టాక్సీవాలా ప్రేమాయణం

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. రాహుల్ సంక్రిత్యాన్ దర్శకుడు. జిఏ2పిక్చర్స్ మరియు యు.వి.క్రియేషన్స్ పతాకాలపై ఎస్‌కేఎన్ నిర్మిస్తున్నారు. ప్రియాంక జవాల్కర్ కథానాయిక. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని మాటే వినదుగా.. అంటూ సాగే గీతాన్ని చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. నిర్మాత మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన మాట వినదుగా.. గీతానికి రెండు మిలియన్‌ల వ్యూస్ రావడం ఆనందాన్ని కలిగిస్తోంది. సిద్ శ్రీరామ్ ఈ పాటతో మరోసారి మ్యాజిక్ చేశాడు. టాక్సీవాలా వినూత్నమైన కథతో రూపొందుతోంది. గ్రాఫిక్స్ పనుల కారణంగా విడుదల కాస్త ఆలస్యమైంది. గీత గోవిందం చిత్ర విజయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం. విజయ్ ఇమేజ్‌కు అనుగుణంగా అన్ని హంగులతో చిత్రాన్ని తీర్చిదిద్దాం. సస్పెన్స్ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఓ టాక్సీవాలా తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడు? ఆ అమ్మాయి కారణంగా అతని జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి అన్నది తెరపైన చూడాల్సిందే అన్నారు. మాళవిక నాయర్, కల్యాణి, మధునందన్, సిజ్జుమీనన్, రవిప్రకాష్, రవివర్మ, ఉత్తేజ్, విష్ణు తదితరులు నటిస్తున్నారు.