సుచరిత

సమయ సూచీ (టైమ్ క్లాక్) పరికరాలను తొలుత నాగరికతా చిహ్నంగానే భావించారు. తొలితరం గడియారాలను గొలుసులకు తగిల్చి మెడలో వేసుకోవడమో, మణికట్టుకు కట్టుకోవడమో చేసేవారు. యాంత్రిక గడియారాలు మొదట్లో కొంచెం పెద్ద సైజులలోనే టేబుల్‌పై పెట్టుకొనేలా వుండేవి. చిన్నసైజులో, కదల్చడానికి తేలిగ్గా (పోర్టెబుల్) వుండే వాచీలు యూరప్‌లో మొట్టమొదట 16వ శతాబ్దంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అప్పట్లో అన్ని గడియారాలలోనూ ఒకే సమయం నమోదు కాకపోయేది. దీంతో చాలామంది కొన్ని గంటల సమయం కోల్పోయేవారు. క్రీ.శ. 1675లో చాలా చిన్న స్క్రూలు, గేర్లు, తేలికైన ఫ్రేములు తయారవడంతో మరింత చిన్నసైజు వాచీలు వచ్చాయి. అప్పట్లో ఇంగ్లండ్‌లో రెండో చార్లెస్ తన కోటుకు గొలుసును తగుల్చుకొని జేబులో గడియారం ఉంచుకొనే వారు. 19వ శతాబ్దంలో ప్రామాణికమైన సమయ సూచీలు లేక అనేక రైలు ప్రమాదాలూ జరిగినట్లు తెలుస్తున్నది. ఇలాంటి సాంకేతిక సమస్యలన్నీ అధిగమించిన తర్వాత 20వ శతాబ్ది చివరి నుంచీ ఎలక్ట్రానిక్, డిజిటల్, స్మార్ట్ వాచీలను చూస్తున్నాం.