పర్యావరణహిత శానిటరీ ప్యాడ్స్!

పీరియడ్స్ సమయంలో మహిళలు వాడే నాసీరకం శానిటరీ ప్యాడ్స్ భూమిలో కరగడానికి 800 యేండ్ల పడుతుందట. పైగా వాటి వాడకం వల్ల మహిళలకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఢిల్లీకి చెందిన ఇద్దరు ఎంట్రపెన్యువర్స్ పర్యావరణ హితమైన ప్యాడ్స్‌ను తయారు చేశారు.
రోజు రోజుకీ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం కారణంగా ప్రజలు పలు రుగ్మతలకు గురవుతున్నారు. వీరిలో మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే, రుతుక్రమ సమయంలో వాడుతున్న శానిటరీ ప్యాడ్స్ కూడా పర్యావరణానికి ముప్పుగా మారాయి. ప్రస్తుతం మార్కెట్‌లో లభించే ప్యాడ్స్ తయారీలో చాలా వరకు ప్లాస్టిక్ కారకాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వల్ల మహిళలకు అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, ఇతర సమస్యలు వస్తున్నాయి. ఇంకో సమస్య ఏంటంటే.. వాటిని వాడిన తర్వాత భూమిలో కలిసిపోకపోవడం. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఢిల్లీకి చెందిన తన్వీ జాహ్రీ, రిక్షావ్ బొరా పర్యావరణ హితమైన శానిటరీ ప్యాడ్స్‌ను రూపొందించారు. కర్మెసి పేరుతో వీటిని అందరికీ అందుబాటులో ఉంచారు. వీళ్లు తయారు చేసిన ప్యాడ్స్ కేవలం 6నెలల నుంచి ఏడాదిలోపే భూమిలో కరిగిపోతాయి. వీటి తయారీకి మొక్కజొన్న పిండి, వెదురు నారను ఉపయోగించారు. వీటిపై సోషల్ మీడియా, తమ వెబ్‌సైట్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గివ్‌హర్5 అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వాటి ఉపయోగాలు వివరిస్తున్నారు. ఒక్క ఏడాదిలోనే 60శాతానికి పైగా తమ ప్యాడ్లను వినియోగిస్తున్నట్లు తన్వీ చెబుతున్నది. విశేషమేమిటంటే ఎక్కుమంది పురుషులు వీటిని కొనుగోలు చేసి, తమవారికి బహుమతిగా అందిస్తున్నారని అంటున్నది.