వాళ్లిచ్చిన జీవితమే ఇది!

అజయ్ ఘోష్.. నిజాన్ని నిర్భయంగా, ముక్కు సూటిగా చెప్పడం ఈయనకున్న అలవాటు. ఎవరెన్ని అనుకున్నా.. అది తప్పని తెలిస్తే వెంటనే ఖండిస్తారు. తాను చెప్పాల్సింది చెప్పేస్తారు. ఈ ముక్కుసూటి తనమే తనకు ఓ హోదాను కల్పించింది, కొంత ఇబ్బందినీ కలిగించింది. ఏదేమైనా కళను నమ్ముకున్నవారికి ఆ కళామతల్లి ఎప్పుడూ అండగా ఉంటుందనడానికి ఇతనే నిదర్శనం. పాత్ర ఏదైనా, ఘట్టమేదైనా.. క్యారెక్టర్‌లోకి ఇట్టే ఒరిగిపోయే తత్వమున్న ఈ నటుడు.. తాను ఈ స్థాయి వరకూ రావడానికి ఎన్నో కష్టాలను అనుభవించానని చెబుతున్నారు. ఎన్నో ఆటుపోట్ల నడుమ మొదలైన అజయ్ ఘోష్ సినీ ప్రస్థానం ఆయన మాటల్లోనే..

డప్పు రవి సెల్ : 9951243487

నన్ను థియేటర్‌లో చూసి వామ్మో రౌడీ గూండాగాడు వచ్చాడ్రా అనుకున్నారు. రంగస్థలం సినిమాలో హీరో నన్ను కొడుతుంటే..కొట్టు, కొట్టు, చంపెయ్ అని కేకలు, విజిళ్లు వేశారు. ఓ నటుడిగా అలాంటి సందర్భాలు నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేని నటన.. నా దృష్టిలో అది నటనే కాదు. అది కళామతల్లి ఇచ్చిన గొప్ప వరం. ఓ నటుడిగా, మీ అందరికీ తెలిసిన ఓ విలన్‌గా నేను ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు అనుభవించాను. ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాను. సినిమాల్లో వేషం కోసం నిద్రలేని రాత్రులు గడిపాను. ఎక్కడో ఓ సిటీ కేబుల్ చానెల్‌లో చిన్న యాంకర్‌గా మొదలు పెట్టి.. అజయ్ ఘోష్ ఓ విలనిజానికి సూట్ అవుతాడు అనే స్థాయి వరకూ వచ్చాను. ఈ ప్రయాణంలో ఎన్నో పరిచయాలు, ఎన్నో అనుభవాలు, మరెన్నో సంతోషాలు అన్నీ నా కళ్లముందు నేటికీ కదలాడుతూనే ఉన్నాయి.

అభ్యదయవాద కుటుంబం నుంచి..

మాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా. నాన్నగారు పత్తిపాటి ఆదినారాయణ. కమ్యునిస్టు కురువృద్ధుడు. ఉమ్మడి కమ్యునిస్టు పార్టీ నుంచి, కమ్యునిస్టులు రెండుగా చీలిపోయే వరకూ, ఆయన 7వ యేట నుంచి 86 యేండ్ల వయసు వరకూ పార్టీ కోసం పనిచేసిన గొప్ప వ్యక్తి. ఆయనలోని క్రమశిక్షణ నాకు పదోవంతు కూడా రాలేదు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు కూడా. మాది పేద కుటుంబం. ఒకవైపు ఉద్యమాల్లో పాల్గొంటూనే, వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించారు. నాకు కమ్యునిస్టు కురువృద్ధుడు అజయ్ ఘోష్ పేరు, నా సోదరులు చాగంటి భాస్కర్‌రావు, దేవినేని మల్లిఖార్జున్‌లకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, శ్రీకాకుళం సాయుధ పోరాటంలో అమరులైన వారిపేర్లు పెట్టారు. మా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల బిడ్డలకు కూడా పోరాట యోధుల పేర్లే పెట్టారు. నాకు కూడా అదే వారసత్వం అబ్బింది. నేను కూడా పలు కమ్యునిస్టు ఉద్యమాల్లో పాల్గొన్న. నా కొడుకుల పేర్లు భగత్ సింగ్, ఆజాద్. మా పేదరికం కారణంగా ఒంగోలులో స్నేహితుల సహాయంతో కిల్లీ కొట్టు పెట్టుకున్నాను. మళ్లీ స్నేహితులే ధైర్యం చెప్పడంతో నటనవైపు అడుగులు వేశాను.

కేబుల్ చానెల్‌లో న్యూస్ రీడర్‌గా..

చీరాల్లోని కేబుల్ నెట్‌వర్క్‌లో న్యూస్ రీడర్‌గా నా కెరీర్‌ను ప్రారంభించాను. నాకు చిన్నప్పటి నుంచి కల్చరల్ ఈవెంట్స్ అంటే చాలా ఇష్టం. పాఠశాల నుంచి కాలేజీల వరకూ ఎప్పుడు పోటీలు జరిగినా నా పార్టిసిపేషన్ తప్పనిసరిగా ఉండేది. మా ఉపాధ్యాయులు, లెక్చరర్లు బాగా ప్రోత్సహించేవారు. ఆ రోజులు నాకు నేటికీ గుర్తున్నాయి. పేద కుటుంబమే అయినా, చదువుల్లో ఎక్కడా తగ్గలేదు. అలా కమ్యునిస్టు పార్టీ సాంస్కృతిక విభాగాల్లో పనిచేశాను. పాటలు పాడడం, నాటికలు వేయడం, జనాన్ని చైతన్యవంతుల్ని చేయడం అప్పటి నుంచే నేర్చుకున్నాను. అదే నా నటనా జీవితానికి పునాది వేసింది. నా స్నేహితులు నన్ను బాగా ప్రోత్సహించారు. నా ప్రతిభ ఆధారంగా చీరాల సిటీ కేబుల్ న్యూస్ రీడర్‌గా పనిచేస్తూనే పలు చోట్ల ఆంధ్రభూమి, ఆహ్వానం పత్రికలకు కంట్రిబ్యూటర్‌గా పని చేశాను. ఈ క్రమంలోనే విజయవాడ సిటీ కేబుల్ ప్రోగ్రాం డైరెక్టర్‌గా పనిచేశాను. ఈ క్రమంలో హోస్ట్‌లుగా వచ్చిన కుంచె రఘు, సునీత, పృథ్వీ వంటి నటులు నువ్ సినిమాలకు సూట్ అవుతావన్నా.. ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేసుకుంటావు అని చెప్పేవారు. ఇక్కడికి వచ్చాక తెలిసింది సినిమాల్లో చేయడం అంత ఈజీ కాదని. అప్పుడే వెనక్కి వెళ్దామని నిర్ణయించుకున్నా. సమస్యలకు భయపడి వెనకడుగు వేస్తే.. బాగోదని నాకు నేనే ధైర్యం తెచ్చుకొని కృష్ణానగర్ బాట పట్టాను. ఈ క్రమంలో ప్రజానాట్య మండలికి చెందిన మురళి, జగ్గరాజుగారు, చందనా స్టూడియో వారు నన్ను ప్రోత్సహించారు. అప్పుడే నాకు మంచి సర్కిల్ దొరికింది. పరిచయాలు పెరిగాయి. వారి ద్వారా చిన్నచిన్న క్యారెక్టర్లు వేసేవాడిని.

పెయింటిగ్‌కు వెళ్లేవాడిని..

ఈ క్రమంలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సమస్యను ఎదుర్కొంటేనే జీవితమనుకొని కృష్ణానగర్, యూసఫ్‌గూడ, మాదాపూర్, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పెయింటింగ్‌లకు వెళ్లేవాడిని. ఒక్కోసారి బస్సుల్లో ప్రయాణించేందుకు డబ్బులు కూడా ఉండేవి కాదు. సిగ్గు పడకుండా దొరికిన పనల్లా చేశాను. రంగుల లుంగీ, టీ షర్ట్ వేసుకొని, చంకన సంచి తగిలించుకొని వెళ్తే.. వీడెవడో బేల్దారి(తాపీ)పనికి వచ్చాడనుకొనేవారు. అప్పుడు నా ఆర్థిక స్థోమత అది. అలా పనులకు వెళ్తూనే సీరియళ్లలో ప్రయత్నం చేశాను. రమణగారి కొడుకు ద్వారా బాపు గారు నరకాసుడు పాత్ర ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఈటీవి సుమన్ గారు నాకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. అప్పటి నుంచి నరకాసురుడు, భస్మారుసుడు, భకాసురుడు, అంధకాసురుడు.. ఇలా ఏ పాత్ర అయినా నాకు సూట్ అవుతుందనేవారు. అప్పుడు నేను నటన అనే ఆకలితో ఉన్నా కాబట్టి.. నాకు తృప్తి తీరేలా నటించాను. ఆ క్రమంలో నాకు ఆరు నెలల పాటు ఆశ్రయం కల్పించింది చందనా స్టూడియో.

వెండితెరపై లాయర్‌గా..

సుమంత్ చేస్తున్న రామ్మా చిలుకమ్మ సినిమాలో లాయర్‌గా తమ్మారెడ్డి భరద్వాజ గారు నన్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆయనకు నన్ను పరిచయం చేసింది మా టీవి రఘు. ఆయనే నాకు ఆశ్రయం కల్పించారు. వరసగా సీరియళ్లు చేస్తున్నప్పుడు.. నువ్ సినిమాలకు వెళ్లు.. నీ ప్రయాణం ఇక్కడే ఆగొద్దు అంటూ అక్కడా వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆ తర్వాత కణ్ణన్ డీఎస్ దర్శకత్వంలో సారాయి వీర్రాజు సినిమాలో విలన్‌గా అవకాశం వచ్చింది. కొద్దికాలం తర్వాత విజయేంద్ర ప్రసాద్‌గారి సినిమాలో విలన్‌గా చేశాను. అది కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. మళ్లీ నిరాశలో ఉన్నప్పుడు వాసు మాస్టర్ ప్రోత్సాహంతో దేవా కట్టా ప్రస్థానం సినిమాలో అవకాశం ఇచ్చారు. అదొక అద్భుతమైన సినిమా.. తెలుగు సినీ చరిత్రలో ఆ సినిమాకు ఓ పేజీ ఉంటుంది. కొద్ది కాలం తర్వాత విజయేంద్ర ప్రసాద్‌గారు నా కష్టాన్ని గుర్తుంచుకొని రాజన్న సినిమాలో దొరసాని దగ్గర పనిచేసే మల్లేశ్ పాత్రను ఇచ్చారు.

ఆస్కార్ రేసులో విశారణై..

తమిళ్‌లో నాకు అన్నం పెట్టింది వెట్రిమారన్. విశారణై వంటి ఆస్కార్ స్థాయి సినిమాను అందించిన జాతీయ దర్శకుడు. 2017లో తమిళంలో విడుదలైన విశారణై చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది. ఫారిన్ పిలిమ్ కేటగిరిలో ఇండియా తరఫు నుంచి ఈ చిత్రం అఫీషియల్‌గా ఎంట్రీ పొందింది. ఈ చిత్రం ద్వారా తెలుగు నటుడనైన నేను అత్యంత క్రూరుడైన పోలీస్ పాత్రలో నటించాను. నా జీవితానికి ఇది చాలు అనిపించింది. దానినే హిందీలో రీమేక్ చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా వరుసగా తమిళంలో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటు తెలుగు, అటు తమిళంలో నేను పనిచేసిన డైరెక్టర్ల దగ్గర్నుంచి ఎంతో నేర్చుకుంటున్నాను. నా ఆరాధ్య నటులు కోటా శ్రీనివాసరావుగారు, రావుగోపాలరావుగారు, ఎస్వీఆర్ గారు వీరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉంటూ విలనిజాన్ని ఎలా పండించారో.. నేనూ అదే చేయాలనుకుంటున్నాను. ఈ క్రమంలో వాళ్లంత కాకపోయినా, వారి నీడను తాకినా నటుడిగా నేను పరిపూర్ణమైనట్లే. నాకు ఎలాంటి భాషా భేదాలు లేవు.

కుటుంబ సహకారం మరువలేనిది..

నా భార్య సాంబలక్ష్మి 110 రూపాయలు డబ్బులు ఇచ్చి, ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు కృష్ణా రైలుకు పంపించింది. నేను వారికి దూరంగా ఉన్నా.. పిల్లలకు క్రమశిక్షణలో పెంచి ంది. వారి చదువులు ఆగకుండా తాను పనులు చేస్తూ.. ఇంటిని వెళ్లదీస్తూ, నాకు ఎంతో సహా యం అందించింది. నా ప్రయాణంలో నా భార్య సహకారం మరువలేనిది. ఎన్నో ఇబ్బందులను ఓర్చుకుంటూ తానే కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. నాకు వచ్చే డబ్బులను ఇంటి అవసరాలకు, పిల్లల చదువులకు పంపేవాడిని. అప్పుడు అన్ని కష్టాలు అనుభవించాను కాబట్టే.. కసిగా నటించాను. ఇప్పుడు నాకంటూ మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల ద్వారా కొద్దోగొప్పో సంపాదించగలుగుతున్నాను. నా స్నేహితులు సురేశ్ కుమార్, శ్రీనాథుడు, సారథి, విల్సన్, దక్షిణామూర్తి, ప్రసాద్ మాస్టర్, నాగమల్లేశ్వరావు, భానుమూర్తి, అచ్యుత్, రాధాకృష్ణా, రఘు, సుబ్బు, కామాక్షి మూవీస్ చెంచు రెడ్డిగారు, యజ్ఞామూర్తి, అక్సర్, సంధ్య రెడ్డిగారు, టీవీ8 సాయి, నాకు మొదటిసారి టీవీ కొనిచ్చిన అశోక్‌రావుగారు, పర్వతనేని శివప్రసాద్‌గారు, రామ్మోహన్, జాకీ, రాగిణి గారు, అరుణ్‌సాగర్ గారు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. పెద్ద లిస్టే ఉంది. నాకు ఆశ్రయం ఇచ్చినవాళ్లు, రూం రెంట్ కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిన వాళ్లు, నన్ను దర్శకులకు, ఇండస్ట్రీకి పరిచయం చేసినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ నేను కృతజ్ఞత చెప్పుకోవాలి. ఇది వాళ్లిచ్చిన జీవితమే. భవిష్యత్‌లో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేయాలని ఉన్నది.

విలన్ ముద్ర వేసింది పూరీ!

అన్నయ్యా ఇక నుంచి నువ్ విలన్ అంటూ నా మెడలో గంట కట్టింది మాత్రం డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీనే నా గాడ్‌ఫాదర్. ఆయన దర్శకత్వంలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయబట్టే.. తెలుగులో చాలా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగులో ఎన్నో సినిమాలు చేశాను. రంగస్థలం సినిమాలో నా పాత్రకు వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే సుకుమార్ గారు రంగస్థలం సినిమా ద్వారా నాకు ఓ హోదాను కట్టబెట్టారు. అందుకే తెలుగు తెరకు దర్శకులుగా పరిచయం అవుతున్న కుర్రాళ్లు.. కథలపై పట్టు సాధించమని చెబుతుంటాను. మిడిమిడి జ్ఞానంతో వస్తే.. సమయం, డబ్బులు వృథా అవుతాయి. తెలుగు సినీ పరిశ్రమ ద్వారా ఎన్నో వందల కుటుంబాలు బతుకుతున్నాయి. అందుకే చిన్న సినిమాలు చేసేందుకు కూడా నేను వెనుకాడడం లేదు. కొత్తవారు ఇండస్ట్రీకి పరిచయం కావాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను.