సహజమైన మందార నూనె!

ఇప్పుడున్న కాలుష్యానికి జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాం. జుట్టు పెరుగుదలకు మార్కెట్లో దొరికే అన్ని రకాల నూనెలను వాడుతున్నా ఎలాంటి ప్రయోజనం కనిపించదు. ఇంట్లో దొరికే మందారాలతో నూనెను తయారుచేసి వాడితే మంచి ఫలితముంటుంది.

ఇంట్లో తయారుచేసుకొనే నూనెలని వాడడం వల్ల జుట్టు రాలకుండా, ఒత్తుగా మారుతుంది. మందారం నూనె జుట్టును మృదువుగా, కాంతివంతంగా, పట్టులా కండీషనింగ్‌ను కూడా ఇస్తుంది. మందారనూనె జుట్టును నెరవకుండా చేస్తుంది. ముందుగా మందారం ఆకులు, పువ్వులను శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడవాలి. వీటిని మెత్తని పేస్టులా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని నూనెలో వేసి పొగలు వచ్చేవరకూ వేడి చేయాలి. చల్లారాక నూనెను వడపోయాలి. వచ్చిన నూనెను జుట్టుకు పట్టించి పది నిమిషాల పాటు మర్దన చేయాలి. రాత్రంతా ఇలాగే ఉంచి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తరువాత కండీషనర్ రాసుకోవాలి. జుట్టును పొడిగా ఆరబెట్టుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా తయారవుతుంది.