హ్యూమన్ కంప్యూటర్‌కు వందేండ్లు!

పెద్ద, పెద్ద సంఖ్యలు లెక్కించాలన్నా, గుణించాలన్నా వెంటనే క్యాలిక్యులేటర్ చేతిలోకి తీసుకుంటాం. కానీ.. ఎంత పెద్ద ఈక్వేషన్ అయినా సరే.. కంప్యూటర్ అవసరం లేకుండా, కంప్యూటర్ అంత కచ్చితత్వంతో ఫలితాన్ని చెప్పగలదు ఈమె. మానవ కంప్యూటర్‌గా చరిత్రకెక్కిన కేథరిన్ జాన్సన్ వందేండ్ల పుట్టినరోజు పూర్తి చేసుకున్నది.

అది 1960వ సంవత్సరం. మనిషిని స్పేస్ మిషన్‌లో అంతరిక్షానికి పంపడానికి ప్రయోగాలు జరుగుతున్న కాలం. ఎంతోమంది ఆఫ్రికన్, అమెరికన్ మేధావులు ఈక్వేషన్లు లెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. అందులో ఒక మహిళ మాత్రం అందరి కంటే వేగంగా.. క్లిష్టమైన సమస్యలను సైతం సులభంగా చేధిస్తూ ఫలితం అంతే వేగంగా పేపర్ మీద రాసి కమిటీకి అందిస్తున్నది. ఆమె పేరే.. కేథరిన్ జాన్సన్. యూఎస్‌ఏ స్పేస్ మిషన్‌లో పనిచేస్తున్న తన పనివేగాన్ని, మేధస్సును చూసి అందరూ ఆమెను హ్యూమన్ కంప్యూటర్ అని పిలిచేవారు. నేషనల్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఏరోనాటిక్స్ (నాసా)లో సభ్యురాలిగా ఆమె ఎంతో విలువైన సేవలందించింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి స్పేస్ మిషన్ సక్సెస్‌లో ఆమె పాత్ర చాలా ఉంది. వర్జీనియాలో పుట్టిన కేథరిన్ చిన్న వయసులోనే గణితశాస్త్రంలో అద్భుతాలు చేసింది. 1953 నుంచి 1986 వరకు నాసాకు సేవలందించింది కేథరిన్. ఈ రంగంలో నువ్వు పనిచేయలేవు. ఇక్కడ అందరూ మేధావులైన మగవారే ఉంటారు అన్న లింగ వివక్షను దాటుకొని గెలిచి నిలిచిందీమె. స్పేస్ ైఫ్లెట్ రీసెర్చ్ రిపోర్ట్ తయారుచేసిన తొలి మహిళా ఈమెనే.