుతాయి, పిల్లలు, తల్లిదండ్రుల మధ్య మంచి బంధం ఏర్పడుతుంది. పిల్లల జీవితం ఒక మంచి పుస్తకంతో మొదలైతే జీవితంలో లీడర్‌గా ఎదిగేందుకు దోహదపడుతుంది. తల్లిదండ్రుల ఇష్టాలను పిల్లల మీద రుద్దకుండా వారికి నచ్చిన ఫీల్డ్‌ని సొంతంగా ఎంచుకొనేలా ప్రోత్సహించాలి. వారు అనుకున్నది సాధిస్తే సంతోషపడేవారిలో మీరే మొదటివారని గుర్తుంచుకోవాలి. -బత్తుల హరిప్రియ వనజ వనిపెంట గడసంతల శ్రీనివాస్